




Best Web Hosting Provider In India 2024

Mutton Dalcha: హైదరాబాదీ స్పెషల్ మటన్ దాల్చా అన్నం పులావ్‌లోకి అదిరిపోయే రెసిపీ
Mutton Dalcha: హైదరాబాదులో చాలా స్పెషల్‌గా మటన్ దాల్చాను వండుతారు. ఇది అద్భుతంగా ఉంటుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది.
హైదరాబాదీలకు మటన్ దాల్చా గురించి బాగా తెలుసు. అది ఉంటే చాలు ఎంత అన్నమైనా, పులావైన తినేస్తారు. టేస్టీగా జ్యూసీగా గ్రేవీగా ఉంటుంది ఈ కూర. మటన్ దాల్చాను మనం కూడా వండుకోవచ్చు. దీన్ని వండడం చాలా సులువు. మటన్ దాల్చా రెసిపీ మీకు తినాలనిపిస్తే ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో వండి చూడండి. అద్భుతంగా ఉంటుంది. మటన్ దాల్చా అంటే మటన్, పప్పు కలిపి చేసే వంటకం. ఇందులో మనం శెనగపప్పును వినియోగిస్తాము. శనగపప్పు కూడా నాన్ వెజ్ వంటకానికి మంచి రుచిని అందిస్తుంది. ఇక మటన్ దాల్చా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

మటన్ దాల్చా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
శనగపప్పు – ఒక కప్పు
మటన్ – అరకిలో
పచ్చిమిర్చి -మూడు
పసుపు – అర స్పూను
ఉప్పు -రుచికి సరిపడా
కారం – రెండు స్పూన్లు
నూనె – మూడు స్పూన్లు
దాల్చిన చెక్క – రెండు ముక్కలు
లవంగాలు – మూడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూను
అనాసపువ్వు – ఒకటి
ఉల్లిపాయలు – రెండు
టమోటో – రెండు
సొరకాయ ముక్కలు – ఒక కప్పు
చింతపండు – ఉసిరికాయ సైజులో
మిరియాలు – నాలుగు
బిర్యానీ ఆకు – రెండు
యాలకులు – రెండు
ధనియాల పొడి – రెండు స్పూను
గరం మసాలా – అర స్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
నీళ్లు – సరిపడా
మటన్ దాల్చా రెసిపీ
1. మటన్ దాల్చా హైదరాబాదులో చాలా స్పెషల్ వంటకం ఇది.
2. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనికి ముందుగా శెనగపప్పును నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
3. తర్వాత కుక్కర్లో వేసి మెత్తగా నానబెట్టి గరిటతోనే మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి.
4. శెనగపప్పు ఉడకబెడుతున్నప్పుడే అందులో పసుపు కూడా వేయాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వెయ్యాలి.
6. ఆ నూనెలో యాలకులు, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు వంటివి వేయించాలి.
7. తర్వాత ఉల్లిపాయలను కూడా వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.
8. ఉల్లిపాయలు వేగాక అల్లాన్ని వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి.
9. ఆ తర్వాత సన్నగా తరిగిన టమోటో ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.
10. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న మటన్ ఇందులో వేసి బాగా కలపాలి.
11. మటన్ ను కలిపాక ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి బాగా కలుపుకోవాలి.
12. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలపాలి.
13. కొంచెం నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
14. మటన్ ముదరగా ఉంటే ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
15. ఆవిరి పోయాక కుక్కర్ మీద మూత తీసి ముందుగా కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అందులో వేయాలి.
16. ఒక ఐదు నిమిషాలు పాటు వేయించాలి. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న శెనగపిండి ముద్దను ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
17. పచ్చిమిర్చి తరుగును కూడా వేయాలి. దీన్ని 20 నిమిషాలు పాటు బాగా ఉడకనివ్వాలి.
18. పైన కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే మటన్ దాల్చా రెడీ అయినట్టే. ఇది అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తిని చూశారంటే మర్చిపోలేరు.
మటన్ దాల్చా తినడం వల్ల ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. శెనగపప్పు, సొరకాయ, మటన్ మూడు రకాల వస్తువులను ఇందులో వాడాము. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి మటన్ దాల్చాను అప్పుడప్పుడు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదే. ఈ మటన్ దాల్చా వల్ల అన్నం ఎక్కువగా కలుస్తుంది. అరకిలో మటన్ తెచ్చుకుంటే చాలు ఎక్కువ కూర అవుతుంది. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా మటన్ దాల్చా చేసి వండి వడ్డించండి. వారికి ఇది ఎంతో నచ్చే అవకాశం ఉంటుంది.
సంబంధిత కథనం