Best Web Hosting Provider In India 2024
Mana Mitra Whatsapp : మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్‌కు పెరుగుతున్న ఆదరణ.. త్వరలో టీటీడీ సేవలు కూడా!
Mana Mitra Whatsapp : బర్త్ నుంచి డెత్ వరకు.. ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. లోకల్ లీడర్లను బతిమిలాడాల్సి వచ్చేది. కానీ.. ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి మారింది. ఒక్క హాయ్ అనే మెసేజ్‌తో అన్ని మన ఫోన్లోకే వచ్చేస్తున్నాయి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. పౌరులు ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పించింది. ప్రజలు 161 సేవలను పొందేందుకు వీలుగా వాట్సప్ గవర్నెన్స్‌కు శ్రీకారంచుట్టింది. దీంతో పౌరులు తమకు అవసరమైన సేవలను వాట్సప్ ద్వారానే పొందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్‌కు ఆదరణ పెరుగుతుంది.
2025 జనవరి 30న కూటమి ప్రభుత్వం మన మిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 95523 00009 నంబరును కేటాయించింది. ఈ నంబరుకు హాయ్ అని మెసేజ్ చేస్తే.. ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో కనిపిస్తుంది. వాటిల్లో మనకు అవసరమైన సర్వీసును ఎంచుకొని.. సేవలను పొందవచ్చు.
సర్టిఫికెట్లు పోయినా..
పౌరులు ఏవైనా సర్టిఫికెట్లు పోగొట్టుకుంటే ఇన్నాళ్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మన మిత్ర ద్వారా పత్రాలు, వస్తువులు పోయాయని నమోదు చేసుకుంటే.. పురోగతిని కూడా వాట్సప్ ద్వారానే తెలుసుకోవచ్చు. తాజాగా.. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా వాట్సప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చని.. ప్రభుత్వం ప్రకటించింది.
త్వరలో టీటీడీ సేవలు..
ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలోని ఏడు ఆలయాలకు సంబంధించి దర్శనం, సేవలు దీని ద్వారా పొందవచ్చు. శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు ఇందులో ఉన్నాయి. మన మిత్ర ద్వారా దర్శన టికెట్లు పొందే సౌలభ్యం ఉంది. త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏయే సేవలు ఉన్నాయి..
ప్రస్తుతం మన మిత్ర ద్వారా.. ఏపీఎస్ఆర్టీసీ, విద్యుత్తు, దేవాదాయ, పురపాలక, రెవెన్యూ, ఆరోగ్య కార్డులు, పోలీసు శాఖకు సంబంధించిన 161 సేవలు అందుబాటులో ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి.. వ్యవసాయ ఆదాయ ధ్రువపత్రం, కుటుంబసభ్యుల ధ్రువపత్రం, అడంగల్, ఆర్వోఆర్, నీటి తీరువా, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, టైటిల్ డీడ్ పాస్ పుస్తకం ప్రింటింగ్, వివాహ ధ్రువపత్రం వంటి సేవలను మన మిత్ర ద్వారా అందిస్తున్నారు.
టాపిక్