


Best Web Hosting Provider In India 2024

Vemulawada Special Buses : మహాశివరాత్రికి వేములవాడకు 778 ప్రత్యేక బస్సులు-ఈ నెల 25 నుంచి 27 వరకు నడిపించేలా ఏర్పాట్లు
Vemulawada Special Buses : మహాశివరాత్రికి వేళయింది. ఈనెల 26న జరిగే మహాశివరాత్రి సందర్బంగా వేములవాడకు భారీగా భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ వేములవాడతోపాటు శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించింది.
Vemulawada Special Buses : దక్షణకాశిగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రం మహాశివరాత్రికి ముస్తాబవుతుంది. ఈనెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర వేడుకలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జాతర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రానున్న నేపద్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించింది. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ రీజియన్లలోని వివిధ డిపోల నుంచి ఈనెల 25 నుంచి 27 వరకు 778 అదనపు బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి. రాజు తెలిపారు.
ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలని కోరారు. వేములవాడ బస్టాండ్ లోని మేనేజర్ కార్యాలయంలో 11 డిపోల మేనేజర్లు, ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. వేములవాడలోని బస్టాండ్ కు 443, కట్ట కింద బస్ స్టేషన్ కు 335 బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు.
వీటికితోడు ఉమ్మడి జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరానికి కూడా అదనపు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు సంస్థ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
డిపోల వారీగా
వేములవాడ గుడి చెరువు కట్టకింద బస్టాండ్ కు వచ్చే బస్సుల వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ 83, ఆర్మూర్ 100, నిజామాబాద్-1 నుంచి 17, కామారెడ్డి 33, నర్సంపేట 30, వరంగల్-1 నుంచి 21, హనుమకొండ 27, పరకాల 24 మొత్తం 335 బస్సులు నడవనున్నాయి.
వేములవాడ బస్టాండ్ కు వచ్చే బస్సుల వివరాలు కరీంనగర్-1 డిపో నుంచి 67, కరీంనగర్ -2 నుంచి 37, కోరుట్ల 62, మెట్పల్లి 105, వేములవాడ 105, సిరిసిల్ల 52, హుజూరాబాద్ 15 మొత్తం 443 బస్సులు నడిపించనున్నారు.
శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారి సౌజన్యంతో 14 మినీ బస్సులు వేములవాడ (తిప్పాపూర్) నుంచి వేములవాడ గుడి వరకు, తిరుగు ప్రయాణంలో గుడి నుంచి వేములవాడ బస్ స్టేషన్ వరకు ఉచిత ప్రయాణ సేవలు అందించనున్నట్లు ప్రకటించారు.
కాళేశ్వరానికి
మంథని డిపో నుంచి మంథని- కాళేశ్వరం 26 బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటికి తోడు భక్తుల రద్దీకి అనుగుణంగా గోదావరిఖని, కరీంనగర్ నుంచి కూడా బస్సులను నడపనున్నారు.
వేలాలకు
గోదావరిఖని డిపో నుంచి గోదావరిఖని వేలాలకు 56, మంథని డిపో నుంచి మంథని-వేలాలకు 40 బస్సులు నడుస్తాయి.
దుబ్బ రాజన్నకు ఆలయానికి
జగిత్యాల డిపో నుంచి జగిత్యాల-దుబ్బరాజన్న ఆలయానికి 50 బస్సులను ఆర్టీసీ నడపనుంది.
పొట్లపల్లికి
హుస్నాబాద్ డిపో నుంచి హుస్నాబాద్- పొట్లపల్లికి 23 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ తెలిపారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
టాపిక్