Best Web Hosting Provider In India 2024
Producer Ramesh Babu: రూ.100 కోట్లు నష్టం వచ్చినా పవన్ కల్యాణ్, మహేష్ బాబు పట్టించుకోలేదు: ప్రొడ్యూసర్ కామెంట్స్
Producer Ramesh Babu: టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లపై సంచలన కామెంట్స్ చేశాడు ప్రొడ్యూసర్ శింగనమల రమేష్ బాబు. కొమురం పులి, ఖలేజా సినిమాల వల్ల తాను రూ.100 కోట్లు నష్టపోయినా అయ్యో పాపం కూడా అనలేదని అతడు అనడం గమనార్హం.
Producer Ramesh Babu: శింగనమల రమేష్ బాబు.. టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్లలో ఒకడు. శ్రీ కనకరత్న మూవీస్ బ్యానర్లో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లతో ఖలేజా, కొమురం పులి, తమిళంలో విజయ్ తో పోకిరిలాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీశాడు. అయితే వీటిలో పులి, ఖలేజా సినిమాల వల్ల తాను రూ.100 కోట్లు నష్టపోయానని చెప్పాడు. బుధవారం (ఫిబ్రవరి 5) రమేష్ బాబు 14 ఏళ్ల కిందటి కేసులో నాంపల్లి కోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు.
వాళ్లు అయ్యో పాపం అని కూడా అనలేదు: రమేష్ బాబు
టాలీవుడ్ ప్రొడ్యూసర్ శింగనమల రమేష్ బాబు బుధవారం (ఫిబ్రవరి 5) మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆ రెండు సినిమాలు ఆలస్యం కావడం, దానివల్ల జరిగిన నష్టం, ఆ మూవీస్ లోని హీరోలు సపోర్ట్ ఇచ్చారా లేదా అన్న ప్రశ్నపై స్పందించాడు.
“ఈకాలంలో రాజమౌళి సినిమాలు, పుష్ప 2లాంటి సినిమాలు పూర్తవడానికి మూడేళ్లు, నాలుగేళ్లు పడుతోంది. కానీ అప్పట్లో అంత సమయం పట్టేది కాదు. ఆరు నెలలు లేదంటే ఏడాదిలో పూర్తయ్యేది. కానీ కొమురం పులి, ఖలేజా విషయంలో చాలా ఆలస్యం జరిగింది. పులి మూవీ మూడేళ్లు పట్టింది. పవన్ కల్యాణ్ అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పనుల్లో బిజీ కావడంతోపాటు మరెన్నో కారణాల వల్ల ఆలస్యమైంది. ఖలేజా ఆలస్యానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఈ రెండు సినిమాల వల్ల నేను రూ.100 కోట్లు నష్టపోయాను. అయినా ఆ హీరోలు అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం అయ్యో పాపం అని కూడా అనలేదు” అని ప్రొడ్యూసర్ రమేష్ బాబు అన్నాడు. సినిమాల షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ప్రొడ్యూసర్ పై చాలా భారం పడుతుందని, ఆ కష్టం ఏంటో ప్రొడ్యూసర్ కే తెలుస్తుందని చెప్పాడు.
పులి, ఖలేజా ఫ్లాప్
పవన్ కల్యాణ్ నటించిన పులి, మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు హీరోల కెరీర్లలో ఈ రెండు సినిమాలు ఓ ఫెయిల్యూర్ గా మిగిలిపోయాయి. అయితే ఆ రెండు మూవీస్ ద్వారా ఏకంగా రూ.100 కోట్ల నష్టం వచ్చిందన్నది మాత్రం ఇప్పుడు ప్రొడ్యూసర్ రమేష్ బాబు చెబితేనే చాలా మందికి తెలిసింది.
కొమురం పులి మూవీని రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇక ఖలేజా మూవీ విషయానికి వస్తే.. ఈ సినిమాను రూ.30 కోట్లతో నిర్మిస్తే.. రూ.20 కోట్లే వసూలు చేసింది. ఈ రెండు సినిమాల వల్ల నిర్మాత రమేష్ బాబు భారీగా నష్టపోయాడు.
సంబంధిత కథనం