Best Web Hosting Provider In India 2024
Kurnool Crime : అనుమానంతో భార్యను హతమార్చిన భర్త, పొలం పని చేస్తుండగా కత్తితో దాడి
Kurnool Crime : కర్నూలులో వివాహిత దారుణ హత్యకు గురైంది. అనుమానంతో వేధిస్తు్న్న భర్త నుంచి దూరంగా పుట్టింట్లో ఉంటుంది భార్య. దీంతో కక్ష పెంచుకున్న భర్త, భార్యపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Kurnool Crime : కర్నూలులో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను భర్త హతమార్చాడు. పొలం పనిచేస్తుండగా వెనుక నుంచి కత్తితో భార్యపై భర్త దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
ఈ ఘటన కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం రాతనకొత్తూరులో చోటుచేసుకుంది. పోలీసులు, మృతిరాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాతనకొత్తూరు గ్రామానికి చెందిన కాశీంబీ కూతురు షేక్ మాబున్నీ (32)తో చెన్నంపల్లికి చెందిన అక్బర్‌వలికి వివాహం జరిగింది. 15 ఏళ్ల క్రితం జరిగిన వివాహ అనంతరం ఇద్దరు కుమారులు ఆసీఫ్ (12), లాలూసాహెబ్ (9) ఉన్నారు. అయితే భార్య షేక్ మాబున్నీపై భర్త అక్బర్ వలి అనుమానం పెంచుకున్నాడు.
అనుమానంతో నిత్యం గొడవలు
ఆమె ఎవరితోనైనా మాట్లాడినా సహించేవాడు కాదు. దీంతో ఇంట్లో గొడవలు జరిగేవి. భర్త వేధింపులు నిత్యకృత్యం అయ్యాయి. దీంతో మాబున్నీ తొమ్మిదేళ్ల క్రితమే, అంటే రెండో కుమారుడు పుట్టిన కొన్ని నెలలకే భర్తను వదిలేసి, రాతనకొత్తూరుకు వెళ్లి పుట్టింట్లోనే ఉంటుంది. అప్పుడప్పుడు భర్త అక్కడికొచ్చి తిరిగేవాడు. ఈ క్రమంలో సోమవారం ఆమె వేరుశనగ పంటకు నీటి తడులు పెట్టేందుకు పొలానికి వెళ్లింది. ఈ సమయంలో భర్త అక్బర్ వలి వెళ్లి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి, హత్య చేశాడు.
అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపటికే పొలానికి వెళ్లిన ఆమె సోదరుడు రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాన్ని చూసి ఆందోళన చెందాడు. పరుగుపరుగు మీద ఊళ్లోకొచ్చి, ఇంటివద్ద ఉన్న ఎద్దుల బండి తీసుకెళ్లి మృతదేహాన్ని ఇంటికి చేర్చాడు. సమాచారం అందుకున్న పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్, తుగ్గలి ఎస్ఐ కృష్ణమూర్తి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నిందితుడి అరెస్ట్
మృతురాలి తండ్రి షేక్ కాశీం ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి, నిందితుడు అక్బర్‌వలి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలంలో మృతురాలి వద్ద తీసుకెళ్లిన సెల్‌ఫోన్ ఆధారంగా తుగ్గలి రైల్వే స్టేషన్ దగ్గరలో నిందితుడిని మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు.
మరోవైపు ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మృతురాలి తల్లిదండ్రులు, కన్న కొడుకులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. పోస్టుమార్టం అనంతరం మంగళవారం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్