Best Web Hosting Provider In India 2024
Sonu Sood Charity: ఏపీకి నాలుగు అంబులెన్స్‌లు విరాళమిచ్చిన నటుడు సోనూసూద్, తెలుగు పరిశ్రమకు దూరం కాలేదని వివరణ..
Sonu Sood Charity: ఆరోగ్యం-సామాజిక సంక్షేమాలకు సేవలు అందించే ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ కోసం నాలుగు అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అంబులెన్స్‌లు అప్పగించారు.
Sonu Sood Charity: అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు, సుదూర ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా సోనూ సూద్ ఫౌండేషన్ నాలుగు అంబులెన్సులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగించింది. అంబులెన్స్‌లను ఇచ్చిన సోనూసూద్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం అత్యవసర వైద్య చికిత్సలు, అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందేలా ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ఆశయంలో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి కావడంపై ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తాము అందించిన అంబులెన్సులతో ఆపదలో ఉన్నవారికి భరోసా లభిస్తుందని సోనూసూద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నటుడిగా అభిమానం చూపిన ప్రజలకు కృతజ్ఞతలు..
నటుడిగా తనపై ప్రేమ చూపించిన తెలుగు ప్రజలందరికీ సోనూ సూద్ కృతజ్ఞతలు తెలిపారు. వైద్య సదుపాయాలు సరిగ్గా లేని ప్రాంతాల కోసం నాలుగు అంబులెన్సులను ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చినట్టు వివరించారు. అంబులెన్సులు ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వానికి ఉపకరిస్తాయని చెప్పారు. కొన్ని జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు ఈ వైద్య సదుపాయం అవసరం అవుతుందని, రహదారులు లేని ప్రాంతాలకు వెళ్లి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నట్టు వివరించారు.
తెలుగు ప్రజలు తనకు అత్యంత ఆప్తులని వారికి ఏదైనా చేయటం నా బాధ్యతగా భావిస్తానని చెప్పారు. ఏపీ తనకు రెండో ఇల్లు లాంటిదని ఇక్కడి ప్రజల కారణంగానే నేను ఇంతటివాడిని అయ్యానన్నారు. ఆంధ్రా అంటే ప్రత్యేక ప్రేమ ఉందని, తన సతీమణి కూడా ఆంధ్రాకు చెందిన తెలుగువ్యక్తేనని చెప్పారు.
కోవిడ్ సమయంలోనే ప్రజలను ఆదుకోవాలన్న నా బాధ్యత మొదలైందని, ఎవరికైనా నేను ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నానని చెప్పారు. సమాజానికి మేలు చేయాలన్న విషయంలో సీఎం చంద్రబాబు చాలా మందికి స్పూర్తి ఇస్తారన్నారు. తనకు ఎలాంటి రాజకీయపరమైన ఆశలు లేవని, నేను సామాన్య వ్యక్తిని, ప్రజల మనిషిని అన్నారు.
సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనే నన్ను ఇలా నడిపిస్తోందని చెప్పారు. కోవిడ్ సమయం నుంచి సీఎం చంద్రబాబుతో నేను టచ్ లో ఉన్నాననని, ఇప్పుడు స్వయంగా బాబె ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పారు. ఏపీని అభివృద్ధి చేయటంలో భాగస్వామ్యం వహించేందుకు అంబులెన్సులను ఇచ్చానని చెప్పారు.
సూద్ ఫౌండేషన్ ప్రతీ సామాన్య వ్యక్తికోసం పనిచేస్తోందని అవసరమైతే ప్రభుత్వాలతోనూ కలిసి పనిచేస్తామన్నారు. అంబులెన్సులు ఎంత అన్నది ముఖ్యం కాదు ప్రజలతో ఉన్న అనుబంధం ముఖ్యమన సోనూ సూద్ చెప్పారు.
ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వీటిని ఉపయోగిస్తారని అనుకుంటున్నట్టు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కూడా త్వరలోనే కలుస్తానన్నారు. ఫతే సినిమా సీక్వెల్ కోసం పనిచేస్తున్నట్టు చెప్పారు. టాలీవుడ్ లో పనిచేసేందుకు సిద్ధంగానే ఉన్నానన్నారు. తెలుగు దర్శక నిర్మాతలకు ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నానని చెప్పారు. హీరో, విలన్ కేరక్టర్లు మాత్రమే కాదు నటుడిగా ఏ రోల్ చేసేందుకైనా రెడీగా ఉన్నట్టు సోనూ సూద్ చెప్పారు.
టాపిక్