Best Web Hosting Provider In India 2024
Kaleswaram: దక్షిణ కాశీ.. ‘కాళేశ్వరం’లో మహా కుంభాభిషేకం, 42 ఏండ్ల తర్వాత జరుగుతున్న పూజలు
Kaleswaram: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం మహత్తర ఘట్టానికి సిద్ధమైంది. శుక్రవారం నుంచి కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం జరగనుంది. ఈ నెల 7న మాఘశుద్ధ దశమి శుక్రవారం నుంచి మాఘ శుద్ధ ద్వాదశి 9వ తేదీ ఆదివారం వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఇక్కడ జరగనున్నాయి.
Kaleswaram: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం మహత్తర ఘట్టానికి సిద్ధమైంది. శుక్రవారం నుంచి కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం జరగనుంది.
1982లో మొదటిసారి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ జరిగిన సమయంలో ఇక్కడ మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఆ తరువాత మళ్లీ 42 ఏళ్ల తరువాత ఇప్పుడే మహాకుంభాభిషేక వేడుకలు జరుగుతున్నాయి.
మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు
మహా కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శృంగేరి జగద్గురువులు భారత తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి, తుని తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆలయ అధికారులు తెలిపారు. కాగా కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఏర్పాట్లు పూర్తి..
మహా కుంభాభిషేకానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దేవాదాయ, విద్యుత్, వైద్య, ఇరిగేషన్, పోలీస్, అగ్నిమాపక, ఆర్టీసీ శాఖల తరపున పనులు చేపట్టారు. భక్తు లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు తెలిపారు. ముఖ్యంగా ప్రజా రవాణాకు సమస్యలు ఎదురవకుండా మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు రోడ్డుపై గుంతలను పూడ్చి వేశారు.
ఇక మూడు రోజుల పాటు ప్రధాన ఘాట్, వీఐపీ ఘాట్ వరకు ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ప్రధానంగా శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఇప్పటికే భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆఫీసర్లను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం పాత దేవస్థానం ఈవో ఆఫీసులో మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. ఇక గోదావరి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 10 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
మహిళలు బట్టలు మార్చుకునేందుకు టెంపరరీగా గదులను కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీటికి ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టారు. కాగా మహాకుంభాభిషే కానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం తరపున పూర్తి చేసినట్లు జిల్లా అధికారులు వివరించారు.
బస్సుల సంఖ్య పెంచేందుకు చర్యలు
కాళేశ్వరం ఆలయానికి ఏటికేడు భక్తుల రాక పెరుగుతోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో బస్సులు సరిపోక ఇబ్బందులు పడుతున్నా రు. కాగా భూపాలపల్లి డిపో నుంచి ఏడు, వరంగల్- నుంచి రెండు, పరకాల డిపోల నుంచి 31 ట్రిప్పులు ఇక్కడికి ఎక్స్ ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి.
కరీంనగర్, పెద్దపల్లి, మంథని, మంచిర్యాల నుంచి కూడా ఒకటి. రెండు ట్రిప్పులు బస్సులు వస్తుంటాయి. మహాకుంభాభిషేకం సందర్భంగా ఆ రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లకు సిద్ధమైంది. ఈ మేరకు భక్తుల రద్దీ, అవసరాన్ని బట్టి సర్వీసులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. భక్తులకు ప్రయాణ పరంగా ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
టాపిక్