అవినీతికి ఘనాపాటి ప్రత్తిపాటి పుల్లారావు

Best Web Hosting Provider In India 2024

అక్రమ కేసులతో భయపెట్టే ప్రయత్నం

మాజీ మంత్రి విడదల రజిని ఫైర్‌

ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసుల అత్యుత్సాహం

హైకోర్టు ఆదేశించకపోయినా కేసు నమోదు

మాజీ మంత్రి విడదల రజిని ఆక్షేపణ

నన్ను, నా కుటుంబాన్ని వేధించడమే పుల్లారావు లక్ష్యం

మా మామయ్య, మా మరిదిపైనా అక్రమ కేసులు

విద్యుత్‌ నిరసన కార్యక్రమంపైనా కేసులు నమోదు

వైయస్ఆర్‌సీపీ లేకుండా చేయడమే ఎమ్మెల్యే టార్గెట్‌

ఎమ్మెల్యే చర్యలకు ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి విడదల రజిని వార్నింగ్‌

చిలకలూరిపేట: అవినీతికి ఘనాపాటిగా మారిన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, అక్రమ కేసులతో తనను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అయితే తాను వేటికీ భయపడపోనని మాజీ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని, ఆయన ఆదేశాలతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తన కుటుంబంపై కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి ఆక్షేపించారు. నిజానికి హైకోర్టు ఆదేశించకపోయినా, తన కుటుంబంపై అక్రమంగా కేసు నమోదు చేశారని దుయ్యబట్టారు. కేవలం తన కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పని చేస్తున్నారని, ఆయన ఆదేశాలతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులకు కచ్చితంగా ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు. శ‌నివారం చిలకలూరిపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి విడదల రజిని మీడియాతో మాట్లాడారు.

అవినీతికి ఘనాపాటి ప్రత్తిపాటి:
    అనేక అబద్ధపు హామీలిచ్చి, మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించిన కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలవుతోంది. ఇన్ని నెలలైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న  వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారు. దాడులు, దోపిడీలు, అరెస్టులే ప్రభుత్వ పాలసీగా మారిపోయింది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ, నోరెత్తిన వారిని అక్రమంగా అరెస్ట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అవినీతికి ఘనాపాటి ఎమ్మెల్యే ప్రత్తిపాటి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. 

హైకోర్టునూ తప్పుదోవ పట్టించి..:
    ఐదున్నరేళ్ల కిందట 2019లో టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్త పెట్టిన నిరాధార, అసభ్య పోస్టులపై ఆనాడు పోలీసులు చర్యలు తీసుకున్న అంశాన్ని తిరగదోడి.. ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రతీకార రాజకీయం చేస్తున్నారు. నాడు ఎమ్మెల్యేగా ఉన్న నేనే అతడిని అరెస్టు చేయించానంటూ తప్పుడు ఆరోపణలతో సదరు వ్యక్తితో కేసులు నమోదు చేయిస్తున్నారు. పోలీసులు తమ వృత్తిలో భాగంగా తీసుకున్న చర్యలను కక్షపూరితంగా నేనే చేయించానంటూ ఎమ్మెల్యే ప్రత్తిపాటి కట్టుకథలు అల్లుతున్నారు. చివరకు హైకోర్టును ఆశ్రయించి, నాపై కేసు నమోదు చేసేలా కుట్ర చేశారు. హైకోర్టు ఆదేశించకపోయినా, నాపైనా, నా కుటుంబ సభ్యులపైనా అక్రమంగా కేసులు నమోదు చేశారు.

నా కుటుంబంపై కక్ష సాధింపు:
    కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ ఛార్జీలకు నిరసనగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్‌ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ ఘటనలోనూ నాతో సహా పార్టీకి చెందిన 30 మందిపై అక్రమ కేసులు నమోదు చేశారు. పోలీస్‌ వ్యవస్థ టీడీపీకి అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోంది. నియోజకవర్గంలో ఉన్న వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బయటకు రాకుండా, ప్రభుత్వ వైఫల్యాలపై గొంతెత్తకుండా అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. 80 ఏళ్ల వయసున్న మా మామయ్య, విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న మా మరిదిపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు.
    గడిచిన ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఏనాడూ ప్రత్తిపాటి పుల్లారావు మాదిరిగా అనైతిక చర్యలకు పాల్పడింది లేదు. చట్టం తన పని తాను చేసుకుపోయిందే తప్ప, ఏనాడూ వారి పనిలో కలగజేసుకోలేదు. కానీ ప్రత్తిపాటి మా కుటుంబంతోపాటు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారు. ఆయన వేధింపులు ఎంతోకాలం సాగవు. త్వరలోనే ముగింపు పలికే రోజు వస్తుంది. 

కచ్చితంగా ప్రతిచర్య:
    ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అరాచకాలు, అవినీతి, జర్నలిస్టు మర్డర్ల గురించి నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక్క రోజు ఆలోచించి ఉన్నా ఆయన ఏమై ఉండేవారో ఆలోచించుకోవాలి. నా ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు పుల్లారావు పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం తలవంచింది. కేసులు పెట్టి వేధించినంత మాత్రాన వైయస్ఆర్‌సీపీ భయపడి వెనక్కి తగ్గడం జరగదు. మరింత బలంగా ఢీకొంటాం. రాబోయే రోజుల్లో పుల్లారావు చేసిన అరాచకాలకు వడ్డీతో సహా బదులిస్తాం. 
    ప్రత్తిపాటి అండ చూసుకుని గ్రామాల్లో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై రెచ్చిపోతున్న టీడీపీ గూండాలను ఎవర్నీ  వదిలిపెట్టేది లేదు. అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులు కూడా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. మా ప్రభుత్వం వచ్చిన రోజున ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందని గుర్తుంచుకోవాలి.
    తనను నేరుగా ఎదుర్కోలేక, బీసీ మహిళ అని కూడా చూడకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వేధింపులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు మాజీ మంత్రి విడదల రజని వెల్లడించారు.

Best Web Hosting Provider In India 2024