Best Web Hosting Provider In India 2024
Pachi Mirchi Pachadi: కారంగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకొని చూడండి, స్పైసీగా అదిరిపోతుంది
Pachi mirchi Pachadi: పచ్చిమిరపకాయ పచ్చడి అనగానే భయపడకండి. ఇది అన్నంలో కలుపుకుని తినే విధంగానే ఉంటుంది. పైగా కొంచెం స్పైసీగా రుచిగా ఉంటుంది. రెసిపీ తెలుసుకోండి.
పచ్చిమిరపకాయలను కూరల్లో కారంగా ఉండేందుకు వేస్తూ ఉంటారు. నోరు చప్పగా అనిపించినప్పుడు పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకొని తినేందుకు ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా అన్నంలో కలుపుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా స్పైసీ ఆహారాన్ని తింటే ఆ రుచే వేరు. పైగా పచ్చిమిర్చిలో పోషకాలు కూడా నిండుగా ఉంటాయి. కాబట్టి ఈ పచ్చిమిర్చి పచ్చడి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
పచ్చిమిరపకాయ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పచ్చిమిరపకాయలు – పావుకిలో
చింతపండు – ఉసిరికాయ సైజులో
జీలకర్ర – ఒకటిన్నర స్పూను
మెంతులు – అర స్పూను
ఉల్లిపాయలు – ఒకటి
నూనె – రెండు స్పూన్లు
పచ్చిశనగపప్పు – ఒక స్పూను
మినప్పప్పు – ఒక స్పూను
ఆవాలు – అర స్పూను
వెల్లుల్లి – మూడు
కరివేపాకులు – గుప్పెడు
పసుపు – పావు స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
ఎండు మిర్చి – రెండు
పచ్చిమిరపకాయ పచ్చడి రెసిపీ
1. పచ్చిమిరపకాయలను తాజాగా తీసుకోవాలి.
2. వాటిని మూటికలు తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. ఈ నూనెలో ఒక స్పూను జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి.
5. ఆ తర్వాత పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి.
6. రుచికి సరిపడా ఉప్పును, పసుపును కూడా వేసి బాగా వేయించుకోవాలి.
7. ఇప్పుడు మిక్సీలో వేయించిన పచ్చిమిర్చిని, చింతపండును వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
8. తర్వాత ఉల్లిపాయలను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
9. ఈ మొత్తం మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
10. ఇప్పుడు దీనికి తాళింపు వేయాలి.
11. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
12. వెల్లుల్లి రెబ్బలను, కరివేపాకులను, ఎండు మిర్చిని కూడా వేసి వేయించుకోవాలి.
13. ఈ మొత్తం మిశ్రమాన్ని పచ్చడిపై వేయాలి. అంతే టేస్టీ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయినట్టే.
పచ్చిమిర్చి పచ్చడి కాస్త స్పైసీగా ఉంటుంది. కాబట్టి అన్నంలో కలుపుకునేటప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కొన్ని పచ్చిమిర్చి పెద్దగా కారంగా ఉండవు. అలాంటి వాటితో చేస్తే నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేకుండానే తినవచ్చు. ఏదైనా కూడా ఈ పచ్చిమిరపకాయ పచ్చడిని అన్నంలో, ఇడ్లీలో, దోశెలతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని చూడండి. ఇది ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇందులో ఉల్లిపాయ వాడాము… కాబట్టి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఈరోజు చేసుకుంటే 24 గంటల్లోపు తినేయాల్సి వస్తుంది. అదే ఉల్లిపాయను వేయకపోతే రెండు మూడు రోజులపాటు నిల్వ ఉండే అవకాశం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్