



Best Web Hosting Provider In India 2024

Bird Flu Effect : తెలుగు రాష్ట్రాలపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్- తగ్గిన చికెన్ ధరలు, కొండెక్కిన మటన్ రేటు
Bird Flu Effect : తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ తో లక్షల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చికెన్, గుడ్లు తినొచ్చని ప్రభుత్వం భరోసా ఇస్తున్నా జనం వాటికి కాస్త దూరంగా ఉంటున్నారు. మటన్, చేపల ధరలు కొండెక్కాయి.
Bird Flu Effect : తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ దెబ్బకు పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలుగా కోళ్లు మృతి చెందుతున్నాయి. ఒక్క ఏపీలోనే బర్డ్ ఫ్లూ వైరస్ సోకి ఐదున్నర లక్షల కోళ్లు చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలోనూ వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. కోళ్ల మృత్యువాతతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు, బ్యాంకులో రుణాలు తెచ్చి పెట్టుబడి పెట్టామని, వైరస్ తో కోళ్లు మొత్తం చనిపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమపై అప్పుల భారం పడిందని వాపోతున్నారు. తీవ్రంగా నష్టపోయినా పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
చికెన్ ధరలపై ప్రభావం
బర్డ్ ఫ్లూ ఆందోళనతో ఏపీ, తెలంగాణ ప్రజలు చికెన్, గుడ్లకు దూరంగా ఉంటున్నారు. బర్డ్ ఫ్లూ కేసులు వచ్చిన మండలాల్లో అధికారులు నిషేధం విధిస్తున్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే పౌల్ట్రీ వాహనాలను తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిలిపివేస్తుంది. చనిపోయిన కోళ్లను ఎక్కడికక్కడ పడేయకుండా సురక్షితంగా పూడ్చివేయాలని అధికారులు సూచించారు.
చికెన్ మార్కెట్‌పై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడింది. ఆదివారం అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. బర్డ్ ప్లూ భయంతో జనం చికెన్ కు దూరంగా ఉంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో చికెన్ ధర కేజీ రూ.150 ఉంది. గత 15 రోజులుగా కేజీ చికెన్ ధర రూ.220 నుంచి…రూ.180-150కు ధర పడిపోయింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్‌కు వచ్చే కోళ్ల సంఖ్య భారీగా తగ్గింది.
భారీగా పెరిగిన మటన్ ధరలు
బర్డ్ ప్లూ భయంతో చికెన్ కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. చికెన్ తినవచ్చని ప్రభుత్వం చెబుతున్నా…ప్రజల్లో మాత్రం భయం వీడటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో మాంస ప్రియులు చేపలు, రొయ్యలు, మటన్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో చేపల, మటన్ మార్కెట్లో రద్దీ నెలకొంది. రూ.800 ఉన్న కిలో మటన్ ఏకంగా నేడు రూ. 1000 వరకు ధర పలుకుతుంది. మటన్ షాపుల వద్ద జనం క్యూ కట్టారు. హైదరాబాద్ లో మటన్ మార్కెట్ వద్ద భారీగా జనాలు కనిపించారు.
జోరందుకున్న చేపలు, మటన్ అమ్మకాలు
చేపలు, మటన్ అమ్మకాలు జోరందుకుననాయి. దీంతో చేపల రేట్లు ఒక్కసారిగా పెంచి అందినకాడికి స్వాహా చేస్తున్నారు. గతంలో కిలో మటన్ ధర రూ.700 నుంచి 800కు అమ్మేవారు. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.200 వరకు ధరలు పెంచి అమ్ముతున్నారు. రూ.150 నుంచి 160కు వచ్చే కిలో చేపలను ఏకంగా రూ.200లకు అమ్ముతున్నారు. అందుబాటు ధరల్లో ఉండే కోడికి రోగం రావడంతో…జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్