



Best Web Hosting Provider In India 2024

Traffic Diversions : సూర్యాపేట పెద్దగట్టు జాతర, హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల మళ్లింపు
Traffic Diversions : తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు ఉత్సవాలను ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జారత సందర్భంగా విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు చేసినట్లు సూర్యాపేట ఎస్పీ ప్రకటించారు.
Traffic Diversions : తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర దురాజుపల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం జాతీయ రహదారి 65పై వాహనాలను మళ్లిస్తున్నట్లు సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జాతర జరిగే ప్రదేశం సూర్యాపేట పట్టణానికి 3 కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి ఎన్.హెచ్ 65 పై ఉంటుంది కావున వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ నెల 16వ తేదీ తెల్లవారుజాము నుంచి ఆంక్షలు విధించనున్నారు.
జాతీయరహదారి 65పై వాహన మళ్లింపు ఇలా
- నార్కట్ పల్లి వద్ద- హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి వద్ద మళ్లించి నల్గొండ వైపుగా మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా విజయవాడ కు మళ్లిస్తారు.
- కోదాడ వద్ద –విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను, కోదాడ వద్ద మళ్లించి హుజూర్ నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా హైదరాబాద్ కు మళ్లిస్తారు.
పెద్ద గట్టు జాతర
పెద్దగట్టు తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచింది. దీన్నే ‘గొల్లగట్టు’ జాతర అని కూడా అంటారు. ఈ అతిపెద్ద జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. యాదవుల కులదైవం పెద్దగట్టు లింగమంతులస్వామి ఇక్కడ పూజలందుకుంటారు. ఈ నెల 16వ తేదీ నుంచి జాతర ప్రారంభమై ఫిబ్రవరి 20వ తేదీతో ముగియనుంది. పెద్దగట్టు జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ ఇటీవలే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టేలా కార్యాచరణను సిద్ధం చేసింది.
పెద్దగట్టు జాతర – ముఖ్యమైన విషయాలు:
- సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని దురాజ్‌పల్లి లింగమంతులస్వామి పెద్దగట్టు జాతర జరుగుతుంది.
- మేడారం సమ్మక్క – సారక్క జాతర మాదిరిగానే ప్రతి రెండేళ్లకోసారి ఇక్కడ జాతరను నిర్వహిస్తారు. తెలంగాణలో మేడారం తర్వాత అతిపెద్ద రెండో జాతరగా పెద్దగట్టుకు పేరుంది.
- పెద్దగట్టు జాతరనే గొల్లగట్టు జాతర అని కూడా పిలుస్తారు. యాదవుల కులదైవం పెద్దగట్టు లింగమంతులస్వామి ఇక్కడ పూజలందుకుంటారు. చౌడమ్మ దేవతలు కొలువుదీరుతారు.
- ఈ ఏడాదిలో జాతర జరగనుంది. ఇందుకు సంబంధించి తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 16వ తేదీన జాతర ప్రారంభమై… ఫిబ్రవరి 20వ తేదీతో ముగుస్తుంది.
- ఈ జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు మధుమాసం, అమావాస్య ఆదివారం రాత్రి దిష్టికుంభాలు పోయడం చేస్తారు. దిష్టి పూజ చేయడం ఆనవాయితీ. ఆ తర్వాతే జాతర పనులను ప్రారంభిస్తారు.
- జాతరలో తొలి అంకమైన దిష్టిపూజను ఫిబ్రవరి 2వ తేదీనే పూర్తి చేశారు. బోనంతో బలిముద్దను తయారు చేసి పరిసరాల్లో ఎలాంటి అపశకనాలు జరగకుండా సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తారు.
- జాతరకు పది రోజుల ముందుగానే కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు. లింగమంతులస్వామి, చౌడమ్మ దేవత, అనేక ఇతర విగ్రహాలను కలిగి ఉండే ‘దేవరపెట్టె’ జాతరలో కీలకమైన వేడుకగా భావిస్తారు.
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయిపాలెం గ్రామం నుంచి ఈ దేవరెపెట్టే వస్తుంది. ఆ తర్వాత కేసారం గ్రామంలోని ఓ ఇంటికి చేరుతుంది. జాతర తొలిరోజు తెల్లవారుజమున ఊరేగింపుగా ఈ దేవరపెట్టెను ఆలయానికి తీసుకవస్తారు.
- రెండేళ్లకోసారి జరిగే ఈ పెద్దగట్టు జాతరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.
- ఈసారి జరగబోయే జాతరకు పది లక్షలమందికిపైగా వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మౌలిక వసతులు,విద్యుత్ సౌకర్యం, తాగునీరు తదితర ఏర్పాట్లకు నిధులు వినియోగించనున్నారు.
- తెలంగాణలో రెండో అతి పెద్ద జాతర గా పేరొందిన సూర్యాపేట దురాజుపల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి- పెద్దగట్టు జాతర నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలులో ఉంటాయి.
సంబంధిత కథనం
టాపిక్