



Best Web Hosting Provider In India 2024

హస్తం పార్టీకి హనీమూన్ ముగిసింది.. బోటుకు ఇక మరమ్మతులు అవసరం.. పీపుల్స్ పల్స్ విశ్లేషణ
‘కాంగ్రెస్ కావాలి.. మార్పు రావాలనే నినాదంతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీకి హనీమూన్ ముగిసింది..’ – క్షేత్రస్థాయి సర్వేల్లో పాల్గొనే పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నుంచి అనలిస్ట్ మురళీ కృష్ణ అందిస్తున్న విశ్లేషణ ఇది.
తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకు తెరదించుతూ ‘మార్పు’ నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ‘హనీమూన్’ కాలం ముగిసింది. పగ్గాలు చేపట్టి 15 నెలలవుతున్నా ‘మార్పు’ సంతృప్తి ఇటు రాష్ట్ర ప్రజల్లో, అటు కాంగ్రెస్‌లోనూ కనిపించడం లేదు.
మిగులు బడ్జెట్ తెలంగాణాను బీఆర్‌ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చినా.. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదేపదే వల్లె వేస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఏర్పడడం లేదు. పార్టీలో కూడా ఎక్కడో ఏదో తెలియని అసంతృప్తి గూడుకట్టుకొని ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ‘ఇది మేం తెచ్చిన మార్పు’ అని బల్లగుద్ది చెప్పలేని పరిస్థితిలో పార్టీ ఉంది. రేవంత్ ప్రభుత్వం నుండి ప్రజలు ఆశించినంత మార్పు కనిపించకపోవడంతో పార్టీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయి నుండి నిత్యం సమాచారం తెప్పించుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం చేతులు కట్టుకుని కూర్చుంటుందా? నష్ట నివారణలో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జీగా ఉన్న దీపాదాస్ మున్షీ స్థానంలో కొత్తగా మీనాక్షి నటరాజన్‌ను పార్టీ నియమించింది. పార్టీ ఇన్చార్జీ మార్పుతో తెలంగాణలో ప్రజలు, పార్టీ ఆశించిన మార్పు కాంగ్రెస్‌లో వస్తుందా..? కాంగ్రెస్ పార్టీ రీచార్జ్ అవుతుందా? వంటి అనేక సందేహాలు పార్టీ నేతల, సాధారణ కార్యకర్తల మెదల్లో మెదులుతున్నాయి.
సానుకూలత ఎందుకు రాలేదు
రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా ఎంతో కష్టపడి పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆ కష్టానికి ఫలితాలు కనబడడం లేదు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు వంటి పథకాల అమలుతో ఏడాదిలోనే 55 వేలకు పైగా ప్రభుత్వ నియామకాలు, రూ. 25 లక్షలతో రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఏదో లోపంతో ప్రజల్లో సానుకూలత ఏర్పడడం లేదు.
రైతు భరోసా మొదట సంక్రాంతిలోగా అందిస్తామని, తర్వాత జనవరి 26న ఇస్తామని, అనంతరం మార్చి 31లోగా సంపూర్ణంగా పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కోటిన్నర ఎకరాలకు గాను ఇప్పటివరకూ విడతల వారీగా మూడెకరాల్లోపూ రైతులకు 58 లక్షల ఎకరాల వరకు రూ. 3,487 కోట్లను జమ చేసింది. ప్రభుత్వం రైతు భరోసాను ఇస్తున్నామని ఎంత ప్రచారం చేస్తున్నా, ప్రణాళికబద్దంగా లేకుండా విడతల వారీగా చెల్లిస్తుండడంతో ప్రభుత్వానికి రావాల్సిన మైలేజీ రావడం లేదు. తొలుత మొదటి పేజీ వార్త అయిన రైతు భరోసా ఇప్పుడు లోపలి పేజీల్లోకి పరిమితమైంది.
అదొక ప్రహసనంగా
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నాలుగు లక్షల ఇళ్ల కోసం రూ. 22 వేలకుపైగా కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా గతంలో బీఆర్‌ఎస్ హయాంలో ఇళ్లు వచ్చిన వారికే మళ్లీ ఇండ్లు వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 40 లక్షల నూతన రేషన్ కార్డులు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ప్రజల్లో ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి.
తొలుత గ్రామసభల ద్వారా అందరికీ ఇస్తామని చెప్పి, అనంతరం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో రేషన్ కార్డుల పంపిణీ ఒక ప్రహసనంగా మారింది. జనవరి 26న రూ.45 వేల కోట్ల వ్యయంతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించినా రేవంత్ సర్కారుకు క్షేత్రస్థాయిలో ఆశించిన సానుకూలత రావడం లేదు.
కాంగ్రెస్ సర్కార్ పథకాలు అమలు చేస్తున్నా అవి విడతల వారీగా అందుతుండడం, నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టడం వల్ల మొదట్లోనే వ్యతిరేకత మూటగట్టుకుంది. రూ. 2 లక్షల లోపే రుణం ఉన్నా రుణమాఫీ అందని రైతులు చాలా మంది ఉన్నారు. రుణమాఫీ పేరుతో దాదాపు ఏడాదికి పైగా రైతు భరోసా ఇవ్వనేలేదు.
ఆ భావన మొదలైంది..
వీటి కారణంగా ప్రభుత్వానికి సానుకూలత రాకపోగా, ప్రజల్లో రోజురోజుకు అసంతృప్తి పెరుగుతుంది. దీంతో ‘బీఆర్‌ఎస్ ప్రభుత్వమే మేలేమో!’ అనే భావన మొదలైంది. ప్రభుత్వానికి సరైన దిశా నిర్దేశం లేకపోవడం, ఏ అంశంపై దృష్టి పెట్టాలో స్పష్టత లేకపోవడమే వీటికి ప్రధాన కారణం. ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నప్పుడు తప్ప, అనంతరం వీటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో పార్టీ పూర్తిగా విఫలమవుతోంది. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య గ్యాప్ పెరగడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కిందస్థాయిలో సరైన ప్రచారం లభించడం లేదు.
ఆరంభ శూరత్వం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గందరగోళంగా ఉంటున్నాయి. కొన్ని రోజులు మూసీ సుందరీకరణ, హైడ్రాతో హైదరాబాద్ చెరువుల పరిరక్షణ అంటూ హడావుడి చేశారు. మరికొన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫార్ములా కారు రేస్, ఫోన్ ట్యాపింగ్ అంశాలను తీసుకొచ్చి అనంతరం వాటి ఊసే ఎత్తకపోవడంతో ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతుందనే ప్రతిపక్షాల వాదనకు బలం చేకూర్చినట్టవుతుంది. ఇవన్నీ ఆరంభ శూరత్వంలా మిగిలిపోతున్నాయి.
ప్రజల్లో గందరగోళం
కులగణన, ఎస్సీ వర్గీకరణను చారిత్రాత్మక నిర్ణయాలుగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నా వీటిపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ అంశాలపై పార్టీ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇవ్వడం కన్నా మేధావులు, నిపుణులతో వివరాలు అందించి ఉంటే ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుంది. కులగణన విషయంలో అసందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అంశాన్ని లేవనెత్తడంతో ఇందిరాగాంధీ కుటుంబ వివరాలు కూడా చర్చకు వచ్చి అసలైన అంశం పక్కదారిపట్టింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు అనవసర విషయాలపై కాకుండా సర్కారు అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తే సానుకూలత ఏర్పడే అవకాశాలుంటాయి.
1983లో టీడీపీ ఆవిర్భావం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారనే నినాదం మీద జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతున్నట్టుగా వ్యవహరిస్తోందనే విమర్శలొస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో గడిపే సమయం కంటే ఢిల్లీలోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని వారి పార్టీ నాయకులు, కార్యకర్తలే ప్రయివేట్ సంభాషణలో ప్రస్తావిస్తున్నారు.
కేసీఆర్ ఫామ్‌హౌజ్ ముఖ్యమంత్రి అని, వాస్తును నమ్మి సచివాలయానికి రారని కాంగ్రెస్ పార్టీ విమర్శించేది. అయితే, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సీఎం కూడా వాస్తుకు భయపడే కమాండ్ అండ్ కంట్రోల్ ఆఫీస్ ద్వారా పని చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించే అవకాశాలు ఇస్తున్నారు. ఎక్కడి నుంచి పని చేసినా, ఆయనకు పార్టీపై పూర్తి కమాండ్, పాలనపై కంట్రోల్ లేకుండా పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆయన సీఎంగా ఒక బలమైన ముద్ర వేయలేకపోవడమే దీనికి నిదర్శనమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యక్తిగత విమర్శలు కూడా మితిమీరడంతో పార్టీకి ప్లస్ కంటే మైనస్సే అవుతుంది. అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పదునైన మాటలతో ఘాటైన విమర్శలు పదేపదే చేస్తుండడంతో కేసీఆర్‌పై జాలి పెంచేలా ఉంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మంత్రులు, ఎమ్మెల్యేల కార్యాలయాల్లో బీఆర్‌ఎస్ పాలనలో ఉన్న అధికారులే కొనసాగుతున్నారు. గతంలో పలు సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై కఠినంగా వ్యవహరించిన అధికారులే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కీలక అధికారులుగా ఉండడం పార్టీ కేడర్‌కు నచ్చడం లేదు. పార్టీ కేడర్‌ను పట్టించుకోకుండా అధికారుల అండతోనే పాలన సాగిస్తే నేతలు, కార్యకర్తలు పార్టీకి దూరమవుతారు. కార్యకర్తలు దూరమైతే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పటికే చరిత్ర అనేక గుణపాఠాలను రాసిపెట్టి ఉంచింది!
ఫిరాయింపుల కేసు మెడపై
పార్టీ ఫిరాయింపులపై గతంలో బీఆర్‌ఎస్‌ను విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు అదే బాటలో నడుస్తుంది. బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన ప్రజా ప్రతినిధులపై సుప్రీం కోర్టులో ఉన్న కేసు మెడపై కత్తిలా వేలాడుతోంది. ఒకవేళ ఈ కేసులో ప్రతికూల తీర్పు వస్తే పార్టీ ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా, ఉప ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్‌కు ఇబ్బందిరకమే.
కాంగ్రెస్‌లోకి వచ్చిన కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీకి నిత్యం సమస్యలొస్తున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక సమస్యపై గళమెత్తుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఒకసారి కాంగ్రెస్‌లో చేరినట్టు, మరోసారి బీఆర్‌ఎస్‌లోకి తిరిగి వెళ్లినట్టు, చివరికి కాంగ్రెస్‌లోనే ఉన్నట్టు ఇలా గందరగోళ వార్తలతో పార్టీకి మంచి కంటే చెడే ఎక్కువ అవుతుంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా, నేటికీ సీఎల్పీకి కార్యవర్గం లేదు. మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. టీపీసీసీకి కూడా కార్యవర్గం లేదు. ప్రభుత్వానికి, టీపీసీసీకి, ఏఐసీసీకి మధ్య గ్యాప్ ఉండడంతో పదవులను భర్లీ చేయడంలో ఆలస్యమవుతుంది.
పార్టీ కష్టంలో ఉన్నప్పుడు శ్రమించిన కార్యకర్తలకు ఇవ్వాల్సిన దాదాపు 600 డైరెక్టర్ పోస్టులు ఇప్పటికీ భర్తీ చేయలేదు. దీనికి కారణం… ముఖ్యమంత్రికి, మంత్రులకు సమన్వయం లేకపోవడమే. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కూడా సమన్వయం లేదు. టీపీసీసీ అధ్యక్షుడికి కింద స్థాయి పార్టీ క్యాడర్‌కి మధ్య సమన్వయం లేదు. సీఎం ఢిల్లీ టూర్లతో, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ ఫారిన్ టూర్లతో బిజీగా ఉంటున్నారు. బాధ్యతలు చేపట్టిన 5 నెలల్లో కనీసం 5 జిల్లాలను కూడా పర్యటించని టీపీసీసీ అధ్యక్షులు మూడు విదేశీ పర్యటనలు చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ప్రజలకు చేరువ కావడంలో, ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక భూమిక పోషిస్తుంది. సోషల్ మీడియా అస్త్రాన్ని సమర్థవంతంగా వినియోగించుకోడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. సొంత హ్యాండీల్స్‌లో సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటూ ప్రత్యలర్థుకు అస్త్రాలందిస్తూ పార్టీ నవ్వుల పాలవుతోంది. సోషల్ మీడియాలో బలంగా ఉండే బీఆర్‌ఎస్ ప్రచారానికి కాంగ్రెస్ కౌంటరిచ్చే సంగతి దేవుడెరుగు, కనీసం సమాధానం కూడా ఇవ్వలేకపోతోంది. కొత్త తరాన్ని ఆకర్షించాలంటే సోషల్ మీడియాను తక్షణం బలోపేతం చేయడం కాంగ్రెస్ ముందున్న పెద్ద సవాల్.
పార్టీ కమిటీల పనితీరూ అంతే
టీపీసీసీ అధ్యక్షులు పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ కేంద్రంగా పని చేయాలి. ప్రస్తుత అధ్యక్షులు ప్రయివేట్ గెస్ట్ హౌజ్‌ల నుంచి ఎక్కువ పని చేస్తున్నారని, ఆ పార్టీ నాయకులే గాంధీభవన్‌లో వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బందికి కనీసం జవాబుదారీతనం లేకపోవడంతో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. పైరవీకారులు, ప్రజల్లో పలుకుబడి లేని నాయకులను ఆయన అంటిపెట్టుకోవడంపై కేడర్ గుర్రుగా ఉంది. దీనిని గుర్తించకుండా గుడ్డిగా ముందుకెళ్తే సాధారణ కార్యకర్త నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన మహేశ్ కుమార్ ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
టీపీసీసీ అధ్యక్షులు పార్టీని బలోపేతం చేయడం కన్నా ఎక్కువ సమయం ముఖ్యమంత్రి, మంత్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పార్టీని గాలికొదిలేస్తున్నారని పార్టీ శ్రేణులు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఏదైనా సందర్భంలో ఎవరైనా గాంధీ భవన్‌లో గంట గడపాల్సి వస్తే ‘ఎవరి గోల వారిదే’ అన్నట్టు ఉంటుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీలను, రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించుకునే అంశంపై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేకపోయారు. కాంగ్రెస్ అనుబంధ సంస్థలైన యువజన, ఎన్.ఎస్.యూ.ఐ, మహిళా, సేవాదళ్ సంఘాలు చురుగ్గా పనిచేయడం లేదు.
ప్రతిపక్షం విసుర్లు
ఇది 10 పర్సెంటేజీ సర్కారంటూ, ఢిల్లీ హైకమాండ్‌కు తెలంగాణ నుంచే భారీగా నిధులు వెళ్తున్నాయంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో కర్ణాటకలో పర్సేంటేజీ ప్రభుత్వమని విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పర్సేంటేజీ అపవాదాన్ని తొలగించుకోకపోతే ఇబ్బందులు తప్పవు.
ఇన్ని సవాళ్ల మధ్య ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురీత తప్పదని పీపుల్స్ పల్స్ క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడయ్యింది. ప్రజల్లో సన్నగిల్లుతున్న విశ్వసనీయతను తిరిగి పొందడానికి వెంటనే రాజకీయ వ్యూహాన్ని మార్చుకోవడం తప్పనిసరి. దీనికి పార్టీని, ప్రభుత్వ పనితీరుని పారదర్శకంగా సమీక్షించుకుని, ప్రక్షాళన చేస్తూ ప్రణాళికలు అమలు చేయాలి. ఇవేమీ చేయకుండా పార్టీ ఇన్చార్జీగా దీపాదాస్ మున్సీ స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చినా ఏదో మ్యాజిక్ జరిగిపోయి కాంగ్రెస్‌కు ఇప్పటికప్పుడు మైలేజీ పెరుగుతుందనుకోవడం పగటి కలే!!
ఇటీవల ఒక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ ‘బోటుకు చిల్లు పడితే అందరం మునుగుతాం’ అని వ్యాఖ్యానించారు. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి మొదలవడంతోనే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో పది మందికిపైగా ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనే వార్తలొస్తున్నా, అంతకంటే ఎక్కువే ఉండవచ్చనే ప్రచారం ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బోటుకు చిల్లులు పడినట్టే కనిపిస్తుంది. సరైన మరమ్మతులు చేసి చిళ్లులను పూడ్చుకోవాలి. లేకపోతే పార్టీ పుట్టమునగడం ఖాయమని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరి పార్టీ అధిష్టానం కొత్త ఇన్చార్జీతో ఏ మేరకు కాంగ్రెస్ బోటుకు మరమ్మతులు చేస్తుందో కాలమే నిర్ణయించాలి.
-జి.మురళీ కృష్ణ,
సీనియర్ రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ
(గమనిక: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు, వ్యూహాలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్ (హెచ్‌టీ)వి కావు. వీటికి హెచ్‌టీ బాధ్యత వహించదు)
టాపిక్