Best Web Hosting Provider In India 2024
Poultry Industry: తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమపై వైరస్ పంజా, భారీగా చనిపోతున్న కోళ్లు
Poultry Industry: ఏపీ, తెలంగాణల్లో పౌల్ట్రీ ఫారంలలో అంతు చిక్కని వైరస్‌తో భారీగా కోళ్లు మరణిస్తున్నాయి. వలస పక్షులతో విస్తరించిన వైరస్ వల్ల కోళ్లు వ్యాధుల బారిన పడుతున్నాయని పశు సంవర్థక శాఖ చెబుతోంది.వైరస్ నిర్ధారణకు భోపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్‌కు నమూనాలను పంపారు.
Poultry Industry: తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమకు అంతు చిక్కని వ్యాధి పీడిస్తోంది. గత కొన్ని వారాలుగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఏటా డిసెంబర్-ఫిబ్రవరి మధ్య కాలంలో కోళ్లలో మరణాలు సహజంగా ఉండేవే అయినా ఈ ఏడాది వేల సంఖ్యలో కోళ్లు మరణించాయి. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో తెలియక పౌల్ట్రీ ఫామ్స్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
వైరస్ కారణాలను ఇప్పటి వరకు గుర్తించకపోవడంతో దీని తీవ్రత ఎంత ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలో నాటు, బ్రాయిలర్ కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోయాయి. మొదట ఒక్క కోడికి వైరస్ సోకిందని గుర్తించిన సా యంత్రానికి అదే షెడ్డులో పెంచుతున్న మొత్తం కోళ్లు వైరస్‌కు గురవుతున్నాయి.
కార్తీక మాసం తర్వాత ధరలు పుంజుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వైరస్ వ్యాపించడంతో మళ్లీ నష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బాయిలర్ ధరలు కిలో రూ.220 వరకు ఉండటంతో లాభాలు వస్తాయని అంతా భావించారు. అనూహ్యంగా వైరస్‌తో వేల కోళ్లు చనిపోతుండటంతో పౌల్ట్రీ నిర్వాహకులు బెంబేలెత్తి పోతున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో డిసెంబరు నుంచి రెండు నెలల వ్యవధిలోనే లక్షకు పైగా కోళ్లు వైరస్‌తో చనిపోయాయి. కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో వాటిని సమీపంలోనే పూడ్చి పెడుతున్నారు. వైరస్ సోకకుండా మిగిలి ఉన్న ఫారాల్లో కోళ్లకు ఎప్పుడు తెగులు సోకుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.
హ్యాచరీల యజమానులు కోళ్లను పెంచి నిర్ణీత బరువుకు చేరిన తర్వాత కంపెనీలకు కిలోల లెక్కన అప్పగిస్తారు. ఒక్కో బ్యాచ్‌నూ 35 నుంచి 40 రోజులపాటు పెంచుతారు. గరిష్టంగా 65 రోజుల్లో ఒక్కో బ్యాచ్ విక్రయాలు పూర్తి చేస్తారు. శీతాకాలంలో మాత్రం 30 రోజుల వ్యవధిలోనే ఒక బ్యాచ్ కోళ్లు తయారవుతాయని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. వైరస్ బారిన పడిన కోళ్లు 20-23 రోజులకు చనిపోతున్నాయి. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల కోళ్లు తక్కువ సమయంలోనే నిర్ణీత బరువు పెరుగుతాయని చెబుతున్నారు.
ఏపీలో పౌల్ట్రీ రైతుల విలవిల…
వైరస్ కారణంగా ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఉంగుటూరు, కొల్లేరు ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫామ్‌లలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఇక్కడ దాదాపు కోటి 30 లక్షల కోళ్లను పెంచుతున్నారు. రెండు నెలల్లో దాదాపు 20 లక్షల కోళ్లు వైరస్ బారిన పడి చనిపోయినట్టు పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు.
రోజుకు కోటి ఐదు లక్షల గుడ్లు ఉత్పత్తి జరగాల్సి ఉండగా అది 85 లక్షలకు పడిపోయినట్టు చెబుతున్నారు. వైరస్‌ను గుర్తించడంలో పశు సంవర్థక శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు చెబుతున్నారు. పెరటి కోళ్లలో కంటే పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ల మరణాలే ఎక్కువగా ఉంటున్నాయని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదరనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.
ఏటా డిసెంబరు- ఫిబ్రవరి మధ్య కోళ్ల మరణాలు ఉండేవని, ఈ ఏడాది వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ ఏడాది కొల్లేరు ప్రాంతానికి వలస పక్షులు ఎక్కువగా రావడం, పౌల్ట్రీ రైతులు కోళ్ల భద్రతా చర్యలు పాటించకపోవడం, చనిపోయినవాటిని శాస్త్రీయంగా పూడ్చిపెట్టకపోవడం వల్ల అంటువ్యాధుల వ్యాప్తి చెంది కోళ్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
ఇప్పటి వరకు కోడిగుడ్లు, మాంసం వల్ల ప్రాణ హాని, ఆరోగ్య సమస్యలు వచ్చిన సమాచారం లేదని చెప్పారు. ప్రజలు అపోహలు లేకుండా ఉడికించిన కోడి గుడ్లు, మాంసం వినియోగించవచ్చని సూచించారు. చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి వైరస్ నిర్ధారణకు భోపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్‌కు పంపుతున్నట్లు వివరించారు.
సంబంధిత కథనం
టాపిక్