



Best Web Hosting Provider In India 2024
AP MLC Elections : ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి సవాల్‌గా మారనున్నాయి? 10 కీలక అంశాలు
AP MLC Elections : ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతుంది. ఈ ఎన్నికలను అధికార టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. అయితే ఈ ఎన్నికలు అధికార కూటమికే సవాల్‌గా మారాయి.
ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. అధికార కూటమి అభ్యర్థి గెలిస్తే పెద్దగా లాభం ఏమీ ఉండదు. కాకపోతే ఓటమి చెందితే, తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు, నిరుద్యోగుల అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అందుకే గెలుపు కోసం గత నాలుగు నెలలుగా కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.నామినేషన్ల గడువు సోమవారంతో ముగిసింది. మొత్తం 59 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరికి బరిలో ఎవరెవరు ఉంటారో అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది. ఫిబ్రవరి 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. ఆ తరువాత బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత వస్తోంది.
2.మొత్తం 59 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ.. ప్రధానంగా టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘవులు మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. పేరాబత్తుల రాజశేఖర్ ఆర్థికంగా బలమైన నాయకుడు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారమే ఆయన కోటీశ్వరుడు. డీవీ రాఘవులు మధ్యతరగతి వర్గానికి చెందిన వారు. ఉపాధ్యాయుడిగా పదవీవిరమణ పొందిన వ్యక్తి. ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇటు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు గెడ్డం విజయసుందర్ కూడా బరిలో ఉన్నారు.
3. ఈ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓటర్లను చేర్పించడం నుంచి ప్రచారం వరకూ చాలా పగడ్భందీగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగి ఓటర్లను చేర్పించడంలో నిర్లక్ష్యంగా ఉన్న మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు క్లాస్ తీసుకున్నారు. పరిశీలకులను రంగంలో దింపి ప్రతి నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. కూటమిలోని జనసేన, బీజేపీ నేతలను కలుపుకుపోయి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ కార్యక్రమానికి.. బీజేపీ తరపున కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ తరపున మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కూటమి ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. భారీగా జన సమీకరణ చేశారు.
4. కూటమిలోని జనసేన నేతలు ప్రచారం చేసినప్పటికీ.. కార్యకర్తల్లో కాస్తా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన ప్రచారంలో అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ టీడీపీ అభ్యర్థా? లేక కూటమి అభ్యర్థా? అంటూ జనసేన కార్యకర్తలు నిలదీశారు. పెద్దాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ అభ్యర్థి ప్రచార కరపత్రంపై జనసేన జిల్లా అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ తుమ్మల రామస్వామి ఫోటో లేకపోవడంతో.. కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కరపత్రాలను చించివేశారు. జనసేన నుంచి ఆశించినంత మద్దతు ఉండకపోవచ్చని రాజకీయ నేతల విశ్లేషణ.
5. జనసేన కార్యకర్తలు ఎక్కడా ప్రచారంలో భాగస్వామ్యం కావటం లేదు. క్షేత్రస్థాయిల్లో టీడీపీ నేతలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. కూటమి సమావేశాల్లో జనసేన నాయకులను ఆహ్వానించినప్పటికీ, కార్యకర్తలను టీడీపీ పట్టించుకోవడం లేదని విమర్శలు విడబడుతున్నాయి. దీనికి టీడీపీకి చెందిన నేతలు, వారే దూరంగా ఉంటున్నారని బదులిస్తున్నారు.
6.టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఆర్థికంగా బలమైన నాయకుడు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం తన పేరుతో రూ.22.85 కోట్లు స్థిర, చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య సత్యవాణి పేరుతో రూ.13.56 కోట్ల ఆస్తులు ఉన్నాయి. సామాజికంగా కూడా బలమైన నేత. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపుల ఓట్లు గణనీయంగా ఉంటాయి. అయితే.. చదువుకున్నవారంతా కుల ఫీలింగ్‌నే చూపిస్తారనుకోలేం. ఎందుకంటే ఇటీవలే జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన గంధం నారాయణ రావును ఓడించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బొర్రా గోపీమూర్తిని గెలిపించారు.
7.ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలకు సంబంధించిన ఎన్నికల్లో.. రాజకీయ పార్టీల జోక్యాన్ని కొంతమంది మధ్యతరగతి వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో కూడా రాజకీయ పార్టీలు చొరబడి, డబ్బులిచ్చి ఓట్లను కొనుగోలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పోరాటాల నుంచి, మధ్య తరగతివర్గాల నుంచి వచ్చే అభ్యర్థులు అవకాశం లేకుండా పోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
8. కోటీశ్వరుడికి మధ్యతరగతి వ్యక్తికి మధ్య పోటీ జరుగుతోందని డీవీ రాఘవులు వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ఆయనకు ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, పెన్షనర్ల, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలు మద్ధతు ఇచ్చాయి. తనకు మద్దతు ఇచ్చిన సంఘాలే తన బలమని పీడీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘవులు అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నిరుద్యోగ, విద్యార్థి, యువజన, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, వాలంటీర్లతో సహా.. వివిధ రంగాల్లో పని చేసే ఉద్యోగుల సమస్యలపై శాసనమండలిలో గలమెత్తుతానని అంటున్నారు.
9.అధికార కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులే తమకు బలమని టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలకు తాము అండగా ఉంటామని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తమకు అండగా ఉండాలని కోరుతున్నారు. మరోవైపు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు గెడ్డం విజయసుందర్ కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉంది.
10. మొత్తం 3,14,984 ఓట్లు ఉండగా.. అందులో 1,83,347 మంది పురుషులు. 1,31,618 మంది మహిళలు ఉన్నారు. 19 మంది ట్రాన్స్ జండర్స్ కూడా ఉన్నారు. మొత్తం 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఫిబ్రవరి 27 (గురువారం) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఓట్ల లెక్కింపు మార్చి 3 (సోమవారం) ఉంటుంది. పోలింగ్ ఆరు జిల్లాల్లో జరుగుతోంది. కాకినాడ, తూర్పు గోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇందులో ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోనే పోలింగ్ జరుగుతోంది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్