


Best Web Hosting Provider In India 2024
Bhupalpally District : ‘ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నాం’ – కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్సీతో దంపతుల నిరసన
ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. ఆత్మహత్యకు అనుమతించండంటూ వృద్ధ దంపతులు ఆందోళనకు దిగారు. భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్సీతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. భూమి బాట విషయంలో వివాదం నెలకొందని… తమపై అక్రమ కేసులు పెట్టారని వాపోయారు. దీంతో ఆర్డీవో వారితో మాట్లాడి నిరసన విరమింపజేశారు.
తమ భూమిలోకి వెళ్లే బండ్ల బాటను ఓ ఎస్సై దున్ని తన భూమిలో కలుపుకున్నాడని.. అడిగితే అక్రమ కేసులు పెట్టడంతో పాటు మూడేళ్లుగా వ్యవసాయం చేయనివ్వడం లేదని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు వాపోయారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, తాము ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు వృద్ధ దంపతులు ఇద్దరూ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్సీ పట్టుకొని నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన, ప్రతాపరెడ్డి దంపతులు. వీరికి అదే గ్రామంలో 12 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి పక్కనే ములుగు జిల్లా కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్, అతడి కుటుంబ సభ్యులకు భూమి ఉంది. కాగా వృద్ధ దంపతుల భూమిలోకి వెళ్లే బండ్ల బాటను ఎస్సై, ఆయన కుటుంబ సభ్యులు కలిసి 2022 మే 15న దున్నుకొని తమ భూమిలో కలుపుకున్నారు. అప్పటి నుంచి దంపతులను భూమిలోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారు. అంతేగాకుండా ఇదేంటని అడిగినందుకు అక్రమ కేసులు పెట్టారు.
ప్రజా దర్బార్ లో ఫిర్యాదు….
తమను కేసులు పెట్టీ వేధిస్తుందటంతో బాధిత వృద్ధ దంపతులు 2023 డిసెంబర్ 12న సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బారులో ఫిర్యాదు చేశారు. ఎస్సై అక్రమ కేసులు పెట్టాడని, దాని వల్ల మూడేళ్లుగా తాము పంటలు సాగు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు స్పందించిన అక్కడి ఆఫీసర్లు సమస్యను పరిష్కరించాలని భూపాలపల్లి జిల్లా అప్పటి కలెక్టర్ భవేశ్ మిశ్రాకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు అప్పటి ఆర్డీవో రమాదేవి 2023 డిసెంబర్ 18 ఒకసారి, 27న రెండోసారి ఫీల్డ్ విజిట్ చేశారు. రైతు సులోచన ఫిర్యాదుతో రెండు సార్లు ఫీల్డ్ విజిట్ చేసిన ఆర్డీవో రమాదేవి పాత రికార్డులు, చుట్టుపక్కల రైతుల వాంగ్మూలాలు సేకరించారు. బండ్ల బాటను దున్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై, అతని తండ్రి, సోదరుడితో కూడా మాట్లాడి వివరాలు సేకరించారు.
బాటను పునరుద్ధరించాలని ఆదేశం….
వేములపల్లి శివారులో సర్వే నంబర్ 296, 298 భూముల నుంచి మెట్టుపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 30,79, 80లో గల వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకు బండ్ల బాట వాడుకున్నారని గుర్తించిన అప్పటి ఆర్డీవో ఆ బాటను పునరుద్ధరించాలని గతేడాది జనవరి 8న ఉత్తర్వులు జారీ చేశారు. కానీ లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా మొగుళ్లపల్లి తహసీల్దార్, ఎస్సై కలిసి ఇరువర్గాల సమక్షంలో బాటను పునరుద్ధరించాలని సూచించారు. కానీ ఆర్డీవో ఆదేశాలు ఇప్పటివరకు అమలు కాలేదు.
దీంతో బాటను పునరుద్ధరించాలని మొగుళ్లపల్లి తహసీల్దార్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై తన పలుకుబడిని ఉపయోగించి ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తూ బాటను పునరుద్ధరించకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. ఈ వయసులో పోరాటం చేయడం తమ వల్ల కావడం లేదని ఆవేదన చెందారు.
అందుకే తాము చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని ఫ్లెక్సీ పట్టుకొని కలెక్టరేట్ ఎదుట నిలబడ్డారు. దీంతో ఆర్డీవో రవి ఆ వృద్ధ దంపతులతో మాట్లాడి నిరసన విరమింపజేశారు. ఇదే విషయమై మొగుళ్ళపల్లి అధికారులని సంప్రదించగా బండ్ల బాట వేయడానికి అవతలి వాళ్లు ఒప్పుకోవట్లేదని చెబుతున్నారు. ఆర్డీవో ఇచ్చిన ఆర్డర్స్ లో ఇరుపక్షాల సమక్షంలోనే బాట పునరుద్ధరించాలని ఉందని కానీ అవతలి వాళ్ల నుంచి స్పందన ఉండటం లేదని చెబుతుండటం గమనార్హం.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్