


Best Web Hosting Provider In India 2024
TG New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై బిగ్ అప్‌డేట్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
TG New Ration Cards : తెలంగాణలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు.. మళ్లీమళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో.. వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు.
చిగురిస్తున్న ఆశలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. తొమ్మిదేళ్లు ఆశలతో ఎదురుచూశారు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో లబ్ధిదారుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. తొలుత ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత నిర్వహించిన గ్రామసభల్లో పేర్లు రాని వారు ఇప్పుడు మీసేవ కేంద్రాల్లో అప్లై చేస్తున్నారు.
3 రకాల అప్లికేషన్లు..
ప్రస్తుతం ప్రభుత్వం మూడు రకాల దరఖాస్తులను స్వీకరించేలా అవకాశం కల్పించింది. ఇప్పటివరకు అసలు రేషన్ కార్డులేని వారు నూతనంగా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులో తల్లిదండ్రుల పేర్లు ఉండి.. పిల్లల పేర్లు లేని వారు, పెళ్లిళ్లు చేసుకున్న మహిళలు పుట్టింట్లో తమ పేరును తొలగించుకుని అత్తారింటి కార్డుల్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
మళ్లీ అవసరం లేదు..
ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు వారి చిరునామా మార్పునకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇలా మూడు రకాల దరఖాస్తులను మీసేవ కేంద్రాల ద్వారా స్వీకరిస్తున్నారు. గ్రామసభలో పేరు వచ్చిన వారు, దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ మీ సేవ కేంద్రాల్లో అర్జీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అయినా ఎక్కడ తమకు కార్డు రాకుండా పోతుందనే ఆందోళనతో.. ప్రజలు మీసేవ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.
తుది గడువు ఏమీ లేదు..
గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోని అర్హులైనవారు ఎవరైనా ఉంటే.. మీసేవ కేంద్రాల్లో అర్జీలు పెట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు అంటూ ఏమి లేదని స్పష్టం చేస్తున్నారు. గ్రామ సభల్లో దరఖాస్తు పెట్టుకున్న వారు మళ్లీ మీ సేవలో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రభుత్వ ఆదేశాల కోసం చూస్తున్నామని అధికారులు వివరిస్తున్నారు.
పేర్లులేని వారే..
ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా.. ఈ నాలుగు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి.. అర్హుల జాబితాను జనవరి 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించి చదివి వినిపించారు. అందులో పేర్లు లేని అర్హులైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు.
టాపిక్