




Best Web Hosting Provider In India 2024

CID Case On RGV : సీఐడీ విచారణకు డైరెక్టర్ ఆర్జీవీ డుమ్మా, 8 వారాలు గడువు ఇవ్వాలని వినతి
CID Case On RGV : సీఐడీ విచారణకు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గౌర్హాజరు అయ్యారు. సినిమా ప్రమోషన్ లో ఉన్న కారణంగా తాను విచారణకు రాలేనని ఆర్జీవీ సీఐడీకి సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరయ్యేందుకు 8 వారాల గడువు ఇవ్వాలని సీఐడీ అధికారులను కోరారు.
CID Case On RGV :ఏపీ సీఐడీ విచారణకు దర్శకుడు రాంగోపాల్ వర్మ డుమ్మా కొట్టారు. సోమవారం విచారణకు హాజరవ్వాలని ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాను సినిమా ప్రమోషన్ లో ఉన్న కారణంగా సోమవారం విచారణకు రాలేనని ఆర్జీవీ సీఐడీకి సమాచారం అందించారు.

ఆర్జీవీ తరఫున ఆయన న్యాయవాది నానిబాబు గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఎనిమిది వారాల పాటు ఆర్జీవీ ఎలాంటి విచారణకు హాజరుకాలేరని, ఎనిమిది వారాల పాటు గడువు ఇవ్వాలని లిఖిత పూర్వకంగా సీఐడీ పోలీసులకు వినతి పత్రం అందించారు.
ఈ నోటీసులపై సీఐడీ అధికారులు ఏవిధంగా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే ఆర్జీవీకి మంగళవారం మళ్లీ నోటీసులు ఇవ్వాలని సీఐడీ భావిస్తున్నట్లు సమాచారం. 2019లో రాంగోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో వివాదాస్పద చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా పేరుపై వివాదం చెలరేగడంతో ఆ పేరును ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చి విడుదల చేశారు. అయితే యూట్యూబ్‌లో మాత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతోనే విడుదల చేశారు. దీనిపై ఆత్మకూర్‌కు చెందిన వంశీకృష్ణ బండారు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆర్జీవీపై సీఐడీ కేసు
యూట్యూబ్ లో విడుదల చేసిన చిత్రంలో ఉద్రేకపూరిత దృశ్యాలను తొలగించలేదని వంశీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రాంగోపాల్ వర్మపై మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్‌లో గతేడాది నవంబరు 29న కేసు నమోదైంది. ఈ కేసులో ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. ఇటీవల ఒంగోలులో సీఐడీ అధికారులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చి సోమవారం విచారణకు రావాలని కోరారు. అయితే విచారణకు రాలేనని, 8 వారాల పాటు గడువు ఇవ్వాలని ఆర్జీవీ పోలీసులను కోరారు.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తమ మనోభావాలు దెబ్బతినేలా ఉందని ఆర్జీవీపై టీడీపీ నేతలు సైతం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఒంగోలు సీఐ విచారణకు ఆర్జీవీ హాజరయ్యారు. ఈ ఫిర్యాదుపై సీఐడీ కూడా ఆర్జీవీని విచారించాలని నిర్ణయించింది. సీఐడీ విచారణకు ఆర్జీవీ రాకపోవడంతో తదుపరి కార్యచరణపై అధికారులు చర్చిస్తున్నారు.
చంద్రబాబు, పవన్ , లోకేశ్ పై వివాదాస్పద పోస్టులు
వైసీపీ మద్దతుదారుడైన ఆర్జీవీ…గత ప్రభుత్వంలో ప్రతిపక్షాల లక్ష్యంగా వివాదాస్పద చిత్రాలు తీశారు. ఈ చిత్రాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లను పోలీన వ్యక్తులను పెట్టి వారిని కించపరిచేలా సన్నివేశాలు చిత్రీకరించారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే వైసీపీ ప్రభుత్వ సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై తరచూ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టేవారు.
వీరి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని గత ఏడాది నవంబర్ 10న వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఆర్జీవీ విచారణకు హాజరుకాలేదు. కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ఆర్జీవీకి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
సంబంధిత కథనం
టాపిక్