ఇదే రిపీట్ .. టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలి 

Best Web Hosting Provider In India 2024

చంద్రబాబు విధానాలతోనే ఆయనకు గుణపాఠం నేర్పుతాం

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు వార్నింగ్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు

వైయస్ఆర్‌సీపీ సభ్యులను భయపెట్టి తమవైపు తిప్పుకుంటున్నారు 

కక్కిన కూటి కోసం ఆశపడే దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు 

ప్రెస్‌మీట్‌లో టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఫైర్‌

తాడేపల్లి: మున్సిపాలిటీ ఎన్నికల్లో వైస్‌ చైర్మన్‌ స్థానం కోసం అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసి వైయస్ఆర్‌సీపీ సభ్యులపై దాడులు, దౌర్జన్యాలతో తమ వైపునకు తిప్పుకుంటోదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆక్షేపించారు. భవిష్యత్తులో ఇదే రిపీట్‌ అవుతుందన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని, చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలతోనే రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. సంఖ్యా బలం లేకపోయినా కక్కిన కూటి కోసం ఆశపడి వైయస్ఆర్‌సీపీ సభ్యులతో గెలిచినంత మాత్రాన చంద్రబాబు సాధించేది ఏమీ ఉండదని స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.  

యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన:
– టీడీపీ నాయకులు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేశారు. బలం లేకపోయినా దాడులు, దౌర్జన్యాలతో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవులు పొందడానికి చేయని అరాచకం లేదు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ  వైయస్ఆర్‌సీపీ నేతలను, కార్యకర్తలను టార్గెట్‌ చేసి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు.
– కక్కిన కూటికి ఆశపడే దౌర్భాగ్యం పట్టింది టీడీపీకి. పక్క పార్టీ సభ్యులను లాక్కుని గెలవాల్సిన దుస్థితికి అధికార పార్టీ దిగజారిపోయింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నియంత పాలన చేస్తున్నారు. బ్రిటిష్‌ పాలనలో కూడా ఇంత దారుణాలు జరిగి ఉండవు. 
– వైయస్ఆర్‌సీపీ సభ్యులను తనవైపు తిప్పుకుని సంఖ్యా బలం చూపించి ఉండొచ్చు గాక.. ఇది చంద్రబాబుకి తాత్కాలికమైన సంతోషాన్ని కలిగిస్తుండవచ్చు కానీ, ప్రజాస్వామ్య విజయం మాత్రం కాదు. ఇది చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా నిలుస్తుంది. 

ఏ మున్సిపాలిటీలో ఏం జరిగింది?:
– పాలకొండలో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 20 మంది సభ్యులుండగా ఒకరు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. మిగతా 19 స్థానాల్లో 13 స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ గెలుపొందగా 6 చోట్ల టీడీపీ గెలిచింది. 
– అక్కడ ఎన్నికలు వాయిదా చేయడానికి రెండుసార్లు దౌర్జన్యాలు చేసింది. వైయస్సార్సీపీ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. కానీ వైయస్ఆర్‌సీపీ వ్యూహాత్మకంగా కోరం లేకుండా చేసి ఎన్నికలను బహిష్కరించడం జరిగింది.

– తుని మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాలు ఉండగా అన్నింటా వైయస్ఆర్‌సీపీ విజయం సాధించింది. టీడీపీకి ఒక్క స్థానం కూడా లేకపోయినా ఎలాగైనా మున్సిపాలిటీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఇప్పటికే రెండుసార్లు విఫలయత్నం చేసింది.
– ఒక్క స్థానం లేకపోయినా వైస్‌ ఛైర్మన్‌ పదవి కైవసం చేసుకోవడానికి టీడీపీ చేయని అక్రమాలు లేవు. 
– ఫిబ్రవరి 3న ఎన్నికలు జరగాల్సి ఉన్నా, కౌన్సిలర్ల ఇళ్లపై దాడులు చేయడం, అక్రమంగా జైలు పాలు చేయడం, కౌన్సిలర్లను, వారి భర్తలను కిడ్నాప్‌ చేసి ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారు. మరుసటి రోజు ఫిబ్రవరి 4న కూడా అదే విధంగా దౌర్జన్యాలను కొనసాగించారు.
– ఇన్ని అరాచకాలు జరుగుతున్నా రక్షణ కల్పించాల్సిన పోలీసులు వేడుక చూస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో 17న ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో టీడీపీ సంపూర్ణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది.
– ఈ వారం రోజుల్లో 9 మంది కౌన్సిలర్లపై దాడులు చేసి, ప్రలోభాలకు గురిచేసి తమ వైపునకు తిప్పుకున్నారు. వైయస్ఆర్‌సీపీ నుంచి గెలిచిన వ్యక్తినే టీడీపీ వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. 

– పిడుగురాళ్లలో మొత్తం 33 మంది కౌన్సిల్‌ స్ధానాలుండగా అన్నింటా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక్కడ కూడా టీడీపీకి ప్రాతినిథ్యమే లేకపోయినా వైస్‌ చైర్మన్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు చేయని దౌర్జన్యాలు లేవు. 
– ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేయించారు. బెదిరించి, భయపెట్టి వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీ వైపునకు తిప్పుకున్నారు. 
– తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదన్న కక్షతో 29వ వార్డు కౌన్సిలర్‌ మునీరా రెండు ఇళ్లను యరపతినేని కూల్చేయించారు. 
    తిరుపతి కార్పొరేషన్‌లో ఒకే ఒక్క సీటుతో డిప్యూటీ మేయర్‌ పదవిని కైవసం చేసుకోవడానికి అనుసరించిన అప్రజాస్వామిక విధానాలను తుని, పిడుగురాళ్లలోనూ కొనసాగిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష వైయస్సార్సీపీ నాయకుల మీద దాడులు చేస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు అనుసరించిన విధానాలతోనే రాబోయే రోజుల్లో ఆయనకు గుణపాఠాలు నేర్పుతామని టీజేఆర్‌ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు.

Best Web Hosting Provider In India 2024