Best Web Hosting Provider In India 2024
Telangana Politics : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పోరాటం – బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా..?
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో… అసెంబ్లీ కార్యదర్శి 10 మంది ఎమ్మెల్యేలకు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఫిరాయింపు విషయంలో వివరణ ఇవ్వాలని ఇందులో పేర్కొన్నారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్ న్యాయపోరాటం….
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. మొదట్నుంచే ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తూ వస్తోంది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. సింగిల్ బెచ్ తీర్పు సానుకూలంగానే వచ్చినప్పటికీ.. డివిజన్ బెంచ్ లో ప్రతికూల తీర్పు వచ్చింది. చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. టైం బాండ్ అంటూ ఏం లేదని పేర్కొంది. అయితే డివిజన్ బెంచ్ తీర్పుపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిపై తాజాగా విచారణ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన సమయం అంటే ఎంత అంటూ సూటిగా ప్రశ్నించింది. పార్టీ మారిన వారికి నోటీసులు జారీ చేయాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. ఇదే విషయాన్ని పార్టీ మారిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ధ్రువీకరించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే….
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, అరికెపూడీ గాంధీ, కాలె యాదయ్య, సంజయ్ కుమార్ ఉన్నారు. వీరందరికీ కూడా నోటీసులు జారీ అయ్యాయి. వీరంతా కూడా న్యాయ నిపుణులతో చర్చించి… నోటీసులకు స్పందించే అవకాశాలు ఉన్నాయి.
ఏం జరగబోతుంది..?
మరోవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ కౌడ్ వేసిన పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10వ తేదీన సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో… శాసనసభ నుంచి ఎలాంటి వివరణ వస్తుంది..? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం… ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతూ వస్తోంది. సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో… గురువారం కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్నారు. మూడు, నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.
ఓవైపు 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిదేనంటూ బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. మరోవైపు సదరు ఎమ్మెల్యేలు మాత్రం… చట్టానికి లోబడి, న్యాయ నిపుణులతో చర్చించి ముందుకెళ్తామని చెప్పుకొస్తున్నారు. అయితే వీరి విషయంలో సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలా ఉంటుంది..? బీఆర్ఎస్ కోరుతున్నట్లు వీరిపై అనర్హత వేటు పడుతుందా..? ఇదే జరిగితే పది స్థానాల్లో ఉప ఎన్నికలు రావటం ఖాయమేనా..? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
నిజానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. ఓవైపు ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయటంతో పాటు పార్టీ మారిన వారిని నిలదీసేలా అడుగులు వేస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేయటం ద్వారా అనర్హత వేటు పడాలని చూస్తోంది. ఇదే జరిగితే వచ్చే ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ కీలక నేతలు పదే పదే కూడా చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా..? లేదా..? అనేది చూడాలి…!
టాపిక్