![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
TG MLC Elections 2025 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ‘బీఆర్ఎస్’ – ఎందుకిలా…?
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుండగా… ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంటోంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న కారు పార్టీ… ప్రస్తుతం పోటీకి ఎందుకు దూరంగా ఉంటోందన్న చర్చ జోరుగా జరుగుతోంది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఉత్తర తెలంగాణ పరిధిలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి… దూకుడుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మరోవైపు బీజేపీ సైతం అంజిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం అందరికంటే ముందే బీజేపీ అభ్యర్థిని ప్రకటించి… ప్రచారాన్ని కూడా షురూ చేసింది. ఈ ఎన్నికల్లో తమదే విజయమని చెబుతోంది. అయితే కాంగ్రెస్ నుంచి ఒక్కరిద్దరూ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ…. చివరగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావటంతో నరేందర్ రెడ్డి… ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం సాధించి… కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇస్తానని చెబుతున్నారు. పార్టీ అధినాయకత్వం కూడా… గ్రాడ్యుయేట్ స్థానాన్ని గెలుచుకుని సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని పావులు కదుపుతోంది.
దూరంగా బీఆర్ఎస్…!
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా… ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం దూరంగా ఉంటోంది. ఇప్పుడిదే రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంలో బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ…. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రశ్నలు కూడా సంధిస్తున్నాయి.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. గ్రాడ్యుయేట్లు ఓటు వేసే ఈ ఎన్నికల్లో… బీఆర్ఎస్ దూరంగా ఉండటంపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన నల్గొండ- ఖమ్మం- వరంగల్ గ్రాడ్యుయేట్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పోటీ చేసింది. రాకేశ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి… భారీ స్థాయిలోనే ప్రచారం చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. అధికారంలో ఉండగా జరిగిన… రంగారెడ్డి – మహబూబ్ నగర్ – హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికలోనూ బీఆర్ఎస్ పోటీ చేసి విజయం కూడా సాధించింది.
నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు కూడా ఉత్తర తెలంగాణపై బీఆర్ఎస్ ఎప్పుడూ ఫోకస్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ జరిగిన అనేక ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని కూడా ప్రదర్శిస్తూ వచ్చింది. అలాంటి బీఆర్ఎస్…. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటంపై అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ బలంగా చెబుతోంది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులనే కాదు… ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిందని ఆరోపిస్తోంది. నియోజకవర్గాల్లో భారీ సభలను నిర్వహిస్తూ… ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ ధీమాను కూడా వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ తీరుపై దూకుడుగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్…. కీలకమైన పట్టభద్రుల ఎన్నికల విషయంలో మాత్రం వెనకడుగు వేయటం చర్చనీయాంశంగా మారింది. నిజంగానే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే.. పోటీ చేసి గెలవొచ్చు కదా అంటూ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ నేతలు సవాల్ విసురుతున్నారు.
బీజేపీ అభ్యర్థి విజయం కోసమే బీఆర్ఎస్ పోటీ చేయటం లేదనే వాదనను కూడా హస్తం నేతలు వినిపిస్తున్నాయి. కట్ చేస్తే… కాంగ్రెస్ విజయం కోసం బీఆర్ఎస్ పోటీ చేయటం లేదంటూ బీజేపీ నేతలు కూడా కార్నర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయటం లేదనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ వాదన ఏంటంటే..?
ఈ ఎన్నికల్లో పోటీపై బీఆర్ఎస్ వాదన మరోలా ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందటంతో ఓటరు నమోదు కార్యక్రమంలో తాము పాల్గొనలేదన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందం లేదని చెబుతోంది. ఆ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ…. తాము ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదని…. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పోటీ చేయకపోవటం ఇది తొలిసారి కాదని… గతంలో కూడా పోటీ చేయని సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.
మొత్తంగా ఉత్తర తెలంగాణ వేదికగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవటం అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. వీటిని కారు పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నప్పటికీ…. కాంగ్రెస్, బీజేపీ నుంచి మాత్రం ప్రశ్నలు ఆగేలా లేదు..!
సంబంధిత కథనం
టాపిక్