



Best Web Hosting Provider In India 2024
AU Protest : ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ ఆందోళన-పరిశుభ్రమైన భోజనం, మంచి నీరు అందించాలని బైఠాయింపు
AU Scholars Protest : ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ ఆందోళన చేపట్టారు. పరిశుభ్రమైన భోజనం, తాగేందుకు మంచి నీరు అందించాలని రీసెర్చ్ స్కాలర్స్ బైఠాయించారు. దీంతో వైస్ ఛాన్సులర్ స్పందించి విద్యార్థులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
AU Scholars Protest : రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీల్లో ఒకటైన ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ ఆందోళన చేపట్టారు. పరిశుభ్రమైన భోజనం, తాగేందుకు మంచి నీరు వంటి కనీస అవసరాలను అందించాలని రీసెర్చ్ స్కాలర్స్ బైఠాయించారు. దీంతో ఒక్కసారిగా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌లో కదలిక వచ్చింది. సోమవారం రీసెర్చ్ స్కాలర్స్‌తో సమావేశం నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు సిద్ధపడ్డారు.

హాస్టల్‌లో నీరు తాగలేకపోతున్నామని, భోజనం తినలేకపోతున్నామంటూ ఆంధ్ర యూనివర్సిటీలోని జీఎంసీ బాలయోగి రీసెర్చ్ హాస్టల్ ఎదుట పరిశోధక విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినప్పటికీ పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. అయితే విద్యార్థుల ఆందోళన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన హాస్టల్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు విద్యార్థులతో మాట్లాడి, వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
విద్యార్థులు మాత్రం తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌లో కదలిక వచ్చింది. విద్యార్థుల ఆందోళన గురించి సమాచారం అందుకున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ శశిభూషణరావు… వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని యూనివర్సిటీ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ రామరాజుకు సూచించారు. దీంతో ఆయన ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు.
భోజనం తినలేకపోతున్నాం
విద్యార్థులు తమ సమస్యలను ప్రిన్సిపల్‌కు వివరించారు. తాగు నీరు పరిశుభ్రంగా ఉండటం లేదని, మెనూ ప్రకారం కాకుండా, కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినట్లుగా సరఫరా చేసే కూరగాయలతో వండి పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. ముందు రోజు సాయంత్రం ఉడకబెట్టిన దుంపలు, కూరగాయలనే మరుసటి రోజు పెడుతున్నారని పేర్కొన్నారు. ఆ భోజనం తినలేకపోతున్నామని తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ఈ విషయం హాస్టల్ చీఫ్ వార్డెన్‌కు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. రీసెర్చ్ స్కాలర్స్‌తో సమావేశం పెట్టాలని కోరినప్పటికీ వార్డెన్ స్పందించలేదని, గత్యంతరం లేక ఆందోళన చేస్తున్నామని తెలిపారు.
చీఫ్ వార్డెన్ తొలగింపు
చీఫ్ వార్డెన్ విజయ్‌బాబును తొలగిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ శశిభూషణరావు ప్రకటించారు. రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ రామరాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే విద్యార్థులకు వీసీ శశిభూషణరావు స్పష్టమైన హామీ ఇచ్చారు. సోమవారం రీసెర్చ్ స్కాలర్స్‌తో సమావేశం నిర్వహించాలని రామరాజుకు వీసీ సూచించారు. సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వీసీ హామీ ఇచ్చారు.
హాస్టళ్లలో సమస్యలతో విద్యార్థులు సతమతం అవ్వడంపై యూనివర్శిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ హాస్టల్ విద్యార్థులు వీసీ కార్యాలయం ఆందోళన చేపట్టారు. ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని విద్యార్థి సంఘ నేతలు పేర్కొన్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్