Best Web Hosting Provider In India 2024
Horror OTT: తెలుగులో నేరుగా ఓటీటీలో రిలీజైన తమిళ్ బ్లాక్‌బస్టర్ సైన్స్‌ఫిక్షన్ హారర్ మూవీ – ఎందులో చూడాలంటే?
Horror OTT: తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ బ్లాక్ తెలుగులో రిలీజైంది. డార్క్ పేరుతో డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సైన్స్‌ఫిక్షన్ హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో జీవా, ప్రియా భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించారు.
Horror OTT: గత ఏడాది తమిళంలో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది బ్లాక్ మూవీ. జీవా, ప్రియా భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తాజాగా తెలుగులోకి వచ్చింది. డార్క్ పేరుతో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. డార్క్ మూవీకి కేజీ బాలసుబ్రమణి దర్శకత్వం వహించాడు.
యాభై కోట్ల కలెక్షన్స్…
గత ఏడాది అక్టోబర్‌లో తమిళ వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు హారర్, సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడిస్తూ దర్శకుడు డార్క్ మూవీని తెరకెక్కించాడు. స్టోరీ, ట్విస్ట్‌లతో పాటు జీవా యాక్టింగ్ బాగుందనే కామెంట్స్ వచ్చాయి. ఈ సినిమా కథ మొత్తం జీవా, ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్స్ చుట్టూ ఓ విల్లా నేపథ్యంలోనే సాగడం గమనార్హం.
బీచ్ దగ్గరలోని విల్లాలో…
వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యాభర్తలు. ఆఫీస్‌కు వన్ వీక్ హాలీడేస్ రావడంతో బీచ్ దగ్గరలో తాము కొత్తగా కొన్న కొత్త విల్లాలో సరదాగా గడపాలని ఇద్దరు ప్లాన్ చేస్తారు. విల్లాలో వారికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.
తమ ఎదురుగా ఉన్న విల్లాలో అచ్చుగుద్దినట్లు వసంత్, అరణ్య పోలికలతోనే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. తమలాగే ఉన్న వారిని చూసి భయపడిపోయిన వసంత్, అరణ్య గేటెడ్ కమ్యూనిటీ నుంచి పారిపోవాలని అనుకుంటారు. ఎన్నిసార్లు ప్రయత్నించిన తమ విల్లా దగ్గరే వచ్చి ఆగిపోతుంటారు.
అనుకోకుండా అరణ్య కనిపించకుండాపోతుంది. ఆమె మిస్సింగ్‌కు వసంత్ కారణమని పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకెళతారు. ఆ తర్వాత ఏమైంది? అసలు ఈ విల్లాలో ఏం జరుగుతుంది? వసంత్, అరణ్య రూపురేఖలతో ఉన్నవాళ్లు ఎవరు? ఈ మిస్టరీకి 1964 కాలంలో మనోహర్ అనే వ్యక్తి చేసిన హత్యలకు సంబంధం ఏమిటి? తన భార్యను వసంత్ ఎలా కాపాడుకున్నాడు? అన్నదే బ్లాక్ మూవీ కథ.
హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో…
డార్క్ మూవీకి సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు. కోహెరెన్స్ అనే హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో దర్శకుడు బాలసుబ్రమణి డార్క్ మూవీని తెరకెక్కించినట్లు ప్రచారం జరిగింది. ఈ సినిమాతోనే లాంగ్ గ్యాప్ తర్వాత తమిళంలో జీవా, ప్రియా భవానీ శంకర్ కమర్షియల్ సక్సెస్‌లను అందుకున్నారు.