Best Web Hosting Provider In India 2024
Maha Kumbh Special Trains : మహా కుంభమేళాకెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్, కాకినాడ నుంచి విజయవాడ మీదుగా స్పెషల్ రైళ్లు
Maha Kumbh Mela Special Trains : మహాకుంభ మేళాకు కాకినాడ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాకినాడ టౌన్-గయ, కాకినాడ టౌన్-అజామ్‌గర్హ్ మధ్య మహాకుంభ మేళా స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
Maha Kumbh Mela Special Trains : మహాకుంభమేళాకు వెళ్లే భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. కాకినాడ టౌన్-గయ, కాకినాడ టౌన్-అజామ్‌గర్హ్ మధ్య మహాకుంభ మేళా స్పెషల్ రైళ్లను నడపడానికి నిర్ణయించింది.
ఈ రెండు రైళ్లు విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వివిధ రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్తాయి. ఈ ప్రాంత ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మహా కుంభమేళాకు ప్రయాణికులు, యాత్రికులు, భక్తుల అదనపు రద్దీని తగ్గించడానికి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
మహా కుంభమేళా స్పెషల్ రైళ్లు
- రైలు నెంబర్ 07095 కాకినాడ టౌన్-గయ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 8 (శనివావారం) తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు ఫిబ్రవరి 10 (సోమవారం) తేదీన ఉదయం 10 గంటలకు గయ చేరుకుంటుంది.
- ఈ స్పెషల్ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సామర్లకోట, నిడదవోలు, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబుబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్ కాఘాజ్‌నగర్ స్టేషన్లలో ఆగుతుంది.
- రైలు నెంబర్ 07085 కాకినాడ టౌన్-అజామ్ గర్హ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 20 (గురువారం) తేదీన రాత్రి 8 గంటలకు కాకినాడ టౌన్ నుండి బయలుదేరుతుంది. ఈ రైలు ఫిబ్రవరి 22 (శనివారం) సాయంత్రం 5.15 గంటలకు అజామ్ గర్హ్ చేరుకుంటుంది.
- ఈ స్పెషల్ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సామర్లకోట, నిడదవోలు, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాఘాజ్‌నగర్ స్టేషన్లలో ఆగుతుంది.
- ఈ ప్రత్యేక రైళ్లలో సెకెండ్ ఏసీ కోచ్‌లు -3, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లు -4, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -8, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్-1, జనరేటర్ మోటార్ కార్-1 ఉంటాయి. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అభ్యర్థించింది.
రైళ్ల షార్ట్‌టెర్మినేషన్
సాంకేతిక కారణాల వల్ల నాలుగు రైళ్లను షార్ట్‌టెర్మినేషన్ చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే పేర్కొంది.
1. ఫిబ్రవరి 28 వరకు విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెంబర్ 67287 విశాఖపట్నం-పార్వతీపురం ప్యాసింజర్ రైలు విజయనగరం వద్ద ఆగిపోతుంది.
2. ఫిబ్రవరి 28 వరకు రైలు నెంబర్ 67288 పార్వతీపురం-విశాఖపట్నం ప్యాసింజర్ రైలు పార్వతీపురం నుండి బయలుదేరడానికి బదులు విజయనగరం నుండి బయలుదేరుతుంది.
3. ఫిబ్రవరి 28 వరకు విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెంబర్ 67289 విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలు శ్రీకాకుళం రోడ్ వద్ద ఆగిపోతుంది.
4. ఫిబ్రవరి 28 వరకు రైలు నెంబర్ 67290 పలాస-విశాఖపట్నం ప్యాసింజర్ రైలు పలాస నుండి బయలుదేరడానికి బదులు శ్రీకాకుళం నుండి బయలుదేరుతుంది. ప్రజలు మార్పులను గమనించి వ్యవహరించాలని వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్