Best Web Hosting Provider In India 2024
Krishna Vamsi: ఆ సినిమాలో అలా చేయడం తప్పే.. క్షమించండి: అభిమానికి సారీ చెప్పిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్
Krishna Vamsi: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కృష్ణవంశీ ఓ అభిమానికి క్షమాపణ చెప్పాడు. శ్రీఆంజనేయం మూవీలో ఛార్మీని హాట్ హాట్ గా చూపించడంపై తాజాగా అతడు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.
Krishna Vamsi: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు కృష్ణ వంశీ. తన మార్క్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఆ డైరెక్టర్.. 21 ఏళ్ల కిందట శ్రీ ఆంజనేయం అనే మూవీ తీసిన విషయం తెలుసు కదా. ఆధ్యాత్మికపరమైన ప్రాముఖ్యత ఉన్న అలాంటి సినిమాలో ఫిమేల్ లీడ్ నటించిన ఛార్మీ కౌర్ ఓవర్ ఎక్స్‌పోజింగ్ చాలా మందిని ఇబ్బంది పెట్టింది. దీంతో ఇప్పుడు దానికి అతడు సారీ చెప్పడం గమనార్హం.
అది తప్పే.. క్షమించండి: కృష్ణ వంశీ
నితిన్ హీరో, ఛార్మీ కౌర్ హీరోయిన్ గా 2004లో వచ్చిన మూవీ శ్రీఆంజనేయం. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా.. సినిమాను ఇష్టపడే వాళ్లు కూడా కొందరు ఉన్నారు. అయితే ఈ మూవీపై తాజాగా డైరెక్టర్ కృష్ణ వంశీ స్పందించాడు. సోమవారం (ఫిబ్రవరి 3) తన ఎక్స్ అకౌంట్లో ఫాలోవర్లతో అతడు ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని వేసిన ప్రశ్నకు కృష్ణ వంశీ హుందాగా స్పందిస్తూ.. తాను చేసిన తప్పును అంగీకరించాడు.
“శ్రీ ఆంజనేయంలాంటి భక్తి సినిమాలో ఛార్మీని ఎందుకు అలా చూపించారు సర్” అని ఓ అభిమాని ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనికి కృష్ణ వంశీ స్పందిస్తూ.. “తప్పేనండి.. క్షమించండి.. అలాంటి కాలంలో.. తప్పని పరిస్థితుల్లో.. చేసిన పనులు” అని అతడు అనడం విశేషం. తాను అలా చేసినందుకు క్షమాపణ చెబుతూనే.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని చేయాల్సి వచ్చిందని అతడు అన్నాడు.
శ్రీఆంజనేయం మూవీ గురించి..
శ్రీఆంజనేయం 2004లో వచ్చిన సినిమా. నితిన్, ఛార్మీ, అర్జున్, ప్రకాశ్ రాజ్, రమ్య కృష్ణ, చంద్రమోహన్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాలో హనుమంతుడి వీర భక్తుడిగా నితిన్ నటించగా.. ఆ హనుమంతుడి పాత్రలో అర్జున్ కనిపించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగిన అంజి పాత్రలో నితిన్ మెప్పించాడు. అయితే మూవీ స్టోరీ మాత్రం ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఐఎండీబీలోనూ కేవలం 4.9 రేటింగ్ మాత్రమే నమోదైంది. ఓ అమాయకమైన భక్తుడు, అతన్ని కాపాడటానికి ఆ దేవుడే మనిషి రూపంలో దిగి వచ్చే స్టోరీ రూపొందిన సినిమా ఇది. అయితే అప్పట్లో తన హాట్ హాట్ అందాలతో పేరు సంపాదించిన ఛార్మీని ఈ సినిమాలోనూ కృష్ణ వంశీ అలాగే చూపించే ప్రయత్నం చేశాడు. దీనిపైనే తాజాగా ఓ అభిమాని నిలిదీయడంతో అతడు క్షమాపణ చెప్పడం విశేషం.