Bihar crime news: మగ బిడ్డను బలి ఇస్తే మగ బిడ్డ పుడతాడని భూతవైద్యుడు చెప్పడంతో.. రెండేళ్ల బాలుడిని హత్య చేసిన మహిళ

Best Web Hosting Provider In India 2024


Bihar crime news: మగ బిడ్డను బలి ఇస్తే మగ బిడ్డ పుడతాడని భూతవైద్యుడు చెప్పడంతో.. రెండేళ్ల బాలుడిని హత్య చేసిన మహిళ

Sudarshan V HT Telugu
Feb 07, 2025 08:23 PM IST

Bihar crime news: మంత్రగాడి మాటలను గుడ్డిగా నమ్మిన ఒక మహిళ ఒక రెండేళ్ల చిన్నారి బాలుడిని బలి ఇచ్చింది. ఈ దారుణం బిహార్ లో జరిగింది. ప్రస్తుతం ఆ మంత్రగాడు పరారీలో ఉన్నాడు. ఆ మహిళ పోలీసుల అదుపులో ఉంది. ఆ చిన్నారి మృతదేహం కుద్రా రైల్వేస్టేషన్ కు ఉత్తరాన ఉన్న గుంతలో లభ్యమైంది.

మగ బిడ్డను బలి ఇస్తే మగ బిడ్డ పుడతాడని.. రెండేళ్ల బాలుడిని హత్య చేసిన మహిళ
మగ బిడ్డను బలి ఇస్తే మగ బిడ్డ పుడతాడని.. రెండేళ్ల బాలుడిని హత్య చేసిన మహిళ

Bihar crime news: తన కూతురు గర్భం దాల్చడం కోసం ఓ మహిళ, ఒక భూత వైద్యుడి సలహాతో మరో నలుగురి సాయంతో రెండేళ్ల చిన్నారిని బలి ఇచ్చిన ఘటన బీహార్ లోని కైమూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 22న కనిపించకుండా పోయిన చిన్నారి మృతదేహాన్ని జనవరి 29న కుద్రా రైల్వేస్టేషన్ ఉత్తర ప్రాంతంలో ఉన్న ఒక గుంతలో వెలికితీశామని కైమూర్ ఎస్పీ హరి మోహన్ శుక్లా తెలిపారు.

yearly horoscope entry point

భూతవైద్యుడి సలహాతో

కూతురు గర్భం దాల్చాలంటే చిన్న పిల్లవాడిని బలి ఇవ్వాలన్న భూతవైద్యుడి సలహాతో ఆ మహిళ రెండేళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడిని కిడ్నాప్ చేసి, గొంతు నులిమి చంపేసింది. ఆ చిన్నారి కాళ్లను అతి కిరాతకంగా నరికేసింది. కాళ్లు నరకడానికి ఉపయోగించిన గ్రేడర్ మిషిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు ఈ నరబలి సలహా ఇచ్చిన భూతవైద్యుడిని గుర్తించామని, అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని శుక్లా తెలిపారు.

యూపీ నుంచి బిహార్ కు వచ్చి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని గాజీపూర్ జిల్లాకు చెందిన రెండేళ్ల బాలుడు తన మేనమామ వివాహానికి హాజరయ్యేందుకు తల్లితో కలిసి బిహార్ లోని లాలాపూర్ ప్రాంతంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. జనవరి 22న ఇంటి బయట ఆడుకుంటుండగా బాలుడు కనిపించకుండా పోయాడని అతని మేనమామ అజయ్ పాల్ కుద్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో అనుమానితుల వివరాలు తెలిశాయి. మున్నీ కున్వర్, ఆమె కుమారుడు అవినాష్ కుమార్, అతని స్నేహితుడు అంకిత్ కుమార్, లక్ష్మీనా దేవి, ఆమె కుమారుడు పరాస్నాథ్ పాల్ ను పోలీసులు అరెస్టు చేశారు.

కూతురుకి గర్భం రావడం కోసం..

విచారణలో మున్నీ కున్వర్ అసలు నిజాన్ని వెల్లడించింది. పోలీసులకు ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లయి చాన్నాళ్లయినా మున్నీ కున్వర్ కుమార్తెకు సంతానం కలగలేదు. ఎందరు వైద్యుల వద్దకు వెళ్లినా ఫలితం రాలేదు. గర్భం దాల్చకపోవడంతో రెండో పెళ్లి చేసుకుంటానని ఆమె భర్త బెదిరించసాగాడు. అత్తమామలు ఆమె కుమార్తెను చిత్రహింసలకు గురిచేశారు. ఈ సమయంలో, ఒక భూతవైద్యుడితో మున్నీకి పరిచయం ఏర్పడింది.

మగ బిడ్డను బలి ఇస్తే..

ఎవరైనా మగబిడ్డను బలి ఇచ్చిన తర్వాతే తన కుమార్తెకు మగబిడ్డ పుడతాడని ఆ భూత వైద్యుడు మున్నీని నమ్మించాడు. దీంతో ఆమె లక్ష్మి, అంకిత్ లతో కలిసి బాలుడిని కిడ్నాప్ చేసేందుకు పథకం వేసింది. జనవరి 22న అంకిత్, పరస్నాథ్ కలిసి ఆ రెండేళ్ల బాలుడిని అమ్మమ్మ ఇంటి బయట నుంచి కిడ్నాప్ చేసి మున్నీకి అప్పగించారు. చిన్నారిని బలి ఇచ్చిన తర్వాత లక్ష్మి ఆ మృతదేహాన్ని పొదల్లో పడేసింది. నిందితులు సాక్ష్యాలను దాచడానికి బలి జరిగిన ప్రాంతంలో మట్టి ఫ్లోరింగ్ ను కాంక్రీట్ తో కప్పారని శుక్లా చెప్పారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link