Best Web Hosting Provider In India 2024
CPM AP Secretary: సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి వి.శ్రీనివాసరావు ఎన్నిక, చంద్రబాబుపై బృందాకారత్ విమర్శలు
CPM AP Secretary: సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. మరోవైపు వయస్సు నిబంధన కారణంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎంఏ గఫూర్ తన బాధ్యతల నుంచి రీలివ్ అయ్యారు.కొత్త కార్యదర్శి ఎన్నిక సందర్భంగా ర్యాలీలో బృందాకారత్ బాబు,బీజేపీలపై విమర్శించారు.
CPM AP Secretary: సీపీఎం ఆంధ్రప్రదేశ్ 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో మూడు రోజుల పాటు జరిగాయి. మహాసభ నిర్వహించే ప్రాంతానికి ఇటీవలి మరణించిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నగర్‌గా నామకరణం చేశారు. ఈ మహాసభల్లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్, బీవీ రాఘవులు, ఎంఏ బేబీ, కేంద్ర కమిటీ సభ్యులు ఆర్. అరుణ్ కుమార్, బి.వెంకట్, కె.హేమలత, ఎస్.పుణ్యవతి తదితర జాతీయ నేతలు పాల్గొన్నారు. తొలి రోజు ప్రారంభ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు. వామపక్షాల ఐక్యత గురించి వివరించారు.
మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో సీపీఎం బలోపేతం, వామపక్షాలు, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల ఐక్యతపై చర్చించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి దాదాపు 500 మందిపైగా ఎన్నికైన ప్రతినిధులు, పరిశీలకులు మహాసభకు హాజరయ్యారు. రాష్ట్రంలో సీపీఎం పరిస్థితి, పార్టీ నిర్మాణం, లోటుపాట్లుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కార్యదర్శి నివేదికను మహాసభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చించి, తమ అభిప్రాయాలను తెలిపారు. అలాగే ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై కూడా వివరించారు. అనంతరం నివేదికను ఏకగ్రీవంగా మహాసభ ఆమోదించింది.
రాష్ట్రంలోని రైతు, కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, యువజన, దళిత, గిరిజన, మైనార్టీ, మహిళ, ప్రజా సమస్యలు, పోలవరం, అమరావతి, విశాఖ ఉక్కు, కడప ఉక్కు వంటి వివిధ అంశాలతో కూడిన 39 తీర్మానాలకు మహాసభలో ఆమోదం లభించింది. మహాసభ ప్రారంభ సూచికగా సీనియర్ నేత పి. మధు సీపీఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నేతలు, ప్రతినిధులు నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర నలుమూలల నుండి నాలుగు జాతాలు నెల్లూరు చేరుకున్నాయి.
వైజాగ్ నుంచి స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ జాతా, పోలవరం ప్రాంతం నుంచి పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావసం కల్పించాలనే జాతా, కడప నుంచి కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలనే జాతా, రాజధాని ప్రాంతం నుంచి ప్రజా రాజధాని నిర్మాణం చేయాలనే జాతాలకు జాతీయ నేతలు స్వాగతం పలికారు.
ఇటీవలి మరణించిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు, కేరళ మాజీ మంత్రి కొడియేరి బాలకృష్ణన్, స్వతంత్ర సమరయోదులు ఎన్. శంకరయ్య, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరు రుద్రరాజు సత్యనారాయణ రాజు, వియత్నాం కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి ఎన్‌గువెన్ పూట్రాంగ్, చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రజా గాయకుడు గద్దర్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, ప్రముఖ గాయని లతా మంగేష్కర్, మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ వంటి వంది మందికి పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి కమ్యూనిస్టులు నేతలు, ప్రముఖులకు సీపీఎం రాష్ట్ర మహాసభ సంతాపం తెలిపింది.
50 మందితో నూతన కమిటీ ఎన్నిక
50 మందితో నూతన కమిటీ, 15 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం ఎన్నిక అయింది. రాష్ట్ర కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు తిరిగి ఎన్నిక అయ్యారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా వై.వెంకటేశ్వరరావు, సీహెచ్ బాబూరావు, వి. ఉమామహేశ్వరరావు, డి.రమాదేవి, కె.లోకనాథం, కె.ప్రభాకర్ రెడ్డి, వి. రాంభూపాల్, వి.వెంకటేశ్వర్లు, కె.సుబ్బరావమ్మ, మూలం రమేష్, బి.తులసీదాస్, కిల్లో సురేంద్ర, బి.బలరాం, ఏవీ నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బి. బలరాం, రాష్ట్ర కేంద్రం నుంచి ఏవీ నాగేశ్వరరావు కొత్తగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.
అయితే ఈ మహాసభలో సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.ఎ గఫూర్, మంతెన సీతారాం రిలీవ్ అయ్యారు. సీపీఎం నిబంధన ప్రకారం వయస్సు 75 ఏళ్లు దాటితే ప్రధాన బాధ్యతల నుంచి రిలీవ్ అవుతారు. ఈ ప్రక్రియ అఖిల భారత స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అమలు అవుతోంది. అందులో భాగంగానే ఎంఎ గఫూర్, మంతెన సీతారాంల వయస్సు 75 ఏళ్లు క్రాస్ చేయడంతో రిలీవ్ అయ్యారు.
భారీ ప్రదర్శన…బహిరంగ సభ
అనంతరం నెల్లూరులోని ఆత్మకూరు బస్ కాంప్లెక్స్ నుంచి వీఆర్ కాలేజీ గ్రౌండ్ (మల్లు స్వరాజ్యం ప్రాంగణం)లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ దారిపొడువున మహిళలు, వివిధ సంఘాల ప్రతినిథులు పూల వర్షం కురిపించారు. ర్యాలీ మార్గమధ్యలో కమ్యూనిస్టు ఉద్యమ నేత, సీపీఎం మొట్ట మొదటి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
వీఆర్ కాలేజీ గ్రౌండ్‌కు ర్యాలీ చేరుకున్న తరువాత భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో బృందా కరత్ మాట్లాడుతూ కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని చంద్రబాబు నోటిని కట్టేసుకున్నారని, కేంద్రాన్ని నిలదీయటం లేదని విమర్శించారు. బాబు అంటే సిగ్గులేని చంద్రబాబు అని బృందా కరత్ విమర్శలు గుప్పించారు. పోలవరానికి నిధులు, వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోసం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లటం లేదని, తనపై ఉన్న కేసులు, స్వప్రయోజనాల కోసమే వెళ్తున్నారని ధ్వమజెత్తారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్