Best Web Hosting Provider In India 2024
పార్లమెంట్‌లో ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండు
న్యూఢిల్లీ: సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, సెర్ప్, మెప్మా పథకాలలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్ కు గౌరవ వేతనం పెంచాలని వైయస్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి డిమాండు చేశారు. తీవ్ర అసమానతలకు గురవుతున్న ఈ వర్గాల సమస్యలపై ఇవాళ పార్లమెంటు జీరో అవర్ లో ఎంపీ ప్రస్తావించారు. చిరుఉద్యోగులు తమ జీవితాలను సమాజ సేవ కోసం అంకితం చేస్తూనే కనీస వేతనం కూడా అందుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు. వీరి సేవలు వెలకట్టలేనివి అయినప్పటికీ, వారికి చెల్లిస్తున్న జీతాలు కనీస జీవనోపాధికి కూడా సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతన చట్టం ప్రకారం సరైన జీతాలు అందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వీరి సేవలకి తగిన గౌరవం దక్కాలని ఆయన కోరారు.
అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, ఇతర సేవకులు చాలా తక్కువ వేతనాలతో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది బంధీకృత కూలీల స్థాయికి పడిపోయిందని ఎంపీ గురుమూర్తి ఆక్షేపించారు. సమాజానికి అత్యంత కీలకమైన ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే వీరు తగిన వేతనాలను పొందలేకపోతున్నారని తెలిపారు.
సమాజ సేవకుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి
సమాజ సేవకుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, సమష్టి హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని గురుమూర్తి డిమాండ్ చేశారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేసి, వీరికి తగిన పారితోషికం అందించాలని అన్నారు. అంతేగాక, వీరికి సామాజిక భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. మానవతా దృక్పథంతో వీరి హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, వీరి సేవలను గుర్తించి ప్రావిడెంట్ ఫండ్, వైద్య భద్రత, పింఛను వంటి ప్రయోజనాలు కల్పించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.