Best Web Hosting Provider In India 2024
జూన్ 1 నుంచి అక్కడ థియేటర్లలో సినిమాలు బంద్.. ఆ డిమాండ్ నెరవేర్చే వరకు స్ట్రైక్!
కేరళలో అక్కడి ప్రభుత్వం.. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లను నెరవేర్చకపోవడంతో జూన్ 1 నుంచి స్ట్రైక్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ఆ తేదీ నుంచి థియేటర్లలో సినిమాలు ఆడబోవని స్పష్టం చేశారు.
కేరళలోని పలు సినిమా సంఘాలు సమ్మె హెచ్చరికలు జారీ చేశాయి. అక్కడి ప్రభుత్వం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లను నెరవేర్చకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. జూన్ 1 నుంచి ఈ సమ్మె చేయనున్నారు. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మరీ ఎక్కువగా ఉండటం, నటీనటుల రెమ్యునరేషన్ పెరగడంతో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆ సంఘాలు చెబుతున్నాయి.
ఆ రెండింటితో నష్టం
కేరళలో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎంతలా నష్టపోతున్నారో కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, నటుడు జీ సురేశ్ కుమార్ వెల్లడించాడు. ఎంటర్టైన్మెంట్ పై డబుల్ ట్యాక్స్ లు, సినిమా టికెట్లపై జీఎస్టీ ద్వారా కేరళలో ప్రొడ్యూసర్లు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆయన చెప్పారు.
దీనిని వ్యతిరేకిస్తూ జూన్ 1 నుంచి అన్ని సినిమా షూటింగులు, థియేటర్లలో మూవీస్ స్క్రీనింగ్ నిలిపేస్తున్నట్లు పలు సినిమా సంఘాలు వెల్లడించాయి. ట్యాక్సులు, జీఎస్టీలకు తోడు నటీనటులు కూడా భారీ రెమ్యునరేషన్లు డిమాండ్ చేయడంపైనా ప్రొడ్యూసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెమ్యునరేషన్లకే భారీ మొత్తం
సినిమా బడ్జెట్ లో 60 శాతం కేవలం నటీనటుల రెమ్యునరేషన్లకే పోతోందని సురేశ్ చెప్పారు. జనవరి నెలలోనే మలయాళం ఇండస్ట్రీకి రూ.100 కోట్ల నష్టం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. జనవరిలో ఆసిఫ్ అలీ నటించిన రేఖాచిత్రమ్ మాత్రమే కాస్త లాభాలు ఆర్జించింది. ఆ నెలలో మొత్తం 28 సినిమాలు రిలీజైనా.. అన్నీ నష్టాలనే మిగిల్చాయి.
పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్న నటీనటుల రెమ్యునరేషన్ వివరాలను కూడా బయటకు వెల్లడిస్తామని హెచ్చరించడం గమనార్హం. అయితే జూన్ 1 నుంచి స్ట్రైక్ లోకి వెళ్లే ముందు ఒకసారి కేరళ సీఎం పినరియి విజయన్ ను వాళ్లు కలవనున్నారు. ఆ తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
సాధారణంగా మలయాళం సినిమాలంటే తక్కువ బడ్జెట్ తో రూపొంది బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తాయి. కానీ ఈమధ్య కాలంలో ఆ ఇండస్ట్రీ సినిమాల బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. మలయాళం నుంచి కూడా భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. అయితే అదే స్థాయిలో వసూళ్లు మాత్రం ఉండటం లేదు. దీనికితోడు పన్నులు, రెమ్యునరేషన్లతో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు.