Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/gvmc.jpg)
విశాఖలో చిరు వ్యాపారుల పొట్టకొట్టిన జీవీఎంసీ అధికారులు
వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఇల్లు ధ్వంసం
విశాఖ: వందేళ్ల చరిత్ర కలిగిన పూర్ణామార్కెట్‌ను నమ్ముకుని చిరు వ్యాపారులు రోడ్డు పక్కన అమ్మకాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఆశీలు వసూళ్ల విషయంలో కొన్ని రోజులుగా వ్యాపారులతో తగదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం ముదిరి, చివరకు చిరు వ్యాపారులపై కక్ష సాధింపు చర్యలకు దారితీసింది. అధికారం ఉంది కదా అని కూటమి నేతలు అధికారులను పేద వ్యాపారులపై ఉసికొల్పి.. వారి పొట్టకొట్టారు. మొదటి రోజు పూర్ణామార్కెట్ పరిసరాల్లోని ఆక్రమణలు తొలగిస్తుండటంతో.. ప్రజలు, వ్యాపారులు సాధారణ ఆక్రమణల తొలగింపుగానే భావించారు. కానీ రెండో రోజు కూడా అధికార యంత్రాంగం బౌడారా రోడ్డు నుంచి రామకృష్ణ జంక్షన్ వరకు ఆక్రమణల పేరుతో వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసింది. కూటమి నేతల తీరుతో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రశ్నిస్తే ఆస్తులు ధ్వంసమా?
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు తెర లేపింది. అన్ని అనుమతులు తీసుకుని నాలుగేళ్ల క్రితం పూర్ణా మార్కెట్‌లో ఇల్లు నిర్మించుకున్నారు. ఇటీవల ప్రభుత్వ వైఫల్యాలను రాజీవ్ గాంధీ ప్రశ్నిస్తుండటంతో కక్షగట్టిన అధికార పార్టీ నేతలు జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆక్రమణల పేరుతో ఇంటి ముందు ఉన్న మెట్లు, గ్రీల్స్, రెయిలింగ్స్‌ను ధ్వంసం చేయించారు.
వైన్ షాపులకు నిబంధనలు వర్తించవా?
బౌడారా రోడ్డులో రెండో రోజు ఆక్రమణల తొలగింపు పేరుతో దుకాణాల ముందున్న సిమెంట్ ర్యాంపులు, కొన్ని చోట్ల ఇనుప గ్రిల్స్‌ను అధికారులు తొలగించారు. ఎండ నుంచి రక్షణ కోసం దుకాణాల ముందు చేసుకున్న ఏర్పాట్లను సైతం తీసివేశారు. కానీ ఇదే రోడ్డులో ఉన్న వైన్ షాపుల వద్ద ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్‌ను మాత్రం పోలీసులు, జీవీఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
కక్ష సాధింపు బాధాకరం: వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కొండా రాజీవ్‌గాంధీ
పూర్ణామార్కెట్‌లో అనేక భవనాలు ఉన్నప్పటికీ కేవలం కక్ష పూరితంగా కొన్ని భవనాలకు చెందిన మెట్లను తొలగించారు. రెయిలింగ్ ధ్వంసం చేసి వాటర్ ట్యాంక్‌లు తీయించారు. చిరు వ్యాపారులపై ఒకలా.. వైన్ షాపులు ఉన్న దగ్గర మరో విధంగా వ్యవహరించారు. వన్‌టౌన్ ప్రదాన రహదారిలో ఆక్రమణలు ఉన్నాయి. వాటిని వదిలి చిరు వ్యాపారులపై కక్ష సాధింపు చర్యలకు దిగి దుకాణాలు తొలగించడం సమంజసం కాదు.