Best Web Hosting Provider In India 2024
పేద విద్యార్ధులను చదువులకు దూరం చేసే కుట్ర
కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్
జీఓ 117 వల్ల విద్యావ్యవస్థలో పెను మార్పులు
రాజకీయ దురుద్దేశంతోనే ఈ జీఓపై టీడీపీ విష ప్రచారం
మోడల్ స్కూళ్ళ పేరుతో పేద విద్యార్ధులకు చదువులు దూరం చేసే కుట్ర
వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధనకు చర్యలు
ఓర్వలేక గత ప్రభుత్వ విధానాలన నాశనం చేస్తున్న కూటమి సర్కార్
నెల్లూరు వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
నెల్లూరు: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువస్తే, నేడు ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే 117 జీఓను రద్దు చేశారని ఆక్షేపించారు.
చంద్రశేఖర్‌రెడ్డి ఏమన్నారంటే…
ఈ రాష్ట్రంలో వైయస్ జగన్ గారు విద్యా విప్లవాన్ని తీసుకువచ్చారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయిలో ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్ధులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేశారు. కూటమి ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల్లో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తోంది. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 117 రద్దును కూటమి పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకువచ్చాయి. ఈ జీఓపైన విష ప్రచారం చేశారు. విద్యార్ధులకు ఉపయోగపడే జీఓపైన అసత్య ప్రచారం చేశారు. మన విద్యా వ్యవస్థలో మూడు రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ప్రాథమిక, ఏడో తరగతి వరకు ప్రాథమికోన్నత, పదో తరగతి వరకు ఉన్నత పాఠశాలలుగా వాటిని వర్గీకరించి ప్రభుత్వం నడుపుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తుండగా, ఉన్నత పాఠశాలల్లో బీఈడీ అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్ లు విద్యాబోధన చేస్తున్నారు. సీఎంగా వైయస్ జగన్ గారు ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్ధులకు కింది తరగతుల నుంచే ఉన్నత విద్యార్హత కలిగిన బీఈడీ ఉపాధ్యాయులతో చదువు చెప్పించినట్లయితే వారు భవిష్యత్తులో మంచి నాలెడ్జ్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చెందుతారని భావించారు. అందుకోసం మూడో తరగతి నుంచే స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులతో చదువు చెప్పించేందుకు జీఓ 117 ను జారీ చేశారు. దీని ప్రకారం హైస్కూళ్ళకు ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాథమి పాఠశాలల్లో మూడు, నాలుగు, అయిదో తరగతి చదువుతున్న విద్యార్ధులను తీసుకువచ్చి హైస్కూల్ టీచర్లతో చదువు చెప్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 33 వేల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో కూడా ఈ కిలోమీటర్ పరిధి నిబంధన కింద వచ్చే ప్రాథమిక పాఠశాలలను మాత్రమే హైస్కూళ్ళకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో దాదాపు 8 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కూడా కల్పించారు. వారితో ఉన్నత పాఠశాల ప్రమాణాలతో కూడిన విద్యను మూడు, నాలుగు, అయిదో తరగతి విద్యార్ధులకు బోధించేలా చూశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ కావాలనే విష ప్రచారం చేసింది.
ఒక పంచాయతీకి ఒకే మోడల్ స్కూల్ ఏర్పాటు దారుణం
ఒక మంచి ఉద్దేశంతో, ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్ధుల భవిష్యత్తును బంగారుమయం చేయాలనే లక్ష్యంతో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 117పై పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తన ప్రయోజనా కోసం రాజకీయం చేసింది. ఎన్నికలకు ముందు ఈ జీఓను రద్దు చేస్తామంటూ ఏకంగా మేనిఫేస్టోలోనే ప్రకటించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో తాడేపల్లిలో మీటింగ్ లను నిర్వహించారు. గత పదిహేను రోజుల కిందట ఈ జీఓను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ జీఓ ప్రకారం ఏర్పాటు చేసిన వ్యవస్తను రద్దు చేసిన తరువాత పాత వ్యవస్థ అమలులోకి రావడం ఎక్కడైనా జరుగుతుంది. కానీ చంద్రబాబు దానికి భిన్నంగా అటు ఉపాధ్యాయుల్లోనూ, ఇటు విద్యార్ధుల తల్లిదండ్రుల్లోనూ ఒక అయోమయాన్ని కల్పించేలా కొత్త విధానంను ప్రతిపాదించడం దారుణం. మోడల్ స్కూల్ అనే ఒక కాస్సెప్ట్ ను తీసుకువచ్చారు. ఒక పంచాయతీకి ఒక ప్రైమరీ స్కూల్ ను మాత్రమే మోడల్ స్కూల్ పేరుతో నడుపుతానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీని ప్రకారం రాష్ట్రంలోని 33 ప్రాథమిక పాఠశాలలు పంచాయతీకి ఒకటి చొప్పున కేవలం 12 వేల స్కూల్స్ మాత్రమే నిర్వహిస్తారు. మిగిలిన 21వేల ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న మూడు, నాలుగు, అయిదో తరగతి విద్యార్ధులు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న మోడల్ కాన్సెప్ట్ స్కూళ్ళకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది.
21 వేల ప్రాథమిక పాఠశాల కుదింపు
వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 117 ప్రకారం సుమారు 4వేల ప్రాథమిక పాఠశాలల నుంచే మూడు నుంచి అయిదో తరగతి చదివే విద్యార్ధులు కేవలం కిలోమీటర్ పరిధిలోనే ఉండే హైస్కూల్ కు వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 21వేల ప్రాథమిక పాఠశాల్లో మూడు నుంచి అయిదో తరగతి చదువుతున్న విద్యార్ధులు మోడల్ స్కూళ్ళకు వెళ్ళాల్సి వస్తుంది. ఈ స్కూళ్లు కేవలం ఒకటి, రెండు తరగతులకే పరిమితమవుతున్నాయి. మోడల్ స్కూళ్ళు ఎన్ని కిలోమీటర్లు దూరంలో ఉన్నా సరే మూడో తరగతి నుంచి ఆ స్కూల్ కు వెళ్ళాల్సిన పరిస్థితిని కల్పించారు. పంచాయతీల్లో ప్రస్తుతం కనీసం మూడు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిని ఇలా విలీనం చేయడం వల్ల మారుమూల గ్రామలకు చెందిన విద్యార్ధులు మోడల్ స్కూల్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా? అయిదో తరగతి వరకు తమకు అందుబాటులో ఉన్న స్కూళ్ళలో స్థానికంగా చదివించుకుని, ఆ తరువాత ఉన్నత విద్యాకోసం హైస్కూల్ కు పంపుతున్న విధానంను చంద్రబాబు పూర్తిగా విధ్వంసం చేశారు. ఈ 21వేల ప్రాథమిక పాఠశాలల్లో మూడు నుంచి అయిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులను బలవంతంగా మోడల్ స్కూళ్ళకు పంపాలని వత్తిడి తెస్తున్నారు. ఇలా పంపక పోతే ఈ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లను బాధ్యులను చేస్తామంటూ ప్రభుత్వం బెదిరిస్తోంది. మరోవైపు టీచర్లే పిల్లలను మోడల్ స్కూళ్ళకు పంపుతున్నారని తల్లిదండ్రులకు చెబుతున్నారు.
ప్రాథమికోన్నత పాఠశాలలను ఎత్తివేసే కుట్ర
మన రాష్ట్రంలో 3155 ఏడో తరగతి వరకు ఉండే ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో ఒక్క స్కూల్ కూడా లేకుండా చేసేందుకు చంద్రబాబు కన్నెర్ర చేస్తున్నారు. ఆరు, ఏడు తరగతుల్లో కనీసం క్లాస్ కు 30 మంది కంటే తక్కువ విద్యార్ధులు ఉంటే ఆ స్కూళ్ళను ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇలా విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉన్న స్కూళ్ళు దాదాపు 2500 వరకు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతి చదువుతున్న విద్యార్ధులు దూరంగా ఉన్న హైస్కూళ్ళకు వెళ్ళాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. పేద విద్యార్ధులు ఇంత దూరం వెళ్ళగలరా? ప్రాథమికోన్నత పాఠశాలలను ఎత్తివేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.
హైస్కూల్ ప్లస్ లపైనా కక్షసాధింపు
గ్రామాల్లో పదోతరగతి వరకు హైస్కూల్ చదివి, ఇంటర్మీడియేట్ కు దూరంగా ఉన్న జూనియర్ కాలేజీలకు వెళ్ళల్సిన పరిస్థితిని మార్చేందుకు వైయస్ జగన్ గారు హైస్కూల్ ప్లస్ అనే వ్యవస్థను తీసుకువచ్చారు. ఇందుకోసం ప్రతి మండలంలో ఒక ఉన్నత పాఠశాలను హైస్కూల్ ప్లస్ కింద మారుస్తూ రాష్ట్రంలో మొత్తం 292 విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆడపిల్లలకు మాత్రమే విద్యను అందించేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం హైస్కూళ్ళలో పనిచేస్తున్న వారిలో పీజీ అర్హత కలిగిన 1800 మందిని పీజీటీలుగా ఉన్నతిని కల్పించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు కో-ఎడ్యుకేషన్ కోసం మరో 210 హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థలను అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 జూన్ నుంచి ఈ విద్యాసంస్థల్లో విద్యార్ధులు చేరడం, తరగతుల నిర్వహణ కూడా ప్రారంభమైంది. అయితే గత ప్రభుత్వం ఈ నిర్ణయం చేసిందనే కక్షతో కూటమి ప్రభుత్వం ఈ హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థలకు ఒక్క టీచర్ ను కూడా కేటాయించలేదు. పైగా వాటిల్లో నాణ్యతా ప్రమాణాలు లేదని చెబుతూ ఈ మొత్తం హైస్కూల్ ప్లస్ విద్యావ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటి స్థానంలో అవసరమైన చోట్ల జూనియర్ కాలేజీలను పెడతామని ప్రకటించారు. జిల్లా పరిషత్ హైస్కూళ్ళలో జూనియర్ కాలేజీలను పెట్టేందుకు ఎంత వరకు వీలవుతుందనే అంశాన్ని పరిశీలించకుండానే కూటమి ప్రభుత్వం ఇటువంటి తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంది. జూనియర్ కాలేజీలను జిల్లా పరిషత్ యాజమాన్యంలో నిర్వహించడం కుదురుతుందా?
ఎంఈఓ-2 రద్దు దుర్మార్గం
వైయస్ జగన్ గారు వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు గతంలో ఉన్న ఒకే మండల విద్యాశాఖ అధికారి పోస్ట్ లను పెంచుతూ ప్రతి మండలానికి ఇద్దరు ఎంఈఓలను నియమించారు. ఎంఈఓ-1 వ్యవస్థలో ప్రభుత్వం నుంచి, ఎంఈఓ-2 వ్యవస్థలో జిల్లా పరిషత్ నుంచి వచ్చే వారు ఉంటారు. కూటమి ప్రభుత్వం ఎటువంటి హేతుబద్దత లేకుండా కేవలం గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ఉద్దేశంతో ఎంఈఓ-2 వ్యవస్థను రద్దు చేసింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డెబ్బై శాతం కాంట్రాక్ట్ అధ్యాపకులే ఉన్నారు. వారిని రెగ్యులర్ చేసేందుకు వైయస్ జగన్ గారు జీఓను తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం ఆ జీఓను అమలు చేయకుండా పక్కకుపెట్టింది. పదహారు వేల టీచర్ పోస్ట్ ల డీఎస్సీని నిర్వహించకుండా కుంటిసాకులు చెబుతున్నారు. అయిదు లక్షల మంది అభ్యర్ధులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు.