



Best Web Hosting Provider In India 2024

Chicken cause Bird Flu: బర్డ్ ఫ్లూ భయంతో తగ్గిన చికెన్ ధరలు! కోడి గుడ్లు, మాంసం తింటే ప్రమాదం లేదనడంలో వాస్తవమెంత?
Bird Flu: బర్డ్ ఫ్లూ కేసులు భయంతో వణికిస్తుంటే, భారీగా తగ్గుతున్న చికెన్ ధరలు ఊరిస్తున్నాయ్! బర్డ్ ఫ్లూ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని నాన్ వెజ్ ప్రియులు గందరగోళంలో పడిపోయారు. ఈ సమయంలో చికెన్ లేదా కోడి గుడ్లు తినడం ఎంతవరకూ సేఫ్? అనే ఆలోచనలో ఉండిపోయారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. చాలా మంది చికెన్, కోడిగుడ్లకు దూరంగా ఉండటంతో సేల్స్ పడిపోవడంతో ఈ పరిస్థితి తప్పలేదు. కానీ, కొందరు ఆరోగ్య నిపుణులు చికెన్ తినడం ప్రమాదకరం కాదని చెప్తున్నారు. అందులో వాస్తవాలు ఎలా ఉన్నాయి? చికెన్ తింటే, ఎందుకు ప్రమాదకరం కాదో తెలుసుకుందాం రండి.
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అధికారులు పౌల్ట్రీ ఉత్పత్తులైన చికెన్, కోడి గుడ్లు తినాలనుకునే వారు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. H5N1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ (బర్డ్ ఫ్లూ) కారణంగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు వైరస్ సోకిన ఏరియాల నుంచి పౌల్ట్రీ ఉత్పత్తులను వేరే ప్రాంతాలకు తీసుకెళ్లడాన్ని కూడా నిషేదించారు. ప్రజల్లో ఇంతటి భయాందోళనలు రేకెత్తిస్తున్న బర్డ్ ఫ్లూ నిజంగా ప్రమాదకరమేనా? అంటే అవుననే అంటున్నారు.
కోళ్లు, గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందా?
చాలా మందిలో ఉన్న అనుమానం ఏంటంటే, పౌల్ట్రీ ఉత్పత్తులైన చికెన్, కోడి గుడ్లు ఉడికించుకుని లేదా వండుకుని తినడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్లో గుడ్లు కొనుగోలు చేసి ఇంటికి వచ్చేటప్పుడే సరైన రీతిలో ప్యాకింగ్ చేయించుకోవాలి. వాటిని 175 డిగ్రీల ఫారెన్ హీట్ లేదా 80 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వరకూ వేడి చేసుకుని వండుకోవాలి. ఇక గుడ్ల విషయానికొస్తే పచ్చసొన, తెల్ల సొన పూర్తిగా ఉడకాలి. మీకు ఇంతకుముందు హాఫ్ బాయిల్డ్ ఎగ్ తినే అలవాటుంటే, అది కొద్ది రోజుల వరకూ వాయిదా వేసుకోవడమే బెటర్ ఆప్షన్.
చికెన్ తినొచ్చా:
మాంసాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడి తినేది చికెన్. దీనిని వండుకునేటప్పుడు దాదాపు 165 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద వేడి చేస్తే అందులో ఉండే బ్యాక్టీరియా, వైరస్లు అనేవి నశించిపోతాయి. బర్డ్ ఫ్లూ లాంటి వైరస్ కూడా కనిపించకుండా పోతుంది. కాకపోతే మార్కెట్ నుంచి తీసుకువచ్చేటప్పుడే సేఫ్ గా ప్యాక్ చేయించుకుని వచ్చిన చికెన్ ను పూర్తిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత చికెన్ తీసుకొచ్చిన కవర్ లేదా సంచిని కాల్చేయాలి. లేదా శుభ్రంగా కడగాలి. మాంసం పచ్చిగా ఉన్న సమయంలో మీరు ముట్టుకుని ఉంటే, చేతులను క్లీన్ చేసుకోవడం మర్చిపోవద్దు.
బర్డ్ ఫ్లూ వైరస్ అనేది అంటు వ్యాధి మాత్రమే. కోడి మాంసం తినడం వల్ల వచ్చే వ్యాధి కాదు. ఈ వైరస్ ఉన్న ప్రాంతంలో తిరిగినా, వైరస్ కారణంగా చనిపోయిన కోళ్ల కారణంగా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. లేదా వైరస్ వ్యాప్తి ఉన్న ప్రాంతంలో తిరగడం వల్ల వ్యాప్తి చెందుతుంది. అందుకే కోళ్ల ఫారమ్ లో పనిచేసే వ్యక్తులు, షాపు యజమానులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వైరస్ సోకిన వ్యక్తుల్లో ఉండే లక్షణాలు:
- అధిక జ్వరం
- దగ్గు
- గొంతు నొప్పి
- కండరాల్లో నొప్పులు
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
ఈ వైరస్ కారణంగా కొద్ది మందిలో న్యూమోనియా, శ్వాసకోస ఇబ్బందులు సంభవిస్తే చాలా అరుదుగా ప్రాణాలు కూడా కోల్పోతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం