


Best Web Hosting Provider In India 2024
Anantapur : వీడియోలు తీస్తున్నారని.. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థినులు ఆందోళన!
Anantapur : అనంతపురం సెంట్రల్ యూనిర్శిటీలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బాత్‌రూమ్‌లోకి కొందరు తొంగిచూస్తూ.. వీడియోలు తీస్తున్నారని ఆరోపణలు చేశారు. అర్థరాత్రి వరకు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వీసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో సెంట్రల్ యూనివర్శిటీ ఉంది. ఇక్కడ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో.. ఉమెన్స్ హాస్టల్ బాత్‌రూమ్‌ల్లోకి ఒకరు తొంగిచూస్తూ.. వీడియో తీస్తున్నట్లు నీడ కనబడిందని విద్యార్థినులు చెబున్నారు. అప్రమత్తమైన విద్యార్థిని కేకలు వేయడంతో అగంతకుడు పారిపోయాడు. ఇదే మొదటి సారి కాదని, గతంలో కూడా ఇలానే జరిగిందని విద్యార్థినులు చెబుతున్నారు.
గతంలోనూ..
గతేడాది డిసెంబర్ 9వ తేదీన అర్ధరాత్రి కూడా కొందరు యువకులు అమ్మాయిల బాత్‌రూమ్‌ల వైపు తొంగి చూసేందుకు ప్రయత్నించారని చెప్పారు. అప్పుడు కూడా విద్యార్థినులు గట్టిగా కేకలు వేయడంతో ఆ యువకులు పారిపోయారని అంటున్నారు. భయంత వణికిపోయి డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశామని.. అప్పట్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు యూనివర్శిటీకి వచ్చి విచారణ చేశారని విద్యార్థినులు గుర్తు చేశారు.
వీసీకి ఫిర్యాదు చేసినా..
ఈ ఘటనలో అనుమానితులైన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారని.. తాజాగా అదే ఘటన పునరావృతం అయిందని అంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా బిక్కుబిక్కుమంటూ గడపాలని ప్రశ్నిస్తున్నారు విద్యార్థినులు. వీసీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వాపోయారు. తమకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్రిక్త పరిస్థితి..
ఆదివారం సాయంత్రం విద్యార్థునులు తమ హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. వీరికి ఇతర విద్యార్థులు మద్దతుగా నిలిచారు. ఆందోళనను యూనివర్శిటీ ప్రధాన గేట్ వద్దకు మార్చారు. అర్థరాత్రి 12 గంటలైనా కొనసాగించారు. సుమారు వెయి మంది విద్యార్థినులు ఆందోళనకు దిగి.. వర్శిటీ అధికారులకు వ్యతిరేకంగా చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అధికారుల హామీతో..
విద్యార్థినుల ఆందోళన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. యూనివర్శిటీకి చేరుకున్నారు. విద్యార్థినులతో చర్చలు జరిపారు. యూనివర్శిటీ డీన్, ఇతర అధికారులు ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో చర్చలు జరిపారు. సోమవారం సమావేశం ఏర్పాటు చేస్తామని.. ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ముందు సమావేశం ఏర్పాటు చేసుకుని.. చర్చించి అప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పగా.. విద్యార్థినులు అంగీకరించారు. రాత్రి 12 గంటల తరువాత ఆందోళన విరమించి హాస్టల్స్‌కు వెళ్లారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్