Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్
కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ
ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలి
రాష్ట్రం అంతటా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు
ప్రలోభపెట్టడం, భయపెట్టడం, దాడులకు తెగబడటం చేస్తున్నారు
ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదు
అన్నిచోట్లా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు
పవిత్రమైన తిరుపతి ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా టీడీపీ నేతలు దాడులు
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
తాడేపల్లి: రాష్ట్రం అప్రజాస్వామికంగా జరుగుతున్న మున్సిపల్ ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైయస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలని కోరారు. దాడులు, కిడ్నాప్ లు, అరాచకాలకు తెలుగుదేశం పార్టీ తెగబడుతున్న నేపథ్యంలో ప్రజాస్వామికంగా ఎన్నికలు సాధ్యమని ప్రశ్నించారు.
ఇంత బరితెగింపా?
రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైయస్ చైర్మన్ ఎన్నికలకు జరుపుతున్న ప్రక్రియ చూస్తుంటే ప్రజాస్వామికవాదులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. ప్రజల ద్వారా ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వైయస్ఆర్ సీపీ కార్పోరేటర్లు, కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీ ప్లాన్ – ఏ కింద ప్రలోభపెడుతున్నారు. వారు స్పందించకపోతే ప్లాన్-బీ కింద భయపెడుతున్నారు. అయినా ఫలితం లేకపోతే ప్లాన్ – సీ కింద దాడులు, కిడ్నాప్ లకు తెగబడ్డారు. నాలుగు సార్లు సీఎంగా అనుభవం ఉందని, నలబై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ఇదేనా ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ, గౌరవం? తిరుపతి కార్పోరేషన్ లో సైకిల్ గుర్తుపై తెలుగుదేశం పార్టీ తరుఫున గెలిచింది కేవలం ఒక్క కార్పోటర్ మాత్రమే. మిగిలిన అన్ని స్థానాల్లోనూ ఫ్యాన్ గుర్తుపై వైయస్ఆర్ సీపీ కార్పోరేటర్లు గెలుపోందారు. నిన్నటి వరకు వైయస్ చైర్మన్ పదవి కోసం మా పార్టీకి చెందిన కార్పోరేటర్లను ప్రలోభపెట్టారు, భయపెట్టారు. చివరికి డిప్యూటీ చైర్మన్ పదవికి పోటీ చేస్తున్న శేఖర్ రెడ్డి ఇంటిపై బుల్ డోజర్ తో దాడి చేయించారు. అయినా కూడా వైయస్ఆర్ సీపీ కార్పోరేట్లరు పార్టీపైన, పార్టీ అధినేత వైయస్ జగన్ గారి నాయకత్వంపైన అచంచల విశ్వాసంతో పార్టీకి అనుకూలంగా ఓటు వేసేందుకు వాహనంలో వెడుతుంటే, తిరుపతిలో ఆ వాహనంపై కిరాతకంగా తెలుగుదేశం వారు దాడి చేశారు. ఇటువంటి ఘటన చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. బలహీనవర్గాలకు సంబంధించిన మహిళ, ఉన్నత విద్యావంతురాలు తిరుపతి మేయర్ శిరీష ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్ళు, కర్రలతో దాడులు చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అదే వాహనంలో మహిళలు, బలహీనవర్గాలకు చెందిన కార్పోరేటర్లు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి కూడా ఉన్నారు. వారందరిపైనా కూడా ఇదే తరహాలో దాడి చేయడం ఎంత దుర్మార్గం.
టీడీపీ అరాచకాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాం
నిన్న సాయంత్రం హిందూపూర్ లో వైయస్ఆర్ సీపీ కార్పోరేటర్లను ఎత్తుకుపోయారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలోని వ్యవస్థలపై నమ్మకం లేక నిన్న ఎన్నికల కమిషన్ ను కలిసి వినతిపత్రం సమర్పించాం. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోంది, వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి, వైయస్ఆర్ సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయింది, పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అని వివరించాం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగేలా చూడాలని పార్టీ పరంగా విజ్ఞప్తి చేశాం. అయినా కూడా రాష్ట్రంలో ఎక్కడా వైయస్ఆర్ సీపీ కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు రక్షణ లేకుండా పోయింది. వందలాది మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కర్రలు, కత్తులు, రాళ్ళతో ఎన్నికల కోసం వెడుతున్న వైయస్ఆర్ సీపీ కార్పోరేటర్లు, కౌన్సిలర్ల వాహనాలపై పట్టపగలే దాడులకు తెగబడుతుంటే ఈ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ ఎందుకు చేతులు కట్టుకుని చూస్తుండి పోతోంది? 144, సెక్షన్ 30 అమలులో ఉన్నప్పటికీ కూడా ఎందుకు అంతమంది రోడ్డు మీదికి వస్తుంటే చట్టపరంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు? దీనిపై వైయస్ఆర్ సీపీ వెంటనే ఎన్నికల కమిషన్ కు కలిసి వివరాలు అందించడంతో పాటు మరోసారి ఫిర్యాదు చేయబోతున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలని కోరుతున్నాం.
పవిత్రమైన తిరుపతిలో టీడీపీ అరాచకాలు
అంతర్జాతీయంగా హిందూధర్మాన్ని గౌరవించే వారికి అత్యంత పవిత్రక్షేత్రం తిరుపతి. అలాంటి తిరుపతిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న అరాచకాలను ప్రపంచం అంతా చూస్తోంది. ఆనాడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర హోంమంత్రి అమీత్ షా కాన్వాయ్ పై రాళ్ళు రువ్వించారు. మరోసారి అధికారంలోకి రాగానే తిరుపతి లడ్డూలో కల్తీ అంటూ స్వామివారి పవిత్రతనే దెబ్బతీసేలా చేసిన దుశ్చర్యను ప్రజలు అంతా గమనించారు. ఇటీవలే వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు క్యూలైన్లలో తొక్కిసలాటకు గురై ఆరుగురు మృతి చెందారు. ఇప్పుడు తిరుపతి కార్పోరేషన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం ఏకంగా ప్రజాప్రతినిధుల వాహనంపై నడిరోడ్డుపై దాడి చేసి తిరుపతిలో శాంతిభద్రతలు లేవని ప్రపంచానికి చాటుతున్నారు. పవిత్ర క్షేత్రం కనీస మెజారిటీ కూడా లేకుండా డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎలా గెలవగలరు? తెలుగుదేశం పార్టీ తిరుపతి శ్రీవారి సన్నిధిలో చేస్తున్న అరాచకాలకు, అఘాయిత్యాలకు చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ‘ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది, సంఖ్యాబలం లేనిచోట్ల మేం పోటీ చేయమూ’ అని చంద్రబాబు గతంలో పెద్దపెద్ద మాటలు చెప్పారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో మీకు సంఖ్యాబలం ఎక్కడ ఉంది? అయినా కూడా అధికార దుర్వినియోగంతో ఎన్నికలను అపహాస్యం చేసేలా ఎందుకు పోటీ చేస్తున్నారు? ఈ అరాచకాలపై తక్షణం ఎన్నికల కమిషన్ స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలి. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని చోట్లా విజయం సాధించాం. ఒక్క తాడిపత్రిలో గెలవలేకపోయాం. అప్పుడు అధికారంలో ఉన్నాకూడా మేం ఎక్కడా తాడిపత్రిలో దొడ్డిదోవలో గెలుపుకోసం ప్రయత్నించలేదు. ఎక్కడా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. తెలుగుదేశం పార్టీ గెలుపును గౌరవించాం. రాష్ట్రంలోని ప్రజాస్వామికవాదులు ఈ పరిణామాలపై స్పందించాలి. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేకపోతే ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? నామినేషన్ ద్వారా ఆ పదవులను భర్తీ చేసుకోవచ్చు అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు.