



Best Web Hosting Provider In India 2024

Grama Ward Sachivalayam : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులెవ్వరనీ తొలగించం, అపోహలు నమ్మొద్దు- మంత్రి డోలా
Grama Ward Sachivalayam : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను నాలుగు కేటగిరీల్లో రేషనలైజేషన్ చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ఉద్యోగులెవ్వరినీ తొలగించడం లేదని, అపోహలు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు.
Grama Ward Sachivalayam : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులను ఏ, బీ, సీ కేటగిరీలుగా రేషనలైజేషన్ చేయాలని నిర్ణయించామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. సోమవారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి సమావేశమయ్యారు. పదోన్నతులు కల్పించాలని, పీఆర్సీ వేయాలని ఉద్యోగులు మంత్రికి వినతులు సమర్పించారు. సచివాలయ ఉద్యోగులను ఎ, బి, సి కేటగిరీలుగా రేషనలైజేషన్ చేయాలని నిర్ణయించామని ఉద్యోగ సంఘాల నేతలకు వివరించామని మంత్రి తెలిపారు.
సీనియర్ అధికారులతో కమిటీ
సీనియర్ అధికారులతో కమిటీని నియమించి సర్వీస్ నిబంధనలు రూపొందిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. రేషనలైజేషన్ విషయంపై అధికారుల కమిటీ పరిశీలన చేస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియతో కొంతమందిని తొలగిస్తారనే అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని నమ్మొద్దని సూచించారు. ఉద్యోగులెవ్వరినీ తొలగించడం లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని శాఖల్లో చాలా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. మహిళా పోలీసుల విషయంలో మహిళా శిశుసంక్షేమశాఖ, హోంశాఖలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
సచివాలయల ఉద్యోగులను మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా ప్రభుత్వం విభజించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయా (11,162 గ్రామ, 3,842 వార్డు సచివాలయాలు)ల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. 2,500 మంది జనాభా ఉన్న సచివాలయాలను ఏ కేటగిరీగా, 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉంటే బీ కేటగిరీగా, 3,501 కంటే ఎక్కువగా జనాభా ఉంటే సీ కేటగిరీగా విభజించారు. ఆ మేరకు సచివాలయ సిబ్బందిని కుదించనున్నారు.
ఇతర శాఖల్లో సర్దుబాటు
2,500 మంది జనాభా ఉన్న సచివాలయానికి (ఏ కేటగిరీ) ఆరుగురు, 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉన్న సచివాలయానికి (బీ కేటగిరీ) ఏడుగురు, 3,501 కంటే ఎక్కువగా జనాభా ఉన్న సచివాలయానికి (సీ కేటగిరీ) ఎనిమిది మంది కేటాయించారు. ఇలా ఉద్యోగులను విభజించడంతో దాదాపు 40 వేల మంది ఉద్యోగులు మిగిలారు. వీరిని ఇతర శాఖల్లో వివిధ అవసరాలకు ప్రభుత్వం వినియోగించనుంది.
మిగులు ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసే అంశంపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఫోకస్ పెట్టారు. ఇంజనీరింగ్, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో ఖాళీల వివరాలు, వాటిల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల భర్తీ తదితర అంశాలపై చర్చించారు. ఉద్యోగ సంఘాలు తమ ప్రమోషన్ ఛానల్‌పై డిమాండ్ చేస్తున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్