Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/malladi vishnu.jpeg)
మంగళవారాన్ని అప్పులవారంగా మార్చేశారు
వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్
విజయవాడ: అధికారం కోసం చంద్రబాబు అడ్డగోలు హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కుదేలైపోయిందని.. వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో వచ్చిన ప్రతీ సమస్యను వైయస్ జగన్ మేనిఫెస్టోలో చేర్చారని.. సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఆయన కృషి చేశారన్నారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని కూటమి నేతలు విమర్శించారు. ఎన్నికల్లో రకరకాల హామీలిచ్చి దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ ఏమైపోయిందని చంద్రబాబును మల్లాది విష్ణు సూటిగా ప్రశ్నించారు. ఏడు నెలల కాలంలో లక్షా 46 వేల కోట్ల రూపాయల అప్పుచేసి రికార్డు సృష్టించి వ్యక్తి.. మమ్మల్ని విమర్శించి.. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ప్రతీ మంగళవారాన్ని అప్పులవారంగా మార్చేశారు.. దీనికి చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలని మల్లాది విష్ణు నిలదీశారు.
‘‘వైఎస్ జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. టీడీపీ మంత్రులకు ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే మాతో చర్చకు రావాలని సవాల్ చేస్తున్నాం. కరెంట్ ఛార్జీలు పెంచారు.. యూజర్ ఛార్జీలు పెంచారు.. పన్నుల భారం మోపారు. ప్రజల నుంచి డబ్బులు పిండి సంపద సృష్టి అని చెప్పుకుంటున్నారు. ఒక్క మంత్రి కూడా సరిగా పనిచేయడం లేదని నిన్నటి ర్యాంకులను చూస్తేనే అర్ధమవుతోంది’’ అని మల్లాది విష్ణు దుయ్యబట్టారు.
‘‘లక్షా 46 వేల కోట్లు అప్పుచేసి ఆర్ధిక విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై అక్రమ కేసులతో వేధిస్తున్నారు’’ అని విష్ణు ధ్వజమెత్తారు.