![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/meta_1738221588650_1739326588094.jpeg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/meta_1738221588650_1739326588094.jpeg)
Whatsapp Governance: 2.64లక్షల వాట్సాప్ లావాదేవీలు..రూ.54.73 లక్షల వసూళ్లు…అతి పెద్ద పేమెంట్ గేట్‌వేగా అవతరించే ఛాన్స్
Whatsapp Governance: ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ భాగస్వామ్యంతో అందిస్తోన్న పౌరసేవల్లో తక్కువ సమయంలో లక్షలాది లావాదేవీలు నమోదయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 2.64లక్షల లావాదేవీలు జరగ్గా రూ.54.73 లక్షల వసూళ్లు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో మెటా ఉచితంగా వాట్సాప్ ద్వారా మనమిత్ర సేవలు అందిస్తోంది.
Whatsapp Governance: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మనమిత్ర వాట్సాప్ సేవలు రికార్డు సమయంలో లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. జనవరి 30న ఏపీ ప్రభుత్వం వాట్సాప్ మనమిత్ర సేవల్ని ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వంతో గత ఏడాది అక్టో బర్‌లోనే మెటా ఒప్పందం చేసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖలు అందించే సేవల్ని మనమిత్ర ద్వారా నేరుగా వాట్సాప్‌లోనే అందిస్తోంది. ఇందుకోసం ఏపీలో ప్రత్యేక సర్వర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
వాట్సాప్ మనమిత్ర సేవల్ని ప్రారంభించిన రెండు వారాల్లోనే 2.64లక్షల లావాదేవీలు జరిగినట్టు ఆర్టీజీఎస్ సీఈఓ కార్యదర్శుల సమావేశంలో వెల్లడించారు. ఈ లావాదేవీల ద్వారా రూ.54.73లక్షలు వసూలైనట్టు చెప్పారు. భవిష్యత్తుల్లో ఈ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరుగుతాయి. ఏపీలో ఉన్న ఐదు కోట్ల కుటుంబాల ప్రతి సేవను వాట్సాప్‌లోనే పొందే అవకాశం ఉంటుంది. తద్వారా మెటాకు నిత్యం లక్షల సంఖ్యలో లావాదేవీలు జరిగే అవకాశం లభిస్తుంది. మెటా ట్రాన్సక్షన్ ట్రాఫిక్, పేమెంట్ గేట్‌వే చెల్లింపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లావాదేవీల ద్వారా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది.
161 రకాల సేవలు లభ్యం..
మొదటి విడతలో 161 సేవలు, రెండో విడతలో 360రకాల సేవల్ని వాట్సాప్‌లోనే అందిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. సర్టిఫికెట్ల మీద క్యూ ఆర్ కోడ్‌లతో జారీ చేస్తామని, వాటిని స్కాన్ చేస్తే వాటి వివరాలు ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం అవుతాయని, నకిలీ పత్రాలను సృష్టించే అవకాశం ఉండదని లోకేష్ వివరించారు. రెవిన్యూ, మునిసిపల్, ఎండోమెంట్ సేవల్ని వాట్సాప్‌లో అందిస్తామన్నారు. టీటీడీ మినహా అన్ని దేవాలయాల సేవల్ని వాట్సాప్‌లో అందిస్తారు.
తొలివిడతలో 161 రకాల సేవల్ని వాట్సాప్ మనమిత్ర ద్వారా నేరుగా ప్రజలకు అందిస్తారు. ఇందులో దేవాలయ సేవల బుకింగ్, ప్రజాఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం, ఏపీఎస్‌ఆర్టీసీ టిక్కెట్ల బుకింగ్, విద్యుత్ బిల్లుల చెల్లింపు, సిఎంఆర్‌ఎఫ్ సేవలు, రెవిన్యూ, హెల్త్, పోలీస్ శాఖల సేవలు ఉంటాయి. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో లబించే సేవల్ని వాట్సాప్‌లోనే బుక్ చేసుకోవచ్చు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్ ద్వారా చేసిన ఫిర్యాదుల స్థితిని మనమిత్ర వాట్సాప్ పేజీలో తెలుసుకోవచ్చు. ఏపీఎస్‌ఆర్టీసీ టిక్కెట్ల బుకింగ్, రద్దు సేవల్ని పొందవచ్చు.
ఏపీలోని మూడు టెలికం డిస్కమ్‌లకు సంబంధించిన విద్యుత్ బిల్లులలను చెల్లించవచ్చు. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తుల స్థితిని తెలుసుకోవచ్చు. సిడిఎంఏ సేవల్ని మనమిత్రలో పొందవచ్చు. రెవిన్యూ శాఖ ద్వాారా అందించే పలు రకాల సేవల్ని వాట్సాప్‌లోనే పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించిన సేవల్ని కూడా వాట్సాప్‌లోనే పొందవచ్చు. పోలీస్ శాఖ అందించే వివిధ రకాల సేవల్ని వాట్సాప్‌లోనే పొందవచ్చు.
ఇక ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన పనిలేదు…
రాబోయే రోజుల్లో ప్రజలెవ్వరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా, ప్రభుత్వ సేవలన్నీ కూడా వాట్సాప్‌లోనే అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అధికారులకు సూచించారు. ఈ దిశగా అన్ని శాఖలు తమ బ్యాక్ ఎండ్ మెకానిజం సమర్థవంతంగా ఉండేలా చూసుకోవాలన్నారు. మంత్రులు, కార్యదర్శుల సదస్సులో వాట్సాప్ గవర్నెన్స్‌పై ఇచ్చిన ప్రజెంటేషన్‌పైన సీఎం మాట్లాడుతూ అధికారులకు పలు మార్గదర్శకాలు చేశారు.
వాట్సాప్ గవర్నెన్స్‌లో ప్రస్తుతం ఇస్తున్న సేవల సంఖ్య పెంచాలన్నారు. ప్రస్తుతం 161 సేవలిస్తున్నామని, రాబోయే 45 రోజుల్లో 500 సేవలు కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని, అలాగే రాబోయే మూడు లేదా ఆరు నెలల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలు కూడా వాట్సాప్‌లోనే ప్రజలు పొందేలా యంత్రాంగం సన్నదం కావాలన్నారు.
ప్రజలు తమకు ప్రభుత్వం నుంచి ఏ పని కావాలన్నా కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరిగే పద్దతికి స్వప్తి పలికి, అసలు వాళ్లు ఏ కార్యాలయానికి రావాల్సిన అవసరమే లేకుండా కేవలం వాళ్ల చేతిలోని సెల్‌ఫోన్ ద్వారానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కావాల్సిన సేవలు పొందేలా చేయడమే తమ ఆశయమన్నారు. దీనికి అనుగుణంగా యంత్రాంగం సన్నద్ధమవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రయాణికులు ఆర్టీసీ బస్సు జీపీఎస్ ట్రాకింగ్ కూడా తమ వాట్సాప్‌లోనే చూసుకునే సదుపాయం కల్పించాలన్నారు.
వాట్సాప్ గవర్నెన్స్‌లోకి టీటీడీ
వాట్సాప్ గవర్నెన్స్‌లోకి టీటీడీ సేవలను కూడా తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారు. ఇవే కాకుండా అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి రైల్వే టికెట్లు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులు పొందే సదుపాయం కల్పిస్తామన్నారు. సినిమా టికెట్లు కూడా వాట్సాప్ ద్వారా పొందే సదుపాయం కల్పించే అంశం కూడా పరిశీలించాలన్నారు. కేవలం ఇవే కాకుండా ప్రభుత్వం పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే సేకరించాలన్నారు.
వాట్సాప్ గవర్నెన్స్‌ను మనం విస్తృతంగా అమలు చేస్తున్న ఈ తరుణంలో కొంతమంది కావాలని విమర్శలు చేసేవారుంటారని, ఎక్కడా ఎలాంటి లోపాలకు తావివ్వకుండా ప్రతి శాఖ కూడా సైబర్ సెక్యూరిటీ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఐటీ శాఖ దీనిపైన ప్రత్యేకంగా పనిచేయాలన్నారు. వాట్సాప్‌లో క్యూ ఆర్ కోడ్, లేదా పౌరుల ఆధార్ అథంటికేషన్ కోరే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
వాట్సాప్‌కు అనూహ్య స్పందన
వాట్సాప్ గవర్నెన్స్‌కు ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి కేవలం వారం రోజుల్లోపే 2,64,555 లావాదేవీలు జరిగాయి. ఇందులో 41 శాతం (1,10,761) ఆర్థిక లావాదేవీలు, 43.1 శాతం (1,14,119) సమాచారం కొరకు ఉపయోగించారు. ఈ వారం రోజుల్లోనే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ విభాగాలు, ఆయా సంస్థలు రూ.54.73 లక్షలు వసూలు అయ్యాయి.
అత్యధికంగా విద్యాశాఖలో 82,938 లావాదేవీలు జరిగాయి. వాట్సాప్‌లో 85 శాతం ట్రాన్సాక్షన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. 35 శాతం సర్వర్ స్పీడు సమస్య కారణంగా విఫలమయ్యాయని ఆయా శాఖలు తమ సర్వర్ స్పీడు పెంచుకోవాలని ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ కోరారు.
భారీగా పెరగనున్న మెటా లావాదేవీలు..
వాట్సాప్ ద్వారా అందిస్తున్న పౌర సేవల రూపంలో లక్షల సంఖ్యలో లావాదేవీలు నమోదు అవుతున్నాయి. వివిధ రకాల పౌరసేవలకు సంబంధించిన నగదు చెల్లింపులు కూడా అయా సంస్థల పేమెంట్ గేట్‌వేల నుంచి జరుగుతాయి. ప్రస్తుతం మన మిత్ర సేవల్ని వాట్సాప్ మాతృ సంస్థ మెటా ద్వారా జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పేమెంట్ గేట్‌వేల రూపంలో నిర్వహణ ఛార్జీలు, కన్వెయన్స్ ఫీజులు, నగదు నిల్వలతో పాటు పేమెంట్స్‌రూపంలో ట్రాన్సక్షన్స్ భవిష్యత్తులో గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో అందిస్తున్న సేవలు పూర్తి ఉచితమని మెటా ప్రకటించింది. పౌర సేవల కోసం నగదు చెల్లింపులు విషయంలో వసూలు చేసే ఫీజులు, ఛార్జీలపై స్పష్టత రావాల్సి ఉంది.
సంబంధిత కథనం
టాపిక్