Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Chiranjeevi_on_Legacy_1739345306182_1739345311308.jpg)
Chiranjeevi: చిరంజీవి ‘వారసత్వం’ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో విమర్శలు.. ఏమన్నారంటే..
Chiranjeevi Comments: బ్రహ్మా ఆనందం ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. వారసత్వం గురించి ఆయనపై విమర్శలు వస్తున్నాయి. చిరూ ఏమన్నారంటే..
బ్రహ్మా ఆనందం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ కామెడీ డ్రామా మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ తరుణంలో నిర్వహించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో చిరంజీవి మాట్లాడారు. అయితే, ఈ ఈవెంట్‍లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి. ఆ వివరాలు ఇవే..
చిరూ ఏమన్నారంటే..
రామ్‍చరణ్ కూతురు క్లీంకార ఫొటోను ఈ ఈవెంట్‍లో చిరంజీవికి చూపించారు యాంకర్ సుమ. ఇతర మనవాళ్లతో చిరూ కలిసి ఉన్న ఫొటోను స్క్రీన్‍పై ప్రదర్శించారు. దీంతో చిరంజీవి స్పందించారు. ఇంట్లో ఉన్నప్పుడల్లా తనకు మనవరాళ్లతో ఉన్నట్టు ఉండదని, లేడీస్ హాస్టల్‍లో ఉన్నట్టు ఉంటుందని చిరంజీవి అన్నారు.
చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగపిల్లాడు కూడా లేడు అని చిరంజీవి అన్నారు. వారసత్వం కోసం మగపిల్లాడిని కనాలని రామ్‍చరణ్‍కు సలహా ఇచ్చానని చెప్పారు. “చరణ్ ఈసారికైనా సరే ఓ అబ్బాయిని కనరా.. మన వారసత్వం కనరా అని కోరిక. ఈ అమ్మాయి అంటే చాలా ముద్దు. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని నా భయం” అని చిరంజీవి అన్నారు. చిరంజీవి ఇద్దరు కూతుళ్లకు కూడా చెరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కొడుకు రామ్‍చరణ్‍కు ఓ కూతురు. మొత్తంగా చిరూకు ప్రస్తుతం ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు.
తీవ్రమవుతున్న విమర్శలు
వారసత్వం కోసం అబ్బాయిని కనాలని రామ్‍చరణ్‍కు చెప్పానని చిరంజీవి చేసిన వ్యాఖ్య దుమారంగా మారింది. ఇంకో ఆడబిడ్డని కంటాడేమోని భయం అన్న మాటపై విమర్శలు వస్తున్నాయి. ఈ కాలంలో కూడా మగపిల్లలే వారసులు అని చిరంజీవి స్థాయి లాంటి వ్యక్తి అనడం సరి కాదని, ఆడపిల్లలు వారసులు కాదా అని సోషల్ మీడియాలో చాలా మంది విమర్శలు కురిపిస్తున్నారు.
జాతీయ స్థాయిలోనూ చిరంజీవి వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. కొన్ని జాతీయ మీడియా సంస్థల్లోనూ ఈ కామెంట్లపై ఫోకస్ పెరిగింది. పలువురు చిరూ వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. చిరంజీవి సరదాగానే ఆ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తున్నా.. స్పందన మాత్రం తీవ్రంగా వస్తోంది. ముఖ్యంగా ఆడపిల్లలు వారసులు కాలేరన్నట్టుగా చిరూ చెప్పిన విషయంపై ఎక్కువ దుమారం రేగుతోంది. మరి ఈ వివాదం చల్లారుతుందో.. ఎక్కువవుతుందో చూడాలి. చిరంజీవి ఏమైనా వివరణ ఇస్తారా అనేది కూడా ఆసక్తికరంగా ఉంది.
మా తాత రసికుడు అంటూ..
ఇదే ఈవెంట్లో తన తాత గురించి గురించి కూడా చిరంజీవి కొన్ని విషయాలు చెప్పారు. తన తాత రాధాకృష్ణ నాయుడుకు ఇద్దరు భార్యలు ఉండేవారని, మరో మహిళతోనూ సంబంధం ఉందంటూ చిరూ చెప్పుకొచ్చారు. ఆయన రసికుడు అని చెప్పారు. ఆయన బుద్ధులు రాకూడదని తనతో ఇంట్లో వాళ్లు చెప్పారని చిరంజీవి వివరించారు. దీనిపై కూడా అసంతృప్తి రేగుతోంది. అలాగే, బ్రహ్మానందం మీమ్స్ గురించి స్పందిస్తూ నోరు జారి ఓ అభ్యంతరకర పదం కూడా ఇదే ఈవెంట్లో వాడారు చిరూ. దీంతో ఆయనపై ట్రోలింగ్ కూడా జరుగుతోంది.
తాను జీవితంలో మళ్లీ రాజకీయాల్లోకి రానని కూడా ఇదే ఈవెంట్లో స్పష్టం చేశారు చిరంజీవి. తన లక్ష్యాలను నేరవెర్చేందుకు తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారని చెప్పారు. అలాగే, బ్రహ్మానందంపై కూడా ప్రశంసలు కురిపించారు చిరూ.
సంబంధిత కథనం