Best Web Hosting Provider In India 2024
Parenting Tips: చిన్నారుల్లో గుండెపోటు సమస్య పెరగడానికి ప్రధాన కారణం ఇదేనా? పేరెంట్స్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
Parenting Tips: ప్రస్తుత కాలంలో యాబై ఏళ్లు పైబడిన వారే కాదు, చిన్నారుల్లో సైతం గుండెపోటు సమస్యలు కనిపిస్తున్నాయి. గుండె సంబంధిత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుని సమయానికి తగిన జాగ్రత్త తీసుకోగలిగితే ప్రాణాంతకం కాకపోవచ్చు.
కొంతకాలంగా దాదాపు అన్ని చోట్లా వినిపిస్తున్న వార్త చిన్నారుల్లో కూడా గుండెపోటుతో మరణాలు సంభవించడం. వృద్ధులు మాత్రమే కాదు, ఏడెనిమిదేళ్ల పిల్లల్లో కూడా గుండెపోటు మరణాలు కలుగుతున్నాయని వింటూనే ఉన్నాం. ఇంత చిన్న వయస్సులోనే అంత పెద్ద సమస్య రావడానికి కారణమేమై ఉండొచ్చు. గుండెపోటు లేదా హార్ట్ అటాక్ పెద్దలలాగే పిల్లల్లోనూ ఒకేలా ఉంటుందా.. దీనికి ప్రధాన కారణమేంటో తెలుసుకుందాం.
గుండెపోటు లేదా హృద్రోగ సమస్యలు పెరగడానికి కారణం మనం అనుసరిస్తున్న పేలవమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు. ఇవే పిల్లల గుండెను ప్రమాదానికి గురయ్యే పరిస్థితులకు దారి తీస్తున్నాయి. పిల్లలను పాఠశాల, ట్యూషన్లతో పాటు పాఠ్యేతర కార్యక్రమాలలో విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. దీనితో పాటు కొంత సమయం దొరికిన కాస్త సమయాన్ని మొబైల్స్‌కు అంకితం అవుతున్నారు. ఇలా చేయడం వల్ల వారిలో బద్దకం పెరిగిపోతుంది. ఇది చాలదన్నట్లు వారిని ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతికి దగ్గరగా పెంచుతుండటంతో ఆరోగ్యాన్ని చేజాతులారా నాశనం చేసుకుంటున్నారు. మీరు చూపిస్తున్న ఈ వైఖరి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
2022లో 9-12% ఉన్న భారతదేశ గుండె సంబంధిత సమస్యల రేటు, గత 2024-25లో 18-20%కి పెరిగింది, ఇది ఆందోళనకరమైన విషయం. ఈ మధ్య, కేవలం గ్యాస్ట్రిక్‌తోనే ఛాతీ నొప్పి వచ్చినా భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే, గుండెపోటు రేటు పెరగడానికి కారణం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
గుండెపోటుకు కారణాలు
1. కుటుంబ చరిత్ర:
కుటుంబంలో ఎవరికైనా హృద్రోగం లేదా గుండెపోటు వచ్చినట్లయితే, తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. పిల్లల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టండి. చిన్న వయస్సులో కనిపించే చిన్నపాటి నిర్లక్ష్యం వారికి పెద్ద సమస్యగా మారే ప్రమాదముంది.
2. పిల్లలు హృద్రోగం/గుండెపోటుతో బాధపడుతున్నట్లయితే ఎక్కువ శ్రద్ధ వహించండి
మీ పిల్లలు ఏదైనా తీవ్రమైన హృద్రోగం లేదా గుండెపోటుతో బాధపడుతున్నట్లయితే, ఎక్కువ శ్రద్ధ వహించండి. ఆహారం గురించి ఎక్కువ శ్రద్ధ వహించండి. సమయాన్ని కేటాయించుకుని క్రమం తప్పకుండా వైద్యులతో చెకప్ చేయించుకోండి. వారు ఇచ్చే సలహాలను తప్పకుండా పాటించండి. సమయానికి సరిగ్గా మందులు ఇవ్వండి.
3. పుట్టుకతో వచ్చే గుండె సమస్య
కొంతమంది పిల్లల్లో పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలు వస్తుంటాయి. గర్భంలో ఉన్నప్పుడే గుండె నిర్మాణంలో అసహజతలు ఉండి, రక్త ప్రసరణ సరిగా ఉండదు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే, గర్భిణీ స్త్రీలు తమ గర్భధారణ సమయంలో పౌష్టికాహారం తీసుకుంటూ వీలైనంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
4. కొన్ని వ్యాధులు/మాత్రల గురించి జాగ్రత్తగా ఉండండి
న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులను కలిగి ఉన్న చిన్న పిల్లలపై ఎక్కువ శ్రద్ధ వహించండి. అంతేకాకుండా, పిల్లలకు ఇచ్చే అధిక మోతాదు మాత్రలు గుండె ఆగిపోవడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో పిల్లల సంరక్షణలో ఎక్కువ రిస్కులు తీసుకోకుండా సమయానికి స్పందించి వైద్యుల సలహాలతోనే చికిత్స తీసుకోండి.
5. అధిక అధ్యయన ఒత్తిడిని కలిగించకండి
ప్రస్తుత సమాజంలో చదువుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. మీ పిల్లలపై స్టడీకి సంబంధించి ఎక్కువ ఒత్తిడిని తీసుకురాకండి. ఇప్పటికే పాఠశాల, ట్యూషన్, ఇతర కార్యక్రమాలలో బిజీగా ఉన్న పిల్లలు కొంత సమయం బయట గడపాలని కోరుకుంటారు. దానికి అవకాశం ఇవ్వండి. లేకపోతే ఈ ఒత్తిడిని తగ్గించుకునేందుకు, వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇది క్రమంగా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జాగ్రత్త వహించండి.
ఇంతకీ పిల్లలకు గుండెపోటు వస్తే ఏం చేయాలి?
పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు, వారి రోజువారీ కార్యకలాపాలు, ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. ఒక్కసారిగా గుండెపోటు వస్తే, బిగ్గరగా అరవండి. పిల్లలు మీ శబ్దానికి స్పందిస్తున్నారా, ఊపిరి పీలుస్తున్నారా అని ఖచ్చితంగా తెలుసుకోండి. అకస్మాత్తుగా పిల్లలు ఊపిరి పీల్చుకోకపోతే, సీపీఆర్ చేయండి. వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయండి. దగ్గరలో ఆసుపత్రులు ఉంటే, ఆలస్యం చేయకుండా మీరే తీసుకెళ్ళండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం