




Best Web Hosting Provider In India 2024

GHMC : టూరిస్ట్ స్పాట్‌గా ‘మీరాలం చెరువు’ – 2.4 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిధిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. 30 నెలల్లోగా మీర్ ఆలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలన్నారు.
హైదరాబాద్ నగరంలో మీర్ ఆలం చెరువుపై నిర్మించే బ్రిడ్జిని అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాలను ఆకర్షణీయంగా మార్చాలని దిశానిర్దేశం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మీర్ ఆలం చెరువు పై 2.4 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణం కోసం మూడు ప్రతిపాదనలను అధికారులు వివరించారు.
30 నెలల్లో నిర్మాణం పూర్తి కావాలి – సీఎం రేవంత్ రెడ్డి
అధికారుల ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో డీపీఆర్ సిద్ధం చేయడంతో పాటు 30 నెలల్లోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిధిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ అంశాలపై రెండు రోజుల్లో సమగ్ర సమాచారంతో మరోసారి సమీక్షకు రావాలని సూచించారు.
మీరాలం చెరువును టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు భారీ ప్రణాళికలను సిద్ధం చేయగా… వీటికి హెచ్ఎండీఏ అనుమతులు కూడా జారీ అయ్యాయి. కేబుల్ బ్రిడ్జి లేదా సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించాలని యోచిస్తోంది.
సాధారణ వంతెనతో పాటు తీగతల వంతెన, కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నమూనాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మూడు రకాల ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి చేరాయి. సాధారణ వంతెన అయితే రూ.375 కోట్లతో పూర్తవుతుంది. అదే తీగల వంతెన అయితే రూ.1200 కోట్లు, కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి అయితే రూ.1900 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. తుది నిర్మాణంపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కార్యరూపం దాల్చి పూర్తయితే… పలు రూట్లవైపు రాకపోకలు సులభతరమయ్యే అవకాశం ఉంటుంది.
టాపిక్