Best Web Hosting Provider In India 2024
అధికారం కోసం కూటమి నాయకుల అడ్డదారులు
రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లపై దాడులు
ప్రలోభాలకు లొంగని వారికి బెదిరింపులు, ఆస్తులు ధ్వంసం
కిడ్నాప్లతో భయకంపితులను చేస్తున్న కూటమి
అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్న పోలీసులు
ప్రెస్మీట్లో మల్లాది విష్ణు ఆక్షేపణ
విజయవాడ: మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి దౌర్జన్యాలపై మరోసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు వైయస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ మల్లాది విష్ణు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్, పార్టీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ తదితరులు ఎస్ఈసిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ..అడ్డదారిలో విజయం సాధించడమే లక్ష్యంగా మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి నాయకులు చేస్తున్న రౌడీయిజం, అనైతిక విధానాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. తిరుపతిలో ఓటింగ్‌కు వెళ్తున్న తమ పార్టీ కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసి ధ్వంసం చేయడంతో పాటు, నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఆయన తెలిపారు. చివరకు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను కూడా టీడీపీ గూండాలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఘటన చూస్తే.. మనం ఏపీలో ఉన్నామో.. బీహార్‌లో ఉన్నామో అర్థం కాని పరిస్థితి అని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు జరిగిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొందని ఎస్ఈసీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ఎన్నికలకు ముందు నుంచే ఎస్ఈసీకి చెప్పామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్తూ అప్రమత్తం చేస్తూనే ఉన్నామని మల్లాది విష్ణు తెలిపారు. తిరుపతి కార్పొరేటర్లకు భద్రత కల్పించమని ప్రాధేయ పడినా పోలీసులు పట్టించుకోలేదని, తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరించారని చెప్పారు. పవిత్రతకు మారుపేరైన తిరుపతి విశిష్టతను కూటమి నాయకులు దౌర్జన్యకాండతో కాల రాస్తున్నారని, కార్పొరేటర్లను, ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకునేందుకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు బరిలోకి దిగి ప్రలోభాలకు గురి చేశారని, లొంగని వారిని బెదిరించారని వెల్లడించారు. అందుకే వరసగా మూడు రోజుల నుంచి ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని వివరించారు. తిరుపతిలో తమ పార్టీకి కేవలం ఒకే కార్పొరేటర్ ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో, డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ చేసిన అరాచకాలు, దౌర్జన్యాలను ప్రజలే ఈసడించుకుంటున్నారని మల్లాది విష్ణు వివరించారు.