



Best Web Hosting Provider In India 2024

TG Mlc Election : ఎమ్మెల్సీ పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టిన అధికారులు-పీవోలు, ఏపీవోలకు శిక్షణ
TG Mlc Election : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 27న జరగనున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లపై పీఓలు ఏపీవోలకు శిక్షణ ఇస్తున్నారు.
TG Mlc Election : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈనెల 27న జరగనున్న కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు తగిన ఏర్పాట్లతో పాటు పీఓలు ఏపీవోలకు శిక్షణ ఇస్తున్నారు. ఎలాంటి పొరపాటు లేకుండా ఎన్నికలు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఓవైపు రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తే, అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసి బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరో తేలారు. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానానికి 56 మంది టీచర్ల స్థానానికి 15 మంది పోటీ చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థులకు సీరియల్ నంబర్స్ కేటాయించి పోలింగ్ కేంద్రాలు పోలింగ్ సంబంధించిన సరంజామాను సమకూర్చుకునే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు.
మహాశివరాత్రి తెల్లారే పోలింగ్
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మహాశివరాత్రి మరుసటి రోజు ఈనెల 27న జరుగుతుండడంతో అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 27న జరిగే పోలింగ్ కోసం కరీంనగర్ కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి కరీంనగర్ లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వాణీనికేతన్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ధన్గర్వాడి ఉన్నత పాఠశాల, గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.
పాఠశాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోయే గదులను, అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోలను ఆదేశించారు.
జగిత్యాలలో పీఓలు, ఏపీఓలకు కలెక్టర్ శిక్షణ తరగతులు
నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో జరిగే పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని నోడల్ అధికారులకు జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. జిల్లాలోని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలకు కలెక్టరేట్ మొదటి విడత శిక్షణ తరగతులను నిర్వహించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే, శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందని తెలిపారు. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఓటింగ్ నిర్వహణకు కొంత ఎక్కువ వ్యవధి పట్టే అవకాశాలు ఉన్నందున ఓపిగ్గా, సంయమనంతో వ్యవహరిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.
విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావిస్తూ తప్పిదాలకు పాల్పడే కఠిన చర్యలు తప్పవని జగిత్యాల కలెక్టర్ హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలలోనికి సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్ రోజు బ్యాలెట్ బాక్సులు తీసుకొని, పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కరీంనగర్ లోని రిసెప్షన్ సెంటర్ లో అప్పగించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను పీఓలు తమ పర్యవేక్షణలో ఉంచాలని జాగ్రత్తలు సూచించారు.
ఓటర్లు, అభ్యర్థుల ఏజెంట్లు వివిధ అంశాలపై సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పీఓలదేనని స్పష్టం చేశారు. పోలింగ్ అనంతరం పక్కాగా రికార్డు బుక్కులలో వివరాలను పొందుపరుస్తూ నివేదిక తయారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పీఓలు, ఏపీఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వర్తించాల్సిన బాధ్యతలపై మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
బ్యాలెట్ పేపర్లో ఆల్ఫోర్స్ పేరు అభ్యంతరం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేరు ముందు ఆల్ఫోర్స్ అని బ్యాలెట్ పేపర్ లో ముద్రించడం పట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సర్దార్ రవీందర్ సింగ్ అభ్యంతరం తెలిపారు. బ్యాలెట్ లో ఆల్పోర్స్ అని రావడంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని రవీందర్ సింగ్ కోర్టును ఆశ్రయించి న్యాయం పోరాటం చేస్తానని ప్రకటించారు. నామినేషన్ సందర్బంగా కాంగ్రెస్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడిందని రవిందర్ సింగ్ ఇది వరకే కోర్టును ఆశ్రయించారు.
రిపోర్టింగ్ : కె.వి.రెఢ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్