అతిపెద్ద క్రీడా సంబరానికి చ‌క‌చ‌కా ఏర్పాట్లు

Best Web Hosting Provider In India 2024

అమరావతి : దేశంలోనే అతిపెద్ద క్రీడా సంబరానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ‘ఆడుదాం–ఆంధ్ర’ పేరుతో దాదాపు 43 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీకి ఊరూవాడా ముస్తాబవుతున్నాయి. ఈ భారీ క్రీడా పండుగ నిమిత్తం ప్రభుత్వం ఈనెల 27 నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వారీగా క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించనుంది.

వలంటీర్ల ద్వారా ఇంటింటికీ ‘ఆడుదాం–ఆంధ్ర’పై ప్రచారం కల్పించడంతో పాటు ఆసక్తి ఉన్న క్రీడాకారుల వివరాలను నమోదు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌తో పాటు వెబ్‌సైట్‌ను రూపొందిస్తోంది. ఇక పోటీలకు డిసెంబర్‌ 15 నుంచి వచ్చే ఏడాది జవనరి 26 వరకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందులోని ఐదు క్రీడాంశాల్లో రికార్డు స్థాయిలో 2.99 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

మూడు విధాలుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ..
♦ రాష్ట్రంలోని 15,004 గ్రామ/వార్డు సచివాలయాల వారీగా వలంటీర్లు ఈ పోటీలకు క్రీడాకారుల వివరాలను నమోదు చేయడంతోపాటు ప్రజలను క్రీడా మహోత్సవానికి ఆహ్వానిస్తారు.
♦  ఔత్సాహిక క్రీడాకారులు తమ పేరు, చిరునామా, ప్రాతినిధ్యం వహించే క్రీడల వివరాలను గుర్తింపు కార్డు ఐడీ/ఫోన్‌ నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
♦  ఒకటి కంటే ఎక్కువ క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న క్రీడాకారులు ప్రాధాన్యత క్రమంలో పాల్గొనే క్రీడల వివరాలను అందించాలి.
♦ వలంటీర్‌ ఇంటికి వచ్చినప్పుడు లేదా క్రీడాకారులే నేరుగా తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించి పోటీలకు తమ వివరాలు ఇవ్వొచ్చు.
♦ వ్యక్తిగతంగానే కాకుండా ఒక గ్రూపుగా కూడా క్రీడాకారులు తమ జట్టును నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.
♦ ఇక ప్రభుత్వం తీసుకొచ్చే వెబ్‌సైట్‌ ద్వారా కూడా క్రీడా­కారులు నేరుగా కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ..
గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఐదు రకాల కాంపిటీటివ్‌ క్రీడాంశాలు, మూడు నాన్‌–కాంపిటీటివ్‌ క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. వీటిల్లో 15 ఏళ్లకు పైబడిన బాలబాలికలకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ క్రీడలతో పాటు సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్‌ పోటీలను నిర్వహిస్తున్నారు.

ఐదు దశల్లో అంటే.. గ్రామ/వార్డు సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగానే ప్రతి సచివాలయం నుంచి 10 మంది వలంటీర్లను ఎంపిక చేసింది. సుమారు 1.50 లక్షల మంది వలంటీర్లకు క్రీడాంశాల నిర్వహణపై పీఈటీ, పీడీలతో జిల్లా చీఫ్‌ కోచ్‌ల సహాయంతో ఆన్‌లైన్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ప్రత్యేక శిక్షణనిస్తోంది.

15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో బాలబాలిక విభాగాల్లో ఒక్కొక్క జట్టు చొప్పున లెక్కిస్తే 228 మంది పాల్గొంటారు. ఇలా మొత్తం 34.20లక్షల మంది క్రీడాకారుల ప్రాతినిధ్యం వహిస్తారని అంచనా. సచివాలయం పరిధిలో ఒకటికి మించి ఎక్కువ జట్లు వస్తే క్రీడాకారుల సంఖ్య భారీగా పెరుగుతుంది.

ప్రతిభగల క్రీడాకారులకు ప్రోత్సాహం..
యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యకర సమాజానికి రాష్ట్ర  ప్రభుత్వం కృషిచేస్తోంది. ఆడుదాం–ఆంధ్ర పేరుతో నిర్వహించే ఈ మెగా టోర్నీని దేశంలోనే అతిపెద్ద క్రీడా టోర్నీగా నిలబెడతాం. దీనిద్వారా ఐదు క్రీడాంశాల్లో క్రీడాకారుల సమగ్ర వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి.

తద్వారా ప్రతిభగల క్రీడాకారులకు అవసరమైన క్రీడా శిక్షణ, ప్రోత్సాహాన్ని అందించడానికి ఎంతో వీలుంటుంది. ప్రతి క్రీడాంశాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు  పీఈటీలు, పీడీలు, శాప్‌ కోచ్‌లతో పాటు వలంటీర్లను భాగస్వాములను చేస్తున్నాం. రిజిస్ట్రేషన్‌ కోసం యాప్, వెబ్‌సైట్‌ను దాదాపు సిద్ధంచేశాం. క్రీడాకారులు వీలైనంత త్వరగా వివరాలు నమోదు చేసుకో­వాలి.– ధ్యాన్‌చంద్, ఎండీ, ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ

వివిధ స్థాయిల్లో పోటీల నిర్వహణ ఇలా..
♦   గ్రామ/వార్డు సచివాలయం: డిసెంబర్‌ 15 నుంచి 20 వరకు
♦ మండల స్థాయి : డిసెంబర్‌ 21 నుంచి జనవరి 4 వరకు
♦ నియోజకవర్గం : జనవరి 5 నుంచి 10 వరకు
♦  జిల్లా స్థాయి : జనవరి 11 నుంచి 21వరకు
♦ రాష్ట్రస్థాయి : జనవరి 22 నుంచి 26 వరకు

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *