Best Web Hosting Provider In India 2024
విజయవాడ: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతల అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్, ఇతర ఎన్నికల్లో టీడీపీ, జనసేన అరాచకాలను వైయస్ఆర్‌సీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ..‘తిరుపతిలో టీడీపీ, జనసేన గుండాలు రెచ్చిపోయారు. సిగ్గు లేకుండా కార్పొరేటర్లు, మహిళలపై దాడులు చేశారు. కూటమి ప్రభుత్వం లో దాడులు, దౌర్జన్యం పెరిగాయి. మేము నిన్ననే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. సిగ్గు లేకుండా కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను బెదిరించి, భయపెట్టి, ప్రలోభ పెట్టి లాక్కుంటున్నారు. అక్రమంగా నిర్వహించిన ఎన్నికలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.
పోలీసుల సమక్షంలోనే కార్పొరేటర్లపై దాడి: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
‘డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడింది. నిన్ననే మేము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. కానీ, పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి రక్షణ కవచంగా మారారు. పోలీసుల సమక్షంలోనే కార్పొరేటర్లపై దాడి చేసి ఎత్తుకుని వెళ్లారు. టెంపుల్ సిటీలో ఇలాంటి అరాచకానికి దిగడం దారుణం. నూజివీడులో మంత్రి పార్థసారథి ఎనిమిది మంది కౌన్సిలర్లను లాక్కున్నారు. ఎందుకు అధికార పార్టీ ఇంతగా భయపడుతోంది. ఈ ప్రభుత్వం వైఎస్ జగన్‌ను చూస్తే వణికిపోతోంది. అందుకే ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాంటి దమన కాండే జరుగుతుంది. ఈ అరాచకాలపై పోరాటం చేస్తాం` అని మల్లాది విష్ణు తెలిపారు.
మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ కరువు: మేయర్ భాగ్యలక్ష్మి
`రాష్ట్రంలో కూటమి పార్టీలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ కరువైంది. తిరుపతిలో మహిళా మేయర్, ఎంపీ, ఎమ్మెల్సీలు కారులో ఉండగా దాడి చేశారు. కార్పొరేటర్లను బస్సుపై దాడి చేసి ఎత్తుకుపోయారు. ఎస్పీ ఉండగానే ఇంత విధ్వంసం సృష్టించారు. వెంకటేశ్వర స్వామి చూస్తుండగానే ఈ అరాచకానికి పాల్పడ్డారు. మా పార్టీ కార్పొరేటర్లకి భద్రత కావాలని మేము నిన్ననే అడిగాం. పోలీసులు పూర్తిగా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి విధ్వంసం ఏనాడు జరగలేదు. ఏమాత్రం సిగ్గు ఉన్న టీడీపీ నేతలు ఇలా వ్యవహరించరు. ప్రజలే కూటమి నాయకులకు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.