Best Web Hosting Provider In India 2024
AP Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడో?- పంపిణీపై సమాచారం లేదంటున్న అధికారులు
AP Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీపై త్వరలో ప్రకటనలు మినహా స్పష్టత లేదంటూ పలువురు అసంతృప్తి చేస్తున్నారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రులు ప్రకటించారు. జనవరి ముగిసినా రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభంకాలేదని ప్రశ్నలు మొదలయ్యాయి.
AP Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డుల ఊసేవినిపించడంలేదు. త్వరలో…త్వరలో…అనే ప్రకటనలు తప్ప కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియపై స్పష్టత రావడంలేదు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు వస్తాయని మంత్రులు ప్రకటనలు చేసినా…ఎందుకో అడుగు ముందుకు పడలేదు. కనీసం రేషన్ కార్డులు కొత్తవి జారీ చేసే విషయంపై ప్రభుత్వం తాత్సారం చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వారి పార్టీకి తగిన విధంగా రేషన్ కార్డులు మారుతుంటాయి. వైసీపీ హయాంలో ఆ పార్టీ రంగులు, వైఎస్ఆర్, జగన్ ఫొటోలతో రేషన్ కార్డులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా… ఇంకా పాత రేషన్ కార్డులు దర్శనమిస్తున్నాయి.
కొత్త కార్డులెప్పుడు?
ఏపీలో 1 కోటి 48 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిల్లో 90 లక్షల కార్డులు కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆహార భద్రత చట్టం కింద జారీ చేసినవి. ఈ కార్డులకు మాత్రమే కేంద్రం ఉచితంగా బియ్యం, తక్కువ ధరకు కందిపప్పు, పంచదార ఇతర సరుకులు అందిస్తుంది. మిగిలిన కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. వీటిపై అందించే ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, ఇతర సరుకులకు అయ్యే రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ కార్డులను కూడా జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని చాలా కాలంగా కోరుతుంది. దీనిపై కేంద్రం నుంచి స్పందనలేదు.
జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అనధికారికంగా ప్రకటనలు వచ్చాయి. కొత్తగా పెళ్లైన వారితో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని నేతలు, అధికారులు తెలిపారు. ప్రస్తుత కార్డుల రీడిజైన్ తో పాటు కొత్త లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. కానీ ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. జనవరి పూర్తైన ఇంకా రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ కార్డులే
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా ఇంకా మాజీ సీఎం జగన్, వైసీపీ చిత్రాలతో రేషన్ కార్డులు ఉన్నాయి. దీనిపై కూటమి పార్టీల నేతలు గుర్రుగా ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ త్వరలో అంటూ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రకటనలతో… నిత్యం వందలాది మంది ప్రజలు తహసీల్దారు, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సిబ్బంది రేషన్ కార్డుల అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు తప్ప కొత్త కార్డుల పంపిణీపై స్పష్టత లేదు.
ప్రభుత్వ పథకాల పొందాలంటే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, బ్యాంకు లోన్లు ఇలా చాలా వాటితో రేషన్ కార్డుకు లింక్ ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలా కార్యక్రమాలకు అర్హులు. ఇది వరకు రేషన్ కార్డు లేని వారు, సాంకేతిక కారణాలతో రేషన్ కార్డు పొందలేని వారు కొత్త రేషన్ కార్డు కోసం అధికారులకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వేర్వేరుగా రేషన్ కార్డులు
ఆరోగ్యశ్రీ కార్డు పొందాలన్నా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలకు రేషన్ కార్డు తప్పనిసరి. ఇందుకోసం పలువురు రేషన్ కార్డులు కోరుకుంటున్నారు. విద్యార్థులకు కూడా రేషన్ కార్డు కీలకం. ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకార వేతనాల కోసం రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటారు. ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి, కుమారుడు, కోడలు…తాము వేరు కాపురాలతో ఉంటున్నామని రేషన్ కార్డులు వేర్వేరుగా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికైనా త్వరలో ప్రకటనలకు స్వస్తి చెప్పి రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
టాపిక్