


Best Web Hosting Provider In India 2024
South Central Railway : రైళ్లు ఆలస్యం.. ప్రయాణికులకు నరకం.. కారణాలు, పరిష్కారాలు ఏంటి?
South Central Railway : సికింద్రాబాద్- విజయవాడ, కాజీపేట- బల్లార్ష మార్గాల్లో రైళ్లు నిత్యం ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు నరకం చూస్తున్నారు. రైలు ఎప్పుడు వస్తుందో.. ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు, పరిష్కారాలు ఏంటో ఓసారి చూద్దాం.
దక్షిమ మధ్య రైల్వే పరిధిలో ముఖ్యమైన రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వరంగల్- విజయవాడ, కాజీపేట- బల్లార్ష మార్గాల్లో పలు రైళ్లు నిత్యం ఆలస్యంగా నడుస్తున్నాయి. బల్లార్ష నుంచి రామగుండం, మంచిర్యాల, ఉప్పల్ రైల్వే స్టేషన్ల నుంచి కాజీపేటకు వచ్చే భాగ్యనగర్, ఇంటర్‌సిటీ, కాగజ్‌నగర్ రైళ్లు రోజూ సగటున గంట నుంచి 2 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
కాజీపేట- బల్లార్ష మార్గంలో..
కాజీపేట- బల్లార్ష మార్గంలో.. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, కొలనూరు, ఓదెల రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో వరంగల్‌కు వస్తుంటారు. రోడ్డు ద్వారా వస్తే సమయం ఎక్కువ పడుతుంది. దూరం కూడా ఎక్కువ. దీంతో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించడానికి మొగ్గుచూపుతారు. కానీ.. రైళ్లు ఆలస్యంగా నడవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికుల ఆవేదన..
వృత్తిరీత్యా రోజూ అప్ అండ్ డౌన్ చేసేవారు ఉంటారు. ప్రతి రోజు రైళ్లు ఆలస్యం కావడం వల్ల వాటిపై నమ్మకం పోతోందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైలు ప్రయాణానికి దూరమై.. సొంత వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. సొంత వాహనాలు లేనివారు రైళ్ల కోసం నిరీక్షిస్తున్నారు. అటు విద్యార్థులను కూడా రైళ్ల ఆలస్యం సమస్య వేధిస్తోంది. రైళ్ల ఆలస్యం వల్ల క్లాసులకు లేటుగా వెళ్తున్నారు. కొన్నిసార్లు పరీక్షలు కూడా రాయలేక పోతున్నామని స్టూడెంట్స్ చెబుతున్నారు.
కారణాలు ఏంటి..
గతంలో దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ ఫాస్ట్ రైళ్లను పంపడానికి.. మిగతా రైళ్లను ఆపేవారు. ఈ సమస్య తీర్చడానికి మూడోలైను వేస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. ఇటు సికింద్రాబాద్- కాజీపేట మార్గంలో రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి. వరంగల్- విజయవాడ మార్గంలో మూడోలైను నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. కొన్ని స్టేషన్లలో మూడోలైను నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
పరిష్కారం ఇలా..
రైళ్ల ఆలస్యం తగ్గించాలంటే.. సిగ్నలింగ్ పనులు పూర్తికాని చోట సిబ్బందిని నియమించాలని నిపునులు సూచిస్తున్నారు. రైళ్లను గంటకు 90 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడపాలని చెబుతున్నారు. రైళ్ల ఆలస్యాన్ని సెకన్లలో కూడా లెక్కించాలని.. స్టేషన్లలో రైలు వేగంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేస్తున్నారు. రైలు పట్టాలపై ఆత్మహత్యలు జరగకుండా, అనుమతి లేనిచోట మనుషులు, పశువులు పట్టాలు దాటకుండా చూసే వ్యవస్థలు ఏర్పాటు చేయాలని చెబుతున్నారు.
టాపిక్