


Best Web Hosting Provider In India 2024
Plane crash : ల్యాండింగ్ సమయంలో క్రాష్- తలకిందులుగా పడిపోయిన విమానం! భయానక దృశ్యాలు..
Toronto plane crash : కెనడా టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం క్రాష్ అయ్యి, తలకిందులుగా పడిపోయింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
కెనడా టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది! ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ల్యాండింగ్‌కి ప్రయత్నించిన డెల్టా ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం క్రాష్ అయ్యింది. ఆ వెంటనే ఆ భారీ విమానం తలకిందులుగా పడిపోయింది. ఈ ఘటనలో 18మంది గాయపడ్డారు.
అసలేం జరిగింది..?
పియర్సన్ విమానాశ్రయంలో మంచు నేలపై ల్యాండ్ అవుతుండగా కూలిపోయిన డెల్టా ఎయిర్‌లైన్స్ (ఎండీవర్ ఎయిర్ ఫ్లైట్ 4819) విమానం నుంచి ప్రయాణికులను బయటకు తీస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు గ్రౌండ్ సిబ్బంది సాయంతో విమానం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.
అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నియాపోలిస్ నుంచి 76 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో బయలుదేరిన ఎండీవర్ ఎయిర్ ఫ్లైట్ 4819.. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం కెనడాలోని అతిపెద్ద నగరంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించి క్రాష్ అయ్యింది.
డెల్టా ఎయిర్‌లైన్స్ విమానానికి ప్రమాదం జరిగిన సమయంలో అందులో 80మంది ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో మొత్తం 18మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది (ఒక చిన్నారి, 60ఏళ్ల పురుషుడు, 40ఏళ్ల మహిళ). క్షతగాత్రులంతా ప్రస్తుతం టొరంటోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
డెల్టా ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదానికి గల కారణాలు, రెక్కలు తెగిపోయిన విమానం తలకిందులుగా ఎలా పడిందనే దానిపై విమానయాన సంస్థ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ప్రమాదం తర్వాత డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం చుట్టూ మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు మరో వైరల్ వీడియోలో కనిపించింది.
“సీట్లకు వేలాడుతూ కనిపించారు..”
ఈ ఘటనతో షాక్ అయిన ప్రయాణికులు ఇప్పుడు ఒక్కొక్కరుగా తమ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
“మా విమానం ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయ్యింది. తలకిందులుగా పడి ఉంది,” అని సంబంధిత విమానం ఫొటోలను ఓ ప్యాసింజర్ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. “అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. చాలా మంది ఓకే-ఓకేగా ఉన్నారు. మేమంతా దిగుతున్నాం,” అని రాసుకొచ్చారు.
“ముందు మేము నేలకు క్రాష్ అయ్యాము. ఆ తర్వాత పక్కకు పడిపోయాము. ఆ తర్వాత తలకిందులుగా పడిపోయాము,” అని మరో ప్రయాణికుడు పేర్కొన్నారు. “విమానం తలకిందులు అవ్వడంతో చాలా మంది సీట్ల నుంచి వేలాడుతూ కనిపించారు. వారికి మేము సాయం చేశాము,” అని ఆ ప్రయాణికుడు వెల్లడించాడు.
సంబంధిత కథనం
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link