Best Web Hosting Provider In India 2024
Illu Illalu Pillalu February 6th Episode: తండ్రి కోసం చందు త్యాగం – కొడుకు పెళ్లికి రామరాజు ప్లాన్ – భద్రావతి సవాల్
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 6 ఎపిసోడ్లో ప్రేమ విషయం తనకు ఎందుకు చెప్పలేదని చందును అడుగుతాడు రామరాజు. మీ మీద గౌరవంతో, ప్రేమ పెళ్లి చేసుకోనని మీకు ఇచ్చిన మాటకు విలువ ఇచ్చే తన ప్రేమను మనసులోనే సమాధి చేసుకున్నానని రామరాజుతో చందు అంటాడు.
Illu Illalu Pillalu: రామరాజుపై పగతో చందు లవ్‌స్టోరీని బయటపెడుతుంది భద్రావతి. వేదావతితో పాటు ప్రేమ తమ ఇంటికి దూరం కావడానికి, తన తండ్రి చావుకు రామరాజు కారణమని భద్రావతి ఆరోపిస్తుంది. మా ఇంటిని చీకటి చేసిన మీ ఇంట్లో వెలుగులు ఉండనివ్వను. మాకు సంతోషాల్ని దూరం చేసి భరించలేని బాధల్ని మిగిల్చిన మిమ్మల్ని ఆనందంగా ఉండనివ్వనని రామరాజుతో భద్రావతి సవాల్ చేస్తుంది. ఏ పిల్లల్ని చూసి పంచ ప్రాణాలు అని విర్రవీగుతున్నావో…వారినే చూసి నువ్వు ప్రతిక్షణం ఏడ్చేలా చేస్తానని రామరాజుతో అంటుంది భద్రావతి.
రామరాజు బాధ…
భద్రావతి అన్న మాటల్ని రామరాజు తట్టుకోలేకపోతాడు. చందు పిలిచినా పట్టించుకోకుండా రామరాజు పట్టించుకోడు. బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తండ్రికి నిజం తెలిసిపోయినందుకు చందు బాధపడతాడు. రామరాజు అతడి పక్కన వచ్చి కూర్చుంటాడు. గుప్పెడంత మనసులో సముద్రమంత బాధను మోస్తున్నావా అని కొడుకును ఓదార్చుతాడు రామరాజు.
నువ్వు ప్రతి చిన్న విషయాన్ని ఈ నాన్నతో చెప్పకుండా ఉండలేవు. మరి ఇంత పెద్ద విషయాన్ని ఈ నాన్నతో ఎందుకు చెప్పలేదని చందును అడుగుతాడు రామరాజు. తండ్రి మాటలతో చందు ఎమోషనల్ అవుతాడు.
తండ్రి ప్రేమ కంటే…
మీరంటే భయంతో కాదు గౌరవంతోనే ఈ విషయాన్ని దాచానని చందు అంటాడు. ప్రేమ పెళ్లి చేసుకోనని మీ దగ్గర తీసుకున్న మాట అంటే నాకు విలువ. అందుకే మనసులో పుట్టిన నా ప్రేమ గొంతుదాటి బయటకు వెళ్లలేకపోయిందని చందు బదులిస్తాడు. నాకు ఈ లోకంలో తండ్రి ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదని చెబుతాడు.
మీ కోసం ఎంత బాధనైనా భరించగలనని రామరాజుతో అంటాడు చందు. నా స్వార్థానికి మిమ్మల్ని బాధపెడితే, నా ప్రేమ నేను మీకు ఇచ్చిన మాట తప్పేలా చేస్తే కొడుకుగా నేను ఓడిపోయినట్లేనని అనించింది. మా నాన్నను గెలిపించడం కోసం నా ప్రేమను నాలోనే చంపేసుకున్నానని చందు అంటాడు.
తల ఎత్తుకొని తిరిగేలా చేశావు…
ఈ నాన్న పరువు, పెంపకాన్ని నిలబెట్టావని, నలుగురిలో ధైర్యంగా తల ఎత్తుకొని తిరిగేలా చేశావని చందుతో అంటాడు రామరాజు. ఎవరు నా మాట విన్న వినకపోయినా నువ్వు నా మాట నిలబెట్టావని, నువ్వే నా అసలైన వారసుడివని రామరాజు సంతోషంతో పొంగిపోతాడు.
నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని అంటాడు. నీకు ఓ మంచి అమ్మాయిని చూసి గొప్పగా పెళ్లి చేస్తానని, జీవితాంతం సంతోషంగా ఉండేలా చూస్తానని చందుకు మాటిస్తాడు రామరాజు. పెళ్లి ఎలా చూస్తానో చూడమని అంటాడు. చందు, రామరాజు మాటల్ని వేదావతితో పాటు సాగర్, ధీరజ్ వింటారు.
స్వార్థపరులు…
మీరు ఇంత స్వార్థపరులు, అవకాశవాదులు అనుకోలేదని సాగర్, ధీరజ్‌పై కోప్పడుతుంది వేదావతి. చందు ప్రేమ విషయం గురించి ఎన్నిసార్లు అడిగినా తనకు ఎందుకు నిజం చెప్పలేదని, మీరే వాడి జీవితాన్ని గాలికి వదిలేశారని కొడుకులను కడిపిపడేస్తుంది. అన్నయ్య బాధను మా బాధగానే భావిస్తాము తప్పితే మా స్వార్థాన్ని ఎప్పుడు చూసుకోలేదని తల్లికి ధీరజ్ బదులిస్తాడు.
తాగుడు అలవాటు లేకపోయినా…
మీ అన్నదమ్ములు ఒకరంటే ఒకరికి ప్రాణమని అన్నారు. మరి మనసులో అంత బాధను పెట్టుకున్న అన్నయ్యను పట్టించుకోకుండా ఎందుకు వదిలేశారని కొడుకులను నిలదీస్తుంది. బాధలో ఉన్న అన్నయ్యను ఏ రోజు వదిలిపెట్టలేదని, ప్రతి క్షణం పక్కనే ఉన్నామని ధీరజ్ అంటాడు.
చందుకు తాగుడు అలవాటు లేకపోయినా బాగా తాగి ఇంటికొచ్చినప్పుడే వాడి మనసులో ఏదో భరించలేని బాధ ఉందని అర్థమైందని, కానీ మీరే అబద్ధం చెప్పి తనను కప్పిపుచ్చారని, అమ్మ మనసును మోసం చేశారని వేదావతి ఫైర్ అవుతుంది. అప్పటికే ఆ అమ్మాయికి పెళ్లైపోయిందని, మేము ఏం చేయలేకపోయామని ధీరజ్బదులిస్తాడు.
మోసం చేశారు..
చందు ప్రేమ విషయం తనకు చెప్పకుండా మోసం చేశారని కొడుకులకు క్లాస్ ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి దూరమైతే బతకలేనని, అందుకు పెళ్లి చేసుకున్నానని అన్నావు. మరి ప్రేమించిన అమ్మాయి దూరమైతే మీ అన్నయ్య బతకలేడని అర్థం కాలేదా అని సాగర్‌ను ప్రశ్నిస్తుంది వేదావతి. తమ్ముళ్లుగా మీరు, తల్లిగా తాను చందు బాధను పట్టించుకోలేదని భోరున ఏడుస్తుంది.
నర్మద ఎంట్రీ…
నర్మద అక్కడికి వస్తుంది. మీకు కోసం వస్తే మీ ముందు నిలబడలేరు. ఆ భయంతోనే చందు ప్రేమ విషయం మీ దగ్గర దాచారని సాగర్, ధీరజ్‌లను వెనకేసుకొస్తుంది నర్మద. జరిగిపోయిన వాటిని వెనక్కి తీసుకురాలేకపోయినా భవిష్యత్తును అందంగా మార్చగలం, చందు బాధలో మా అందరి తప్పు ఉందని , అందుకు ప్రాయశ్చిత్తంగా అతడి పెళ్లిని మేమే గ్రాండ్‌గా జరిపిస్తామని వేదావతిని కూల్ చేస్తుంది నర్మద.
ధీరజ్, ప్రేమ గొడవ…
గాయాలతో కింద పడుకోవడం కష్టమని, ధీరజ్‌ను బెడ్‌పై పడుకోమని చెబుతుందిప్రేమ, తాను చాప తీసుకొని కింద పడుకోవడానికి సిద్ధమవుతుంది. తాను యువరాణిని అని, పట్టుపరుపులు తప్ప చాప మీద పడుకోవడం చేతకాదని ఎవరో అన్నారని ప్రేమపై సెటైర్లు వేస్తాడు ధీరజ్.
అందరి దృష్టిలో త్యాగమూర్తిలా బిల్డప్‌లు ఇవ్వడానికే ఇవన్నీ చేస్తున్నావని అపోహపడతాడు. అందరితో శభాష్ ప్రేమ అనిపించుకోవాలన్నదే నీ ప్లాన్ అని వెటకారం ఆడుతాడు. నా వల్ల నువ్వు టార్చర్ అనుభవిస్తున్నావని ఇంట్లో వాళ్లకు తెలియాలనే ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసునని అంటాడు.
వెధవవని తెలుసు కానీ…
నువ్వు ఏం అంటున్నావో, ఎందుకు ఇలా మాట్లాడుతోన్నావో నాకు అర్థం కావడం లేదని ప్రేమ బదులిస్తుంది. పేరు, పథకాలు కొట్టేయాడినికి అంటూ బుద్ధి లేకుండా ఏం మాట్లాడుతున్నావని కోపంగా ధీరజ్‌కు బదులిస్తుంది. నువ్వు వెధవవని తెలుసు కానీ ప్రతి విషయాన్ని భూతద్ధంలో పెట్టి చూసేంత వెధవన్నర వెధవవని తెలియదని అంటుంది. ఇద్దరు గొడవపడతారు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ముగిసింది.