Best Web Hosting Provider In India 2024
Tanuku SI Audio Viral : ‘వాళిద్దరూ నా జీవితాన్ని సర్వనాశనం చేశారు’- ఆత్మహత్యకు పాల్పడిన తణుకు ఎస్సై ఆడియో వైరల్
Tanuku SI Audio Viral : తణుకు ఎస్సై సత్యనారాయణ మూర్తి ఆత్మహత్యకు ముందు తన స్నేహితుడితో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. తనను ఇద్దరు అధికారులు వేధించారని, ఎంతగా ప్రాధేయపడినా వినిపించుకోవడంలేదని మూర్తి ఆవేదన చెందారు. తనకు సంబంధం లేని విషయంలో ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నారు.
Tanuku SI Audio Viral : పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ఎస్సై సత్యనారాయణ మూర్తి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు మూర్తి తన స్నేహితుడితో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. ఇద్దరు తోటి ఉద్యోగులు కారణంగానే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది.
తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో జనవరి 31వ తేదీ ఉదయం ఎస్ఐ సత్యనారాయణమూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్ఐ మూర్తి ఓ కేసు విషయంలో ఆరోపణలను ఎదుర్కొని, సస్పెన్షన్‌కు గురయ్యారు. వీఆర్‌లో ఉన్న ఎస్ఐ మూర్తి సీఎం చంద్రబాబు పర్యటన బందోబస్తుకు వెళ్లే క్రమంలో శుక్రవారం ఉదయం స్టేషన్‌కు వచ్చారు. పీఎస్ బాత్రూమ్‌లోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
తేతలిలో గేదెల అపహరణ కేసులో ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఎస్సై మూర్తిని సస్పెండ్ చేశారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఎస్సై తన స్నేహితుడితో మాట్లాడారు. ఇద్దరు తోటి ఉద్యోగులు తన జీవితాన్ని నాశనం చేశారని, తనకు సంబంధం లేని విషయంలో ఇరికించి వేధిస్తున్నారని వాపోయారు. తన భార్య, పిల్లలను గురించి తలుచుకుంటే బాధేస్తుందని మూర్తి కన్నీరుపెట్టుకున్నారు.
ఆడియోలో ఇలా
తన స్నేహితుడికి కాల్ చేసిన ఎస్సై మూర్తి… రేంజ్‌కి రిపోర్ట్ చేయమని ఆర్డర్ వచ్చిందన్నారు. రేంజ్ గొడవేంటని స్నేహితుడు అడగగా, తనకేం తెలియదన్నారు. రేంజ్ లో రిపోర్టు చేయడం తన వల్ల కాదని, తన మనసు బాగాలేదని, ఇక జీవితంపై ఆసక్తి లేదని మూర్తి అన్నారు.
“నన్ను ఇబ్బంది పెట్టవద్దని ఆ ఇద్దర్ని ఎంతో ప్రాధేయపడ్డాను. కానీ వాళిద్దరూ నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. నా కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశారు. వారి మోసానికి నేను కుమిలిపోతుంటే వారు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్లూ వీఆర్ భీమవరంలోనే అనుకున్నాను. కానీ ఇక నా వల్ల కాదు. నన్ను కృష్ణా జిల్లాకు పంపిస్తారు… నేను ఒక రోజు కూడా అక్కడ ఉండలేను. విజయ, పిల్లలను తలుచుకుంటేనే ఎంతో బాధేస్తుంది” అని మూర్తి తన స్నేహితుడితో అన్నారు.
ఎస్సై మూర్తి మాటలు విన్న స్నేహితుడు..ఎలాంటి పిచ్చిపనులు చేయొద్దని వారించారు. వీఆర్‌లో ఎంతోమంది ఉన్నారని, కృష్ణా జిల్లా అయితే ఏమవుతుందని ధైర్యం చెప్పారు. కంగారుపడి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. నీకు అన్యాయం జరిగిన విషయం నిజమే, కానీ అందుకు చావు పరిష్కారం కాదన్నారు.
“నువ్వు లేకపోతే నీ భార్యాబిడ్డలను ఎవరు చూస్తారు? విజయకు(మూర్తి భార్య) ముందువెనుక, పుట్టింటికెళ్లి ఏడవడానికి కూడా ఎవరూ లేరు. నీ కుటుంబాన్ని ఎవరు ఆదుకోరు. నువ్వు చనిపోతే ఆ ఇద్దరు పశ్చాత్తాపంతో ఉద్యోగం వదిలిపెట్టరు. ఈ జిల్లాలో నీకు అన్యాయం జరిగింది. జిల్లా మారితే మార్పు వస్తుందేమో చూడు. లా అండ్ ఆర్డర్ వదిలేసి, లూప్ కావాలని అడుగు. కావాలంటే నేను వస్తాను. నా మాట విను. నువ్వు చచ్చిపోతే నీ కుటుంబం అన్యాయం అవుతుంది. నీ కుటుంబం గురించి ఒకసారి ఆలోచించు” అని ఎస్సై మూర్తి స్నేహితుడు వారించారు.
తేతలి పశువధ ఫ్యాక్టరీ కారణంగానే
ఎస్సై మూర్తి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎస్సై ఆత్మహత్య ఘటనలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్ల రాధాకృష్ణపై వైసీపీ ఆరోపణలుచేసింది. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేతగానితనంతోనే ఎస్‌ఐ మూర్తి ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు.
తేతలి ఫ్యాక్టరీ నుంచి గేదెలను అమ్మేస్తున్నారని, ఇలాంటి దొంగతనాల్ని ఎస్‌ఐ మూర్తి అరికట్టేందుకు ప్రయత్నించారన్నారు. ఆ ఫ్యాక్టరీ యజమానికి లోకల్ ఎమ్మెల్యే ఆరిమిల్లి కొమ్ముకాస్తున్నారన్నారు. ఆ పశువధ ఫ్యాక్టరీ కారణంగానే ఎస్‌ఐ మూర్తిపై సీఐలు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. దాంతో అతను బలవన్మరణానికి పాల్పడ్డారని కారుమూరి అన్నారు. ఇకనైనా ఆ పశువధ ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేశారు.
టాపిక్