



Best Web Hosting Provider In India 2024
Badminton Asia Mixed Team: గోల్డ్ పై గురి.. సింధు లేకున్నా భారత్ పసిడి కొట్టేనా? చైనా జోరుకు బ్రేక్ వేస్తేనే టైటిల్
Badminton Asia Mixed Team: ప్రతిష్ఠాత్మక ఆసియా మిక్స్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీకి రంగం సిద్ధమైంది. గోల్డ్ పై గురి పెట్టిన భారత్ పీవీ సింధు లేకుండానే బరిలో దిగుతోంది. హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్- చిరాగ్, లక్ష్యసేన్ పై భారత్ ఆశలు పెట్టుకుంది.
ఆసియా మిక్స్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీకి మంగళవారం (ఫిబ్రవరి 11) తెరలేచింది. చైనా లోని కింగ్ దావోలో ఈ టోర్నీ ఆరంభమైంది. 12 దేశాలు పోటీపడుతున్న ఈ టోర్నీలో గోల్డ్ కొట్టడమే లక్ష్యంగా భారత్ రేసులోకి దిగుతోంది. కానీ స్టార్ షట్లర్ పీవీ సింధు గాయంతో దూరమవడం టోర్నీలో భారత అవకాశాలపై ప్రభావం చూపే అవకాశముంది. పురుషుల జట్టు బలంగానే కనిపిస్తున్నా.. మహిళల జట్టు మాత్రం వీక్ గా ఉంది.

12 జట్లు.. 4 గ్రూప్ లు
ఆసియా మిక్స్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో పోటీపడుతున్న 12 దేశాలను 4 గ్రూప్ లుగా విభజించారు. గ్రూప్- ఎలో చైనా, చైసీన్ తైపీ, సింగపూర్.. గ్రూప్-బిలో ఇండోనేసియా, మలేసియా, హాంకాంగ్.. గ్రూప్-సిలో జపాన్, కజకిస్థాన్, థాయ్ లాండ్.. గ్రూప్-డిలో దక్షిణ కొరియా, భారత్, మకావు ఉన్నాయి. గ్రూప్ దశలో ఒక్కో జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ లొ టాప్-2 టీమ్స్ క్వార్టర్స్ చేరతాయి.
మకావుతో భారత్ ఢీ
భారత్ తన తొలి మ్యాచ్ లో బుధవారం (ఫిబ్రవరి 12) మకావుతో తలపడుతుంది. గురువారం (ఫిబ్రవరి 13) కొరియాను ఢీకొడుతుంది. హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి లాంటి షట్లర్లు భారత పురుషుల జట్టులో ఉన్నారు. మహిళల జట్టులో మాళవిక బన్సోద్, తనీషా, ట్రీసా, అశ్విని పొన్నప్ప, గాయత్రీ గోపిచంద్ తదితరులున్నారు. ఒక్కో మ్యాచ్ లో పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ గేమ్స్ జరుగుతాయి.
అప్పుడు కాంస్యం
2017లో ప్రారంభమైన ఈ ఛాంపియన్ షిప్ లో భారత్ ఇప్పటివరకూ ఒక్క పతకమే గెలిచింది. రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో భారత్ 2023లో కాంస్యం గెలిచింది. ఈ టోర్నీలో బలమైన జట్టు చైనా గత రెండు సార్లు పసిడి పతకాలు సాధించింది. ఈ సారి భారత్ గోల్డ్ కొట్టాలంటే చైనా సవాలును దాటాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత ఫామ్ ప్రకారం భారత్ కు అది చాలా టఫ్ టెస్ట్ అని చెప్పొచ్చు.
Best Web Hosting Provider In India 2024
Source link