Best Web Hosting Provider In India 2024
Motivation: ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, మీపై మీకు నమ్మకం ఉంటే ప్రపంచాన్నే జయిస్తారు
Motivation: బంగారమైనా, వజ్రం అయినా దానికి ఒక రూపం వస్తేనే విలువ పెరుగుతుంది. అలాగే మనిషి కూడా తనలోని ప్రత్యేకతను అర్థం చేసుకొని ఏదో ఒకటి సాధించాలి. అలా సాధించేందుకు అపారమైన విశ్వాసం అవసరం.
ఒక ఇంట్లో తాతా మనవళ్ళు ఉండేవారు. తాత నుంచి మనవడు ఎన్నో విషయాలు అడిగి తెలుసుకునేవాడు. ఒకరోజు ఆ మనవడికి ఒక సందేహం వచ్చింది. తాత దగ్గరకు వెళ్లి తాత ‘నేను ఎందుకూ పనికిరానని అనిపిస్తోంది, నాకు ఎలాంటి విలువ లేదనిపిస్తోంది. చదువు కూడా సరిగా రాలేదు. ఒక మనిషికి విలువ లేనప్పుడు జీవించడం అవసరమా?’ అని ప్రశ్నిస్తాడు. దానికి ఆ తాతయ్య ఒక చిన్న రత్నాన్ని మనవడి చేతికి ఇస్తాడు. దీన్ని అమ్మకుండా మార్కెట్లో ఎవరు ఎంత ఇస్తారో కనుక్కొని రా అని చెబుతాడు.
ఆ మనవడు ఒక కూరగాయల దుకాణంలోకి వెళ్లి ఆ రత్నాన్ని చూపిస్తాడు. అది చూసిన వ్యాపారి ఒక కిలో ఉల్లిపాయలు లేదా బంగాళదుంపలు ఇస్తానని చెబుతాడు. అవి వద్దని మనవడు వేరే షాపులోకి వెళతారు. అక్కడకు వెళితే ఆ వ్యాపారి ఓ బస్తా బియ్యం ఇస్తానని చెబుతాడు. అక్కడ కూడా వద్దని బయటికి వచ్చేస్తాడు మనవడు.
ఆ రత్నానికి కిలో బంగాళదుంపలు, బియ్యం వంటివి ఇస్తారనడంతో దానికి ఎలాంటి విలువ లేదనుకుంటాడు. అది కూడా తాతా దాన్నిఇంట్లో ఇన్నాళ్లు ఎందుకు ఉంచారో కూడా అర్థం కాదు మనవడికి. అయినా సరే తాత చెప్పాడని మరొక దుకాణంలోకి వెళతారు. అది బంగారు దుకాణం. అందులో రత్నాన్ని చూసిన వర్తకుడు ఒక తులం బంగారం ఇస్తానని చెబుతాడు. దానికి ఆ మనవడు కాస్త సంతోషిస్తాడు. కానీ తులం బంగారంతో జీవితాంతం బతకడం కష్టమని ఆయనకు తెలుసు. అది కూడా తాతయ్య ఆ రత్నాన్ని అమ్మకూడదని ముందే చెప్పాడు.
దాంతో నిరాశగా ఆ రత్నాన్ని పట్టుకొని పక్కనే ఉన్న వజ్రాల దుకాణంలోకి వెళతారు. ఆ వర్తకుడు ఆ వజ్రాన్ని ఎగాదిగా చూస్తాడు. కొన్ని రకాల పరీక్షలు చేస్తాడు. ఆ తర్వాత తిరిగి తీసుకొచ్చి మనవడి చేతిలో పెట్టేస్తాడు. దీంతో ఆ మనవడు తీవ్ర నిరాశకు గురవుతాడు. పనికిరాని వస్తువుగా భావించి వర్తకుడు తన చేతిలో పెట్టాడని అనుకుంటాడు.
కానీ వజ్రాల వ్యాపారి ఆ రత్నాన్ని అతను చేతిలో పెట్టి దాన్ని కొనగలిగే సత్తువ తన దగ్గర లేదని చెబుతాడు. తన ఆస్తి మొత్తం అమ్మేసి, తన దగ్గర ఉన్న వజ్రాలన్నీ ఇచ్చేసినా కూడా దాన్ని కొనలేమని, అది అంత విలువైనదని వివరిస్తాడు. దీంతో ఆ మనవడు కళ్ళు జిగేల్ మంటూ మెరుస్తాయి. ఆ రత్నాన్ని పట్టుకొని ఇంటికి పరుగులు తీస్తాడు.
తన తాత దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెబుతాడు. అప్పుడు తాత ఆ మనవడికి జీవితం గురించి వివరిస్తాడు. ‘నువ్వు ఉండే స్థానం బట్టి నీకు విలువ అనేది ఉంటుంది. ఈ వజ్రం కూడా అంతే. దానికి తగిన స్థానానికి వెళ్లే వరకు దాని విలువ తెలియలేదు. అలాగే నువ్వు కూడా నీలో ఉన్న ప్రత్యేకతను బయటపెట్టి తగిన పని చేయడం మొదలు పెడితే నీకు కూడా విలువ పెరుగుతుంది. నీ చుట్టూ ఉండే వాళ్ళకి నీ గురించి తెలియకపోవచ్చు. నీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేకపోవచ్చు. నీ గొప్పతనాన్ని తెలుసుకోలేక పోవచ్చు. కానీ నువ్వు సరైన స్థానానికి చేరుకున్న తర్వాత కచ్చితంగా అందరూ నీ విలువను అర్థం చేసుకుంటారు’ అని వివరిస్తాడు తాత.
అంతేకాదు తనకు తానే ఎందుకు పనికిరాని వాడినని అనుకుంటే ఎప్పటికీ అదే స్థానంలో ఉండిపోతారని తాత వివరిస్తాడు. మీపై మీకు విశ్వాసం ఉంటే ఎంతటి విజయాన్ని అయినా సాధిస్తారని, ఈ ప్రపంచాన్ని జయించేంత శక్తి మీకు వస్తుందని తాత వివరిస్తాడు. అప్పుడు మనవడికి అర్థమవుతుంది. తాను అలా ఖాళీగా ఉండే కన్నా ఏదైనా పని చేసి ఉన్నత స్థానానికి వెళ్లాలని అనుకుంటాడు. ఆ రోజు నుంచి తనకు ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలోనే నిష్ణాతుడు కావడానికి ప్రయత్నించడం మొదలు పెడతాడు.
ఇక్కడ మనవడి స్థానంలోనే ప్రపంచంలో ఉన్న ఎంతోమంది యువత ఉంది. ఆ యువత అందరూ కూడా వజ్రాల్లాంటివారే. కానీ ఆ వజ్రానికి సాన పెట్టాల్సిన అవసరం ఉంది. సాన పెట్టడానికి తల్లిదండ్రులు, గురువులే కాదు మీకు మీరే ఆ మెరుపును సంతరించుకోవాలి. మీ మెదడుకు పదును పెట్టాలి. మీరు ఏ రంగంలో దూసుకెళ్తారో ఆ రంగంలోనే అడుగుపెట్టి ముందుకు సాగాలి.
సంబంధిత కథనం